బెట్టింగ్‌ సైట్‌కు షకీబ్‌ దూరం

బంగ్లాదేశ్‌ అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ వెనకడుగు వేశాడు. ఓ బెట్టింగ్‌ సైట్‌ ప్రచారం కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని గురువారం రద్దు చేసుకున్నాడు. ఓ జూద సంస్థ ఆధ్వర్యంలో నడిచే

Published : 12 Aug 2022 03:43 IST

ఢాకా: బంగ్లాదేశ్‌ అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ వెనకడుగు వేశాడు. ఓ బెట్టింగ్‌ సైట్‌ ప్రచారం కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని గురువారం రద్దు చేసుకున్నాడు. ఓ జూద సంస్థ ఆధ్వర్యంలో నడిచే బెట్‌విన్నర్‌ న్యూస్‌తో తన భాగస్వామ్యాన్ని గత వారం అతను ప్రకటించాడు. తన సామాజిక మాధ్యమాల్లో ఆ సైట్‌ గురించి పోస్టులు కూడా పెట్టాడు. దీనిపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెట్‌విన్నర్‌ కావాలో లేదా జట్టులో చోటు కావాలో తేల్చుకోమని స్పష్టం చేసింది. దీంతో షకీబ్‌ తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో పోస్టులనూ తొలగించాడు. ‘‘బెట్‌విన్నర్‌ న్యూస్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు లేఖలో షకీబ్‌ తెలిపాడు. అందుకు సంబంధించి తన సామాజిక మాధ్యమాల్లో ఉన్న పోస్టులనూ తొలగిస్తున్నట్లు చెప్పాడు’’ అని బీసీబీ క్రికెట్‌ కార్యకలాపాల (ఆపరేషన్స్‌) చీఫ్‌ జలాల్‌ యూనుస్‌ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌లో అన్ని రకాల జూదంపై నిషేధం ఉంది. ‘‘బెట్‌విన్నర్‌ న్యూస్‌ లేదా జాతీయ జట్టు.. ఈ రెండింటిలో ఏది కావాలో తేల్చుకోమని షకీబ్‌కు చెప్పాం. అందులో మరో ఆలోచనకు ఆస్కారమే లేదు. అతను దీని నుంచి బయటకు రావాల్సిందే. లేకపోతే జట్టులో ఉండడు’’ అని బీసీబీ అధ్యక్షుడు నజ్మల్‌ హసన్‌ స్పష్టం చేశాడు. ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌గా ఉన్న షకీబ్‌.. ఆసియా కప్‌లో పాల్గొనే బంగ్లా టీ20 జట్టుకు సారథిగా ఎంపికయ్యే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని