సంక్షిప్త వార్తలు (7)

పసికూన సౌదీ అరేబియా చేతిలో కంగుతిని అవమాన భారంతో ఉన్న అర్జెంటీనాకు ఇప్పుడు మరో కఠిన పరీక్ష. శనివారం అర్ధరాత్రి ఆ జట్టు మెక్సికోను ఢీకొననుంది.

Updated : 26 Nov 2022 06:23 IST

మెస్సి జట్టుకు అగ్ని పరీక్ష

దోహా: పసికూన సౌదీ అరేబియా చేతిలో కంగుతిని అవమాన భారంతో ఉన్న అర్జెంటీనాకు ఇప్పుడు మరో కఠిన పరీక్ష. శనివారం అర్ధరాత్రి ఆ జట్టు మెక్సికోను ఢీకొననుంది. గెలిస్తే నాకౌట్‌ అవకాశాలు మెరుగవుతాయి. లేదంటే గ్రూప్‌ దశ నుంచి నిష్క్రమించడం దాదాపుగా ఖాయం. ఎప్పటిలాగే అర్జెంటీనా తమ కెప్టెన్‌ మెస్సి వైపే చూస్తోంది. అతడు రాణిస్తే ఆ జట్టుకు తిరుగులేనట్లే. మెస్సితో పాటు రొమారియో, నికోలాస్‌, రొడ్రిగో, లియాండ్రో సత్తా చాటాల్సి ఉంది. ఫినిషింగ్‌లో మాత్రమే కాదు డిఫెన్స్‌లో ఆ జట్టు బాగా మెరుగుపడాలి. తమ దేశానికే చెందిన మాజీ కోచ్‌ గెరార్డో మార్టినో ప్రస్తుతం మెక్సికో కోచ్‌గా ఉండడం అర్జెంటీనాకు ఆందోళన కలిగించే విషయం.  ప్రపంచకప్‌ చరిత్రలో అర్జెంటీనాతో తలపడిన మూడు మ్యాచ్‌ల్లో మెక్సికోకు ఓటమే మిగిలింది.


ఎదురులేని దబంగ్‌ దిల్లీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ తొమ్మిదో సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ దబంగ్‌ దిల్లీ దూసుకెళ్తోంది. ఆ జట్టు వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 50-47 తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలిచింది. మ్యాచ్‌ ఆరంభంలో గుజరాత్‌ ఆధిపత్యం చలాయించింది. సోను (9) రైడింగ్‌లో రాణించడంతో అయిదో నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి 10-3తో ఆధిక్యం సాధించింది. కానీ నవీన్‌ (11), అన్షు (12) సత్తాచాటడంతో పుంజుకున్న దిల్లీ.. గుజరాత్‌ను ఆలౌట్‌ చేసి 12వ నిమిషంలో 14-15తో నిలిచింది. విరామం తర్వాత దిల్లీ దూకుడు పెంచింది. చివరి వరకూ అదే జోరు కొనసాగించి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ 41-26తో తమిళ్‌ తలైవాస్‌ను ఓడించింది.


ఎస్‌సీ ఛైర్మన్‌కు విరుద్ధ ప్రయోజనాలు: అజహర్‌

దిల్లీ: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌ఎస్‌సీ)లో మళ్లీ రగడ మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికే హెచ్‌ఎస్‌సీ అధ్యక్షుడిగా అజహరుద్దీన్‌ పదవీ కాలం ముగిసిందని, ఆ తర్వాత అతని నేతృత్వంలో చేపట్టిన ఎటువంటి సెలక్షన్స్‌ చెల్లవని గురువారం పర్యవేక్షక కమిటీ (ఎస్‌సీ) ఛైర్మన్‌ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. హెచ్‌ఎస్‌సీ పాలన వ్యవహారాలు సాఫీగా సాగేలా చూసేందుకు ఛైర్మన్‌గా జస్టిస్‌ నిసార్‌, సభ్యులుగా ఐపీఎస్‌ అంజనీ కుమార్‌, మాజీ క్రికెటర్‌ వెంకటపతిరాజు, వంక ప్రతాప్‌లతో కూడిన ఎస్‌సీని సుప్రీం కోర్టు నియమించింది. ఇప్పుడేమో దీని ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎన్‌ఏ కక్రూ నియామకం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని అజహరుద్దీన్‌ ఆరోపిస్తున్నాడు. ఆ మేరకు శుక్రవారం ఎస్‌సీ సభ్యులకు లేఖ రాశాడు. ‘‘గతేడాది హెచ్‌ఎస్‌సీ అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ దీపక్‌ వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు కూడా సమ్మతించింది. కానీ హెచ్‌ఎస్‌సీలోని వ్యతిరేక వర్గం అప్పుడు అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ ఎన్‌ఏ కక్రూను నియమించింది. ఇప్పుడు వ్యతిరేక వర్గాన్ని సమర్థించేలా జస్టిస్‌ ఎన్‌ఏ కక్రూ వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది’’అని అజహర్‌ పేర్కొన్నాడు.


హాకీ జట్టుకు ఆసీస్‌ సవాల్‌

నేటి నుంచి సిరీస్‌

అడిలైడ్‌: ప్రపంచకప్‌ సన్నాహకాలపై దృష్టి పెట్టిన భారత పురుషుల హాకీ జట్టు.. ఆ దిశగా బలమైన ఆస్ట్రేలియా సవాలుకు సిద్ధమైంది. ప్రత్యర్థి గడ్డపై అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. నేడే తొలి పోరు. మరో 50 రోజుల్లోపే భారత్‌లో హాకీ ప్రపంచకప్‌ మొదలు కానుంది. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి 13న ఒడిషాలో ఆరంభమవుతుంది. ఈ నేపథ్యంలో తమ బలాబలాలను గుర్తించడానికి కంగారూ జట్టుతో సిరీస్‌ టీమ్‌ఇండియాకు ఉపయోగపడనుంది. ప్రపంచ నంబర్‌వన్‌ ప్రత్యర్థితో పోరు భారత్‌కు కఠిన పరీక్షే. ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడల హాకీ ఫైనల్లో 0-7తో ఆసీస్‌ చేతిలో ఓడిన తర్వాత ఆ జట్టుతో భారత్‌ తలపడడం ఇదే తొలిసారి.


ఖతార్‌ ఔట్‌

సెనెగల్‌ చేతిలో ఓటమి

దోహా: ఫిఫా ప్రపంచకప్‌ నుంచి ఆతిథ్య ఖతార్‌ నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్‌ చేతిలో ఓడిన ఆ జట్టు.. శుక్రవారం తన రెండో మ్యాచ్‌లో 1-3తో సెనెగల్‌ చేతిలో పరాజయం చవిచూసింది. తర్వాత నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను ఈక్వెడార్‌ డ్రా చేసుకోవడంతో ఖతార్‌కు నాకౌట్‌ దారులు మూసుకుపోయాయి. ఈక్వెడార్‌ ఓడితే ఖతార్‌ సాంకేతికంగా అయినా పోటీలో ఉండేది. ఆ జట్టుతో మ్యాచ్‌లో సెనెగల్‌కు తొలి గోల్‌ కొట్టడానికి సమయం పట్టింది. దియా (41వ ని) చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆ జట్టు.. విరామం తర్వాత వెంటనే ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. ఫర్మానా (48వ ని) సెనెగల్‌కు రెండో గోల్‌ కొట్టాడు. మ్యాచ్‌ ఆఖర్లో మంతారి (78వ ని) బంతిని నెట్‌లోకి పంపడంతో ఖతార్‌ ఖాతా తెరిచినా.. 84వ నిమిషంలో సెనెగల్‌ ఆటగాడు థింగ్‌ గోల్‌ చేసి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం లేకుండా చేశాడు. 92 ఏళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత అధ్వాన్న ప్రదర్శన చేసిన ఆతిథ్య జట్టుగా ఖతార్‌ అపఖ్యాతి మూటగట్టుకుంది. తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్‌ చేతిలో 0-2తో ఆ జట్టు ఓడిన సంగతి తెలిసిందే.


లంకపై అఫ్గాన్‌ విజయం

పల్లెకెలె: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ 60 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట ఇబ్రహీం జద్రాన్‌ (106; 120 బంతుల్లో 11×4)కు తోడు గుర్బాజ్‌ (53), రహ్మత్‌ షా (52) సత్తా చాటడంతో అఫ్గాన్‌ 8 వికెట్లకు 294 పరుగులు చేసింది. అనంతరం ఫారూఖి (4/49), నైబ్‌ (3/34)ల ధాటికి లంక 38 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. నిశాంక (84), హసరంగ (66) మినహా బ్యాటర్లు విఫలమయ్యారు.


ఫైనల్లో కార్తీక్‌ జోడీ

బిలాయ్‌: 15కె ఐటీఎఫ్‌ ఫ్యూచర్స్‌ టెన్నిస్‌ టోర్నీలో తెలంగాణ ఆటగాడు సాయి కార్తీక్‌ జోడీ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో కార్తీక్‌- రిషబ్‌ జంట 4-6, 6-4, 11-9 తేడాతో చంద్రిల్‌- లక్ష్య ద్వయంపై విజయం సాధించింది. తొలి సెట్‌ కోల్పోయిన తర్వాత బలంగా పుంజుకున్న కార్తీక్‌ జోడీ ఉత్తమ ప్రదర్శనతో ప్రత్యర్థిని ఓడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని