PV Sindhu: ఎన్నాళ్లో వేచిన పతకం

కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం కోసం చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్నానని భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు తెలిపింది. త్వరలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు ముందు కామన్వెల్త్‌ పతకం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పింది. బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో బంగారు పతకంతో మెరిసిన సింధు తన ఆనందాన్ని ‘ఈనాడు’తో పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే..

Updated : 15 Aug 2022 14:21 IST

‘ఈనాడు’తో పి.వి.సింధు

కామన్వెల్త్‌ విజయం గొప్ప ఉపశమనం

ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యం

బర్మింగ్‌హామ్‌ నుంచి ఈనాడు క్రీడా ప్రతినిధి

కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం కోసం చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్నానని భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు తెలిపింది. త్వరలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు ముందు కామన్వెల్త్‌ పతకం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పింది. బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో బంగారు పతకంతో మెరిసిన సింధు తన ఆనందాన్ని ‘ఈనాడు’తో పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే..

బ్యాడ్మింటన్‌లో ఎన్నో టోర్నీలు జరుగుతుంటాయి. టైటిళ్లు గెలుస్తుంటాం. కాని మెగా క్రీడల్లో పతకం సాధిస్తే వచ్చే మజానే వేరు. ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో త్రివర్ణ పతాకం పైకి వెళ్తుంటే.. జాతీయ గీతం ఆలపిస్తుంటే మాటల్లో వర్ణించలేనంత అనుభూతికి లోనవుతాం. ఇప్పుడు నాది అలాంటి పరిస్థితే. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం తర్వాత కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకం ఎంతో ఉత్సాహాన్ని.. ఉపశమనాన్ని అందించింది. ఫైనల్‌ ప్రత్యర్థితో గతంలో పోటీపడ్డాను. ఒకరి ఆట గురించి మరొకరికి బాగా తెలుసు. తుది పోరులో పాయింట్లు అంత తేలిగ్గా ఏమీ దక్కలేదు. ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఉదాసీనతకు తావివ్వకుండా ఆఖరి వరకు ఆఖరి వరకు పట్టుదలగా ఆడాను. ఈ పతకం కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నా. ఎట్టకేలకు సాధించా. చెప్పలేనంత సంతోషంగా ఉంది.

విరామం తర్వాత..: త్వరలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. బ్యాడ్మింటన్‌లో అతిపెద్ద టోర్నీ. అక్కడ సత్తాచాటాలని భావిస్తున్నా. ఈ టోర్నీకి ముందు కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి కొంచెం విరామం తీసుకుంటా. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి కామన్వెల్త్‌ విజయాన్ని ఆస్వాదిస్తా. రెట్టించిన ఉత్సాహంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగుతా.

ప్రణాళిక సిద్ధం..: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణాలు నాకెంతో సంతృప్తిని ఇచ్చాయి. అయితే ఇక్కడితో ఆగిపోను. ఒలింపిక్స్‌లో స్వర్ణం నా కల. కచ్చితంగా స్వప్నాన్ని సాకారం చేసుకుంటా. టోక్యో క్రీడలు ముగియగానే తర్వాతి ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నా. అందుకు తగ్గ ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించే వరకు లయను కొనసాగిస్తా. అప్పటి వరకు అలసిపోను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని