Gujarat: గుజరాత్‌ తడాఖా.. కోల్‌కతాపై విజయం

గుజరాత్‌ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు రషీద్‌ ఖాన్‌, షమి, యశ్‌ దయాల్‌ల చక్కని బౌలింగ్‌ తోడైన వేళ.. కోల్‌కతాను ఓడించింది. గుజరాత్‌ 156 పరుగులే చేసినా..

Updated : 24 Apr 2022 07:01 IST

మెరిసిన హార్దిక్‌, రషీద్‌
వరుసగా మూడో విజయం

గుజరాత్‌ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు రషీద్‌ ఖాన్‌, షమి, యశ్‌ దయాల్‌ల చక్కని బౌలింగ్‌ తోడైన వేళ.. కోల్‌కతాను ఓడించింది. గుజరాత్‌ 156 పరుగులే చేసినా.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థికి కళ్లెం వేసింది. మెగా టోర్నీ 2022లో ఇప్పటివరకు ఓ జట్టు కాపాడుకున్న అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న గుజరాత్‌.. ప్లేఆఫ్స్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. కోల్‌కతాకు ఇది వరుసగా నాలుగో పరాజయం.

నవీ ముంబయి

మెగా టోర్నీలో గుజరాత్‌ అదిరే ప్రదర్శన కొనసాగుతోంది. పెద్ద స్కోరు చేయకున్నా.. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (67; 49 బంతుల్లో 4×4, 2×6) బ్యాట్‌ ఝుళిపించడంతో మొదట గుజరాత్‌ 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. సౌథీ (3/24), రసెల్‌ (4/5) ఆ జట్టును కట్టడి చేశారు. ఛేదనలో షమి (2/20), రషీద్‌ ఖాన్‌ (2/22), యశ్‌ దయాల్‌ (2/42) విజృంభించడంతో కోల్‌కతా 8 వికెట్లకు 148 పరుగులే చేయగలిగింది. ఆండ్రీ రసెల్‌ (48; 25 బంతుల్లో 1×4, 6×6) టాప్‌ స్కోరర్‌.

రసెల్‌ మెరిసినా..: స్పల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో కోల్‌కతా విఫలమైంది. ఆఖర్లో రసెల్‌ మెరిసినా ఫలితం లేకపోయింది. ఛేదన ఆరంభంలోనే తన పదునైన పేస్‌తో షమి ఆ జట్టును గట్టి దెబ్బతీశాడు. తన వరుస ఓవర్లలో బిల్లింగ్స్‌ (4), సునీల్‌ నరైన్‌ (5)ను ఔట్‌ చేశాడు. నితీష్‌ రాణా (2)ను ఫెర్గూసన్‌, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (12)ను యశ్‌ దయాల్‌ ఔట్‌ చేయడంతో కోల్‌కతా 7 ఓవర్లలో 41/4తో చిక్కుల్లో పడింది. అయితే రింకూ సింగ్‌ (35; 28 బంతుల్లో 4×4, 1×6)కు తోడుగా వెంకటేశ్‌ అయ్యర్‌ (17) కాసేపు నిలవడంతో వికెట్ల పతనం ఆగింది. 12 ఓవర్లకు స్కోరు 79/4. తర్వాతి ఓవర్లో రింకూ వెనుదిరిగినా.. రసెల్‌ రెండు సిక్స్‌లు, ఫోర్‌ దంచాడు. మరోవైపు నుంచి వెంకటేశ్‌, శివమ్‌ మావి ఔటైనా.. రసెల్‌ సిక్స్‌ల మోత కొనసాగించడంతో కోల్‌కతా ఆశలు నిలిచే ఉన్నాయి. చివరి ఓవర్లో (జోసెఫ్‌) విజయానికి 18 పరుగులు అవసరం కాగా.. రసెల్‌ తొలి బంతికే సిక్స్‌ దంచి గుజరాత్‌ను కలవరపెట్టాడు. అయితే తర్వాతి బంతికే రసెల్‌ క్యాచ్‌ ఔట్‌ కావడంతో కోల్‌కతా ఆశలకు తెరపడ్డట్లయింది. జోసెఫ్‌ చివరి నాలుగు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చాడు.

గుజరాత్‌ కట్టడి: 156/9.. అనుకున్నదాని కన్నా గుజరాత్‌కు ఇది చాలా తక్కువ స్కోరే. ఆఖర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన కోల్‌కతా.. మంచి ముగింపు దిశగా సాగుతోన్న ప్రత్యర్థికి కళ్లెం వేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ రెండో ఓవర్లోనే ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (7) వికెట్‌ను చేజార్చుకుంది. మరో ఓపెనర్‌ సాహా (25; 25 బంతుల్లో 2×4, 1×6) నిలబడ్డా.. ఒత్తిడికి గురయ్యాడు. ఎక్కువ డాట్‌ బాల్స్‌ ఆడాడు. అయితే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య కాస్త దూకుడు ప్రదర్శించాడు. 75 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యంలో అతడిదే ఆధిపత్యమని వేరే చెప్పక్కర్లేదు. శివమ్‌ మావి బౌలింగ్‌లో వరుసగా 6, 4 దంచిన హార్దిక్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో లాంగాఫ్‌లో సిక్స్‌ బాదాడు. అప్పుడప్పుడు బౌండరీలు బాదుతూనే సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ స్కోరు బోర్డును నడిపించాడు హార్దిక్‌. 11వ ఓవర్లో సాహాను ఉమేశ్‌ ఔట్‌ చేసినా.. క్రీజులోకి వచ్చిన మిల్లర్‌ (27; 20 బంతుల్లో 1×4, 2×6) ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. 16 ఓవర్లలో 132/2లో గుజరాత్‌ మెరుగైన స్కోరుపై కన్నేసింది. కానీ కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా పుంజుకోవడంతో అనూహ్యంగా తడబడింది. గుజరాత్‌ చివరి 4 ఓవర్లలో కేవలం 24 పరుగులే చేసి 7 వికెట్లు కోల్పోయింది. మిల్లర్‌ను ఔట్‌ చేయడం ద్వారా మావి 50 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీయడంతో ఇన్నింగ్స్‌ మలుపు తిరిగింది. 18వ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇచ్చిన సౌథీ.. హార్దిక్‌, రషీద్‌ ఖాన్‌లను వెనక్కి పంపాడు. రసెల్‌ ఆఖరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్‌లో కోల్‌కతా బౌలర్లు 43 డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని