ప్రిక్వార్టర్స్‌లో సింధు, కశ్యప్‌

మలేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఏడో సీడ్‌ సింధు 21-13, 21-17తో పోర్న్‌పావీ చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌)పై

Published : 30 Jun 2022 02:35 IST

సైనా ఓటమి

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఏడో సీడ్‌ సింధు 21-13, 21-17తో పోర్న్‌పావీ చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించింది. ఇటీవల ఇండోనేసియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన సింధు.. మలేసియా టోర్నీని కసిగా ప్రారంభించింది. 40 నిమిషాల పోరులో మొదటి గేమ్‌ ఏకపక్షంగా సాగింది. 8-2తో గేమ్‌ను ఆరంభించిన సింధు కొద్దిసేపటికే 16-13తో ముందంజ వేసింది. స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్‌ షాట్‌లతో పాయింట్ల వేట కొసాగించిన సింధు 21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో పోర్న్‌పావీ పోరాడింది. 4-2తో ఆధిక్యం సంపాదించిన ప్రత్యర్థి 13-8తో మరింత ముందుకెళ్లింది. సింధు అనవసర తప్పిదాలు ప్రత్యర్థికి లాభించాయి. దీంతో పోర్న్‌పావీ 16-10తో రెండో గేమ్‌ దిశగా పయనించింది. అయితే షటిల్‌పై నియంత్రణ తెచ్చుకున్న సింధు వరుసగా 5 పాయింట్లు గెలుచుకుని 15-16తో పోర్న్‌పావీని సమీపించింది. ప్రత్యర్థి సైతం 2 పాయింట్లు నెగ్గి 17-15తో గేమ్‌కు చేరువైంది. మరోసారి విజృంభించిన సింధు వరుసగా 6 పాయింట్లతో మ్యాచ్‌కు తెరదించింది. 21-17తో రెండో గేమ్‌ను కైవసం చేసుకుంది. పోర్న్‌పావీపై తన గెలుపోటముల రికార్డును 6-3తో మరింత మెరుగు పరుచుకుంది. ప్రిక్వార్టర్స్‌లో ఫిటయపోర్న్‌ చైవాన్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు తలపడనుంది. మరో స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సైనా 11-21, 17-21తో ఐరిస్‌ వాంగ్‌ (అమెరికా) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌ ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నాడు. తొలి రౌండ్లో కశ్యప్‌ 21-12, 21-17తో క్వాంగ్‌ హీ (కొరియా)పై గెలుపొందాడు. ప్రిక్వార్టర్స్‌లో కున్లావుత్‌ వితిద్సర్న్‌ (థాయ్‌లాండ్‌)తో కశ్యప్‌ పోటీపడతాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో సుమీత్‌రెడ్డి- అశ్విని పొన్నప్ప 15-21, 21-19, 17-21తో రాబిన్‌- సెలెనా (నెదర్లాండ్స్‌) చేతిలో పోరాడి ఓడారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో అశ్విని- శిఖ 11-21, 14-21తో మత్సుమొటొ- నగహర (జపాన్‌) చేతిలో పరాజయం చవిచూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని