ఆ సెలక్షన్స్‌ చెల్లవు

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా మహమ్మద్‌ అజహరుద్దీన్‌ పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ముగిసిందని పర్యవేక్షక కమిటీ ఛైర్మన్‌ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ స్పష్టం చేశారు.

Published : 25 Nov 2022 02:20 IST

హెచ్‌సీఏ పర్యవేక్షక కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా మహమ్మద్‌ అజహరుద్దీన్‌ పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ముగిసిందని పర్యవేక్షక కమిటీ ఛైర్మన్‌ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ తర్వాత అతను కానీ, అతను నియమించిన సెలక్టర్లు కానీ లేదా అతని ఆధ్వర్యంలో కానీ జరిగిన సెలక్షన్స్‌ చెల్లవని ఆయన చెప్పారు. ఈ నిర్ణయాలను పరీక్షించే అధికారం సుప్రీం కోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీకి ఉందని ఆయన తెలిపారు. పర్యవేక్షక కమిటీ సభ్యులైన ఐపీఎస్‌ అంజనీ కుమార్‌, మాజీ క్రికెటర్‌ వెంకటపతి రాజు, హైదరాబాద్‌ క్రికెట్‌ అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ డైరెక్టర్‌ వంక ప్రతాప్‌కు గురువారం రాసిన లేఖలో జస్టిస్‌ నిసార్‌ ఈ విషయాలు పేర్కొన్నారు. పదవీ కాలం ముగిసిన తర్వాత అజహరుద్దీన్‌ అధ్యక్షతన హెచ్‌సీఏ తీసుకున్న నిర్ణయాలను పక్కన పెడుతున్నట్లు ఇందులో తెలిపారు. సెలక్టర్లు, కోచ్‌ల ఎంపిక కూడా చెల్లదన్నారు. సెలక్టర్ల బృందాన్ని పర్యవేక్షక కమిటీ నియమిస్తుందని చెప్పారు. హెచ్‌సీఏకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ల వివరాలు, ధర్మాసనం ఆదేశాలతో పాటు ఇప్పటివరకూ పర్యవేక్షక కమిటీ తీసుకున్న చర్యలను సుప్రీం కోర్టుకు తెలియజేస్తామన్నారు. ప్రధాన అకౌంటెంట్‌ సాయంతో హెచ్‌సీఏ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు అజహరుద్దీన్‌కు అధికారం లేదన్నారు. మరోవైపు ఛైర్మన్‌గా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాష్ట్రంలో 33 జిల్లా సంఘాలకు హెచ్‌సీఏ సభ్యత్వాన్ని ఇచ్చేందుకు పర్యవేక్షక కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఇటీవల వివిధ దేశవాళీ టోర్నీల కోసం ఎంపిక చేసిన హైదరాబాద్‌ జట్లలో క్రికెటర్ల సెలక్షన్స్‌ విషయంలో ప్రతిభావంతులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని