సూర్యను కొనేంత డబ్బు లేదు

టీమ్‌ఇండియా ఆటగాళ్లకు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతి లేదు. ఒకవేళ బీసీసీఐ సరేనంటే సూర్యకుమార్‌ను ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడించే అవకాశం ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు మ్యాక్స్‌వెల్‌ ఆసక్తికరమైన జవాబిచ్చాడు

Published : 25 Nov 2022 02:21 IST

దిల్లీ: టీమ్‌ఇండియా ఆటగాళ్లకు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతి లేదు. ఒకవేళ బీసీసీఐ సరేనంటే సూర్యకుమార్‌ను ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడించే అవకాశం ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు మ్యాక్స్‌వెల్‌ ఆసక్తికరమైన జవాబిచ్చాడు. సూర్యను కొనేంత డబ్బు తమ దగ్గర లేదని చెప్పాడు. ‘‘మా దగ్గర సరిపడా డబ్బు లేదు. సూర్యను కొనలేం. లీగ్‌లోని ప్రతి క్రికెటర్‌, క్రికెట్‌ ఆస్ట్రేలియా కాంట్రాక్టు ఆటగాళ్లనూ తొలగించి ఆ డబ్బును సూర్యకు ఇవ్వాలి’’ అని అతను చెప్పాడు. క్రీజులో త్వరగా కుదురుకుని, ఖాళీల మధ్య బంతిని పంపడమే అంతర్జాతీయ క్రికెట్లో సూర్య విజయవంతమవడానికి కారణమని మ్యాక్సీ అభిప్రాయపడ్డాడు. ‘‘ఫీల్డింగ్‌లో ఖాళీలను సూర్య గొప్పగా ఉపయోగించుకుంటాడు. అతను వేగంగా మణికట్టును తిప్పడంతో పాటు చేతిని వాడతాడు. దీంతో చివరి క్షణంలో కూడా సర్దుబాటు చేసుకుని షాట్లు ఆడగలుగుతున్నాడు. తొలి నాలుగైదు బంతుల్లోనే అతను ఎదురు దాడికి దిగి బౌలర్లపై ఒత్తిడి పెంచాలనుకుంటాడు. అప్పుడే అతణ్ని ఔట్‌ చేయలేకపోతే ఇక వికెట్‌ తీయడం కష్టమే. స్పిన్‌ బౌలింగ్‌లో కవర్స్‌లో ఉత్తమంగా షాట్లు కొడతాడు. స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌, స్ట్రెయిట్‌.. ఇలా అన్ని షాట్లు ఆడతాడు. మైదానం నలువైపులా బలంగా షాట్లు కొట్టడం నమ్మశక్యం కానిదే. పేసర్‌ వేగంతో బంతి వేస్తే.. వెంటనే క్రీజులో కదిలి ఫైన్‌లెగ్‌ దిశగా సిక్సర్‌గా మలుస్తాడు’’ అని అతను పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని