India-Pakistan: నాటి మిత్రులు మళ్లీ కలిశారు..

భారత్‌, పాకిస్థాన్‌.. ఈ చిరకాల ప్రత్యర్థులు మైదానంలో విజయం కోసం హోరాహోరీగా తలపడతాయి. కానీ అది కేవలం ఆట వరకు మాత్రమేనని, వ్యక్తిగతంగా ఈ రెండు దేశాల క్రికెటర్ల మధ్య గొప్ప స్నేహ బంధం ఉందని మరోసారి స్పష్టమైంది.

Updated : 07 Oct 2022 08:13 IST

పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంతికాబ్‌తో బిషన్‌

దిల్లీ: భారత్‌, పాకిస్థాన్‌.. ఈ చిరకాల ప్రత్యర్థులు మైదానంలో విజయం కోసం హోరాహోరీగా తలపడతాయి. కానీ అది కేవలం ఆట వరకు మాత్రమేనని, వ్యక్తిగతంగా ఈ రెండు దేశాల క్రికెటర్ల మధ్య గొప్ప స్నేహ బంధం ఉందని మరోసారి స్పష్టమైంది. పవిత్ర కర్తార్‌పూర్‌ సాహిబ్‌ (గురుద్వారా)లో పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంతికాబ్‌ ఆలమ్‌తో టీమ్‌ఇండియా దిగ్గజం బిషన్‌ సింగ్‌ బేడి సరదాగా సమయాన్ని ఆస్వాదించడమే అందుకు నిదర్శనం. ఈ మాజీ ఆటగాళ్ల కలయిక విభిన్న భావోద్వేగాలకు వేదికైంది. సంతోషంతో నవ్వులు, బాధతో కన్నీళ్లు, పాటలు, మాటలు.. ఇలా వీళ్లు సమయాన్ని గడిపారు. కొవిడ్‌ సోకిన తర్వాత కలిగిన దుష్పరిణామాల కారణంగా బిషన్‌కు గతేడాది హృదయ, మెదడు శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రస్తుతం చక్రాల కుర్చీకే పరిమితమైన అతని జ్ఞాపకశక్తి క్షీణించింది. భార్య అంజుతో కలిసి తాజాగా అతను పాక్‌లోని కర్తార్‌పూర్‌ సాహిబ్‌ను సందర్శించాడు. భారత్‌ నుంచి ఈ దంపతులు ఆ పవిత్ర స్థలాన్ని చేరుకోగా.. ముందుగానే అనుకున్న ప్రకారం పాకిస్థాన్‌లో మాజీ క్రికెటర్లు ఆలమ్‌, షఫ్కత్‌ రాణా వీళ్లను కలిశారు. ‘‘బిషన్‌తో నాకు 50 ఏళ్ల స్నేహ బంధం ఉంది. గతేడాది అతనికి స్ట్రోక్‌ వచ్చిందని తెలిసి హృదయం ద్రవించింది. అతణ్ని చక్రాల కుర్చీలో చూడలేకపోయా. అతను వేగంగా కోలుకుంటున్నాడు. ఇలా కర్తార్‌పూర్‌ సాహిబ్‌లో మళ్లీ కలుస్తామని అనుకోలేదు. ఇది మాకు భావోద్వేగపూరితమైన రోజు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాం. ఎప్పటిలాగే తన భార్యతో కలిసి అతను జోకులు వేసి నవ్వించాడు. అంజు వదిన కోరిక మేరకు ఓ పాట పాడా. ఆ సమయంలో బిషన్‌ ఉద్వేగానికి లోనయ్యాడు’’ అని ఆలమ్‌ తెలిపాడు. పాత స్నేహితులను చూసి బిషన్‌ ముఖం వెలిగిందని, తర్వాతి తరం కూడా ఈ స్నేహ బంధాన్ని కొనసాగించేలా చూస్తామని అంజు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని