మూడో స్థానంలో శుభ్‌మన్‌

రెగ్యులర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ పునరాగమనం చేయడంతో ఈనెల 18న జింబాబ్వేతో మొదలయ్యే వన్డే సిరీస్‌లో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మూడో స్థానంలో దిగే అవకాశాలు ఉన్నాయి.

Published : 15 Aug 2022 02:56 IST

ఓపెనర్లుగా రాహుల్‌, ధావన్‌

జింబాబ్వేతో వన్డే సిరీస్‌

దిల్లీ: రెగ్యులర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ పునరాగమనం చేయడంతో ఈనెల 18న జింబాబ్వేతో మొదలయ్యే వన్డే సిరీస్‌లో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మూడో స్థానంలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఆసియా కప్‌  ముందు ఫామ్‌ను పరీక్షించుకోవడానికి మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో కలిసి కెప్టెన్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించడం లాంఛనం. టీ20 ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ఉన్న శుభ్‌మన్‌ మూడో స్థానంలో ఆడనున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో వరుసగా 64, 43, 98 నాటౌట్‌ స్కోర్లు చేసిన శుభ్‌మన్‌.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు అందుకున్నాడు. ‘‘శుభ్‌మన్‌ సరైన దిశలో వెళ్తున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో గొప్పగా రాణించాడు. ఆటగాళ్లను భిన్నమైన స్థానాల్లో ఆడించాలనేది జట్టు ఆలోచన. అందుకే ఈ సిరీస్‌లో శుభ్‌మన్‌ మూడో స్థానంలో రాబోతున్నాడు’’ అని సెలెక్టర్‌ దేవాంగ్‌ గాంధీ అన్నాడు. ‘‘ఒక సిరీస్‌లో ఓపెనర్‌గా సత్తా చాటిన తర్వాత సిరీస్‌లో మూడో స్థానంలో రావాలంటే కొంచెం కష్టమే. కానీ ఆసియాకప్‌లో రాహుల్‌ను ఓపెనింగ్‌ స్థానానికి సిద్ధం చేయడానికి ఈ సర్దుబాటు అనివార్యం. రాహుల్‌కు ఎక్కువ బ్యాటింగ్‌ చేసే అవకాశం ఇవ్వాలి. భవిష్యత్‌లో శుభ్‌మన్‌ను వన్డే ప్రపంచకప్‌కు ఓపెనర్‌గా సిద్ధం చేసే అవకాశాలున్నాయి’’ అని వ్యాఖ్యాత దీప్‌దాస్‌ గుప్తా చెప్పాడు. 2021లో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో రాహుల్‌ మిడిలార్డర్‌లో దిగాడు. కానీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో సారథిగా పగ్గాలు అప్పజెప్పిన తర్వాత ఓపెనర్‌గా ఆడుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని