Shane Warne: ఆస్ట్రేలియాకు వార్న్‌ మృతదేహం.. ఈ నెల 30న అంత్యక్రియలు

స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ మృతదేహం ఆస్ట్రేలియా చేరింది. బ్యాంకాక్‌ నుంచి ఓ ప్రత్యేక విమానంలో అతని పార్థివ దేహాన్ని గురువారం మెల్‌బోర్న్‌కు తరలించారు. అతను తుదిశ్వాస విడిచాక దాదాపు వారానికి వార్న్‌ భౌతిక కాయం స్వదేశానికి

Updated : 11 Mar 2022 07:28 IST

మెల్‌బోర్న్‌: స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ మృతదేహం ఆస్ట్రేలియా చేరింది. బ్యాంకాక్‌ నుంచి ఓ ప్రత్యేక విమానంలో అతని పార్థివ దేహాన్ని గురువారం మెల్‌బోర్న్‌కు తరలించారు. అతను తుదిశ్వాస విడిచాక దాదాపు వారానికి వార్న్‌ భౌతిక కాయం స్వదేశానికి వచ్చింది. గత శుక్రవారం థాయ్‌లాండ్‌లోని  ఓ విల్లాలో 52 ఏళ్ల వార్న్‌ గుండెపోటుతో మరణించాడని భావిస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం శవ పరీక్ష జరిపించి.. అతనిది సహజ మరణమేనని అక్కడి పోలీసులు వెల్లడించారు. ఆ మృతదేశాన్ని ఆస్ట్రేలియా జాతీయ పతకంతో కప్పిన శవపేటికలో స్వదేశానికి పంపించారు. ‘‘ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం వార్న్‌ భౌతిక కాయం ఉన్న ప్రత్యేక విమానం గురువారం మెల్‌బోర్న్‌లోని ఎస్సెండాన్‌ ఫీల్డ్స్‌ విమానాశ్రయానికి వచ్చింది. వార్న్‌ వ్యక్తిగత సహాయకుడు హెలెన్‌ నోలన్‌తో పాటు స్నేహితులు, అభిమానులు విమానాశ్రయానికి తరలివచ్చారు’’ అని ఆసీస్‌ మీడియా వర్గాలు తెలిపాయి. ఈ నెల 30న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో లక్ష మంది అభిమానుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో వార్న్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. అంతకంటే ముందు అతని కుటుంబం ప్రత్యేకంగా వార్న్‌కు నివాళులు అర్పించనుంది.

ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం: వార్న్‌ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌తో రెండో టెస్టుకు సిద్ధమవుతున్న అతను.. వార్న్‌ అంత్యక్రియలకు ప్రజలు భారీగా తరలివస్తారని చెప్పాడు. ‘‘వార్న్‌ అంత్యక్రియలు కచ్చితంగా ప్రతి ఒక్కరికీ ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తాయి. ఇప్పటికీ అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎంసీజీలో జరిగే తన అంత్యక్రియలకు విక్టోరియా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అంతిమ వీడ్కోలు పలికేందుకు ఎంతో మంది వస్తారు. ఎంసీజీలో ఉన్న వార్న్‌ విగ్రహం దగ్గర ప్రజలు నివాళిగా పూలు, సిగరెట్లు, బీర్లు పెట్టడం చూశాం. అతను ఎంతోమంది హృదయాలను కదిలించాడనేందుకు ఇదే నిదర్శనం. నేను కూడా ఆ అంత్యక్రియలకు హాజరయేందుకు ప్రయత్నిస్తా’’ అని వార్నర్‌ తెలిపాడు.

మన్కడింగ్‌ను ఆ సమస్యగానే చూస్తారు: నాన్‌స్ట్రైకర్‌ క్రీజు దాటాడని బౌలర్‌ రనౌట్‌ చేయడం క్రికెట్‌ స్ఫూర్తి సమస్యగానే మిగిలిపోతుందని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అభిప్రాయపడ్డాడు. అలా ఔట్‌ (మన్కడింగ్‌) చేయడాన్ని అన్యాయమైన ఆట విభాగం నుంచి రనౌట్‌ కిందకు మారుస్తూ చట్టానికి ఎంసీసీ సవరణ చేసిన సంగతి తెలిసిందే. ‘‘చరిత్ర సూచించిన ప్రకారం ఇప్పటికీ అది (మన్కడింగ్‌) క్రికెట్‌ స్ఫూర్తికి సంబంధించిన విషయమనే అనుకుంటున్నా. ఆటగాళ్లు అలా చేయాలని ఆశించవద్దు. ఒకవేళ బ్యాటర్‌ క్రీజు నుంచి ఎక్కువ దూరం ఉన్నట్లయితే నేనూ దాన్ని ఒప్పుకుంటా. ప్రధానంగా వన్డే మ్యాచ్‌ చివర్లో లేదా టీ20ల్లో ఇలా జరిగిందని అనుకుంటున్నా. ఏదేమైనా బ్యాటర్‌ క్రీజులో ఉండాలి. ఒకవేళ అలా ఆటగాడు రనౌటైతే అందుకు పూర్తి తప్పు అతనిదే. బౌలర్‌ బంతి వేయకముందు క్రీజు దాటొద్దని స్పష్టంగా ఉంది. అలాగే చేయాలి. కానీ బౌలర్లు అలా ఔట్‌ చేయడం కోసం మ్యాచ్‌ను మరింత సాగదీయొద్దని కోరుకుంటా. మ్యాచ్‌ గమనాన్ని మరింత నెమ్మదిగా మారిస్తే చిరాకు కలుగుతుంది’’ అని వార్నర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని