Updated : 26 Mar 2022 17:54 IST

T20 League: పంజాబ్‌.. ఇప్పుడైనా?

మరో 5 రోజుల్లో మెగా టీ29 లీగ్‌

ఈనాడు క్రీడావిభాగం

 దేశవాళీ టీ20 లీగ్‌లో ఉన్న పాత ఫ్రాంఛైజీల్లో టైటిల్‌ గెలవనివి మూడు. బెంగళూరు టైటిల్‌ గెలవకున్నా దానికున్న ఆకర్షణ, ఆదరణ వేరు. దిల్లీ ఒకప్పుడు పేలవ ప్రదర్శన చేసినా.. గత కొన్ని సీజన్ల నుంచి బాగా ఆడుతోంది. టైటిల్‌కు గట్టి పోటీదారుగా ఉంటోంది. కానీ ఆకర్షణా లేక.. టైటిలూ గెలవక.. ప్రదర్శనా మెరుగు పడక నామమాత్రంగా సాగుతున్న జట్టేదంటే పంజాబ్‌ మాత్రమే. జట్టును మార్చినా, కెప్టెన్‌ని మార్చినా.. చివరికి ఫ్రాంఛైజీ పేరును మార్చినా ఆ జట్టు రాత మాత్రం మారలేదు. ఇప్పుడు కొత్త సీజన్‌కు ఆటగాళ్లను, కెప్టెన్‌ను మార్చుకుని మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇప్పుడైనా పంజాబ్‌ పంజా విసురుతుందేమో చూడాలి.

2014లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జార్జ్‌ బెయిలీ నాయకత్వ పటిమ, మ్యాక్స్‌వెల్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులతో ఫైనల్‌కు దూసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచిన పంజాబ్‌.. టైటిల్‌ మాత్రం అందుకోలేకపోయింది. ఆ ఒక్క సీజన్లో మినహాయిస్తే లీగ్‌పై పంజాబ్‌ ముద్ర కనిపించదు. దానికి ముందు, తర్వాతి సీజన్లలో పంజాబ్‌ ప్రదర్శన గురించి చెప్పుకోవడానికేమీ లేదు. గత ఏడు సీజన్లలో ఆరుగురు కెప్టెన్లు (బెయిలీ, మిల్లర్‌, విజయ్‌, మ్యాక్స్‌వెల్‌, అశ్విన్‌, రాహుల్‌) జట్టును నడిపించారంటే పంజాబ్‌ పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. కేఎల్‌ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించినా ఫలితం లేకపోయింది. గత రెండు సీజన్లలోనూ ఆ జట్టు ప్లేఆఫ్‌ చేరలేదు. దీంతో రాహుల్‌ను వదులుకుని మయాంక్‌కు పగ్గాలప్పగించిన యాజమాన్యం.. జట్టులో చాలా మార్పులు చేసుకుని కొత్త సీజన్‌కు ఉత్సాహంగా సిద్ధమైంది.


బలాలు

విధ్వంసక బ్యాట్స్‌మెన్‌, ఆల్‌రౌండర్లే పంజాబ్‌ బలం. కెప్టెన్‌ మయాంక్‌కు తోడు శిఖర్‌ ధావన్‌ రాకతో ఓపెనింగ్‌లో దూకుడు పెరిగింది. మూడో స్థానంలో వచ్చే అవకాశమున్న బెయిర్‌స్టో దూకుడు గురించి తెలిసిందే. వీరికి తోడు లివింగ్‌స్టోన్‌, ఒడియన్‌ స్మిత్‌ లాంటి ప్రమాదకర ఆల్‌రౌండర్లు ఈసారి పంజాబ్‌ రాత మారుస్తారనే అంచనాలున్నాయి. అనేక టీ20 లీగ్‌ల్లో సత్తా చాటుకున్న బెన్నీ హోవెల్‌ కూడా చూడదగ్గ ఆల్‌రౌండరే. కింగ్స్‌ రూ.9 కోట్లతో సొంతం చేసుకున్న షారుఖ్‌ ఖాన్‌ ఈసారి ఫినిషర్‌గా జట్టుకు ఉపయోగపడతాడని భావిస్తున్నారు. పంజాబ్‌ అట్టిపెట్టుకున్న అర్ష్‌దీప్‌కు తోడు రాహుల్‌ చాహర్‌, నాథన్‌ ఎలిస్‌ బౌలింగ్‌లో జట్టుకు బలం చేకూర్చే ఆటగాళ్లే.


బలహీనతలు

టీ20ల్లో జట్టు నిండా విధ్వంసక ఆటగాళ్లతో నింపేస్తే కష్టం. అవసరమైనపుడు నిలిచి ఆడటం కూడా అవసరమే. అలాంటి బ్యాట్స్‌మెన్‌ పంజాబ్‌లో కనిపించడం లేదు. మిడిలార్డర్‌ కొంత బలహీనంగానే కనిపిస్తోంది. అర్ష్‌దీప్‌కు తోడుగా మరో పేరున్న భారత పేసర్‌ లేకపోవడం లోటే. వైభవ్‌ అరోరా, ఇషాన్‌ పోరెల్‌ లాంటి దేశవాళీ పేసర్లు ఏమేర ఒత్తిడిని తట్టుకుని సత్తా చాటుతారో చూడాలి. దేశీయ ఆటగాళ్లలో మయాంక్‌, ధావన్‌లను మినహాయిస్తే అంతర్జాతీయ అనుభవం కనిపించడం లేదు. అనుభవ లేమి కింగ్స్‌కు ప్రతికూలంగా మారొచ్చు.


దేశీయ ఆటగాళ్లు: మయాంక్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రాహుల్‌ చాహర్‌, సందీప్‌ శర్మ, వైభవ్‌ అరోరా, హర్‌ప్రీత్‌ బ్రార్‌, రాజ్‌ అంగద్‌ బవా, రిషి ధావన్‌, షారుఖ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, బాల్‌తేజ్‌ దండా, ఇషాన్‌ పోరెల్‌, జితేశ్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, అన్ష్‌ పటేల్‌, అథర్వ, ప్రేరక్‌ మన్కడ్‌, వృత్తిక్‌ ఛటర్జీ.

విదేశీయులు: బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌, ఒడియన్‌ స్మిత్‌, నాథన్‌ ఎలిస్‌, భానుక రాజపక్స, బెన్నీ హోవెల్‌.

కీలకం: మయాంక్‌, ధావన్‌, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

ఉత్తమ ప్రదర్శన: 2014లో రన్నరప్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని