జులన్‌ ఘనంగా..

దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌.. పేస్‌ బౌలింగ్‌కు చిరునామా.. అంతర్జాతీయ వికెట్లలో అగ్రస్థానం! భారత మహిళల క్రికెట్‌కు పెద్ద దిక్కు! జులన్‌ గోస్వామి ఆటను ముగించింది. భావోద్వేగాల నడుమ క్రికెట్‌కు టాటా చెప్పింది. వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ జట్టు.. జులన్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది.

Published : 25 Sep 2022 03:28 IST

కెరీర్‌ ముగించిన పేసర్‌
వన్డే సిరీస్‌లో భారత్‌ క్లీన్‌స్వీప్‌

దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌.. పేస్‌ బౌలింగ్‌కు చిరునామా.. అంతర్జాతీయ వికెట్లలో అగ్రస్థానం! భారత మహిళల క్రికెట్‌కు పెద్ద దిక్కు! జులన్‌ గోస్వామి ఆటను ముగించింది. భావోద్వేగాల నడుమ క్రికెట్‌కు టాటా చెప్పింది. వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ జట్టు.. జులన్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది.

లండన్‌: మ్యాచ్‌ ఆద్యంతం భావోద్వేగమే. టాస్‌ దగ్గర నుంచి మ్యాచ్‌ ముగిసే వరకు అందరి కళ్లూ జులన్‌ గోస్వామి మీదే. ఆమె ఎటు కదిలినా కెమెరా అటువైపే! మొత్తం మీద జులన్‌ కెరీర్‌కు అదిరే ముగింపు! ఈ మ్యాచ్‌తో క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న ఈ వెటరన్‌ పేసర్‌కు భారత మహిళల జట్టు ఘన విజయాన్ని బహుమతిగా అందించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ బృందం 16 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 45.4 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (68 నాటౌట్‌; 106 బంతుల్లో 7×4), స్మృతి మంధాన (50; 79 బంతుల్లో 5×4) జట్టును ఆదుకున్నారు. ఇంగ్లిష్‌ బౌలర్లలో క్రాస్‌ (4/26), ఎకీల్‌స్టోన్‌ (2/27) రాణించారు. ఛేదనలో ఇంగ్లాండ్‌ తడబడింది. రేణుక సింగ్‌ (4/29) ధాటికి 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. 118 పరుగులకే 9 వికెట్లు కోల్పోయినా.. ఛార్లీ డీన్‌ (47).. చివరి ఇద్దరు బ్యాటర్లతో కలిసి పోరాడి జట్టును విజయానికి చేరువ చేసింది. 17 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌ గెలుస్తుందనగా డీన్‌ను దీప్తిశర్మ రనౌట్‌ (మన్కడింగ్‌) చేసి భారత్‌ను గెలిపించింది. బంతి వేయకుండానే డీన్‌ క్రీజు వదిలి ముందుకు వెళ్లడాన్ని గమనించిన దీప్తి.. బౌలింగ్‌ చేస్తున్నట్లుగానే ముందుకు కదిలి ఆమెను రనౌట్‌ చేసింది. కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన పేసర్‌ జులన్‌ 10 ఓవర్లలో 3 మొయిడెన్లు వేసి 30 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది. మ్యాచ్‌ ముగిశాక జులన్‌ను చుట్టుముట్టిన భారత అమ్మాయిలు.. ఆమెను భుజాలపైన ఎక్కించుకుని లార్డ్స్‌ మైదానం చుట్టూ తిప్పారు. అంతకుముందు టాస్‌ వేసే సమయంలో హర్మన్‌ తనతో పాటు జులన్‌ను కూడా వెంటబెట్టుకుని వెళ్లింది. భారత ఇన్నింగ్స్‌లో జులన్‌ గోస్వామి బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో ఇంగ్లాండ్‌ జట్టు గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని