సంక్షిప్త వార్తలు (5)

ఆస్ట్రేలియాతో జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల హాకీ టెస్టు సిరీస్‌లో భారత్‌కు మరో పరాజయం ఎదురైంది.

Updated : 28 Nov 2022 04:37 IST

గోవర్స్‌ హ్యాట్రిక్‌.. భారత్‌కు మరో ఓటమి

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల హాకీ టెస్టు సిరీస్‌లో భారత్‌కు మరో పరాజయం ఎదురైంది. బ్లేక్‌ గోవర్స్‌ హ్యాట్రిక్‌తో సత్తాచాటడంతో సిరీస్‌లో భారత్‌కు రెండో ఓటమి తప్పలేదు. ఆదివారం జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ 7-4తో భారత్‌ను ఓడించింది. ఆతిథ్య జట్టు కుదురుకోకముందే మూడో నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌ ఖాతా తెరిచాడు. అయితే ఆ తర్వాత ఆటలో ఆసీస్‌ ఆధిపత్యం కనబరిచింది. గోవర్స్‌ (12, 27, 53వ నిమిషాల్లో), జాక్‌ వెల్చ్‌ (17, 24) గోల్స్‌తో విరుచుకుపడ్డారు. జేక్‌ వెటన్‌ (49), జాకబ్‌ ఆండర్‌సన్‌ (48) ఒక్కో గోల్‌ చేశారు. భారత జట్టులో హర్మన్‌ప్రీత్‌ (3, 60), హార్దిక్‌ సింగ్‌ (25), మహ్మద్‌ రహీల్‌ (36) గోల్స్‌ రాబట్టారు. ప్రపంచ నంబర్‌వన్‌ ఆసీస్‌ చేతిలో భారత్‌కు వరుసగా ఇది 12వ పరాజయం. ఈ సిరీస్‌పై భారత్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ కచ్చితంగా నెగ్గాలి. బుధవారం మూడో టెస్టు జరుగనుంది.


తలైవాస్‌కు మరో విజయం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ తొమ్మిదో సీజన్‌లో తమిళ్‌ తలైవాస్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 42-39 తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలిచింది. నరేందర్‌ (13), అజింక్య పవార్‌ (12) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆరంభం నుంచి పోరు హోరాహోరీగా సాగింది. ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన గుజరాత్‌ దూకుడు ప్రదర్శించింది. కానీ ఆధిక్యాన్ని కొనసాగించిన తలైవాస్‌ 24-20తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో అర్ధభాగంలో గుజరాత్‌ పుంజుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. ముఖ్యంగా చివరి నిమిషాల్లో ఆ జట్టు మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చేసింది. చంద్రన్‌ రంజిత్‌ (7) రాణించడంతో 39వ నిమిషంలో గుజరాత్‌ 36-38తో ప్రత్యర్థిని సమీపించింది. కానీ ఆఖరి నిమిషంలో అజింక్య రైడ్‌ పాయింట్లు తెచ్చి జట్టుకు విజయాన్ని అందించాడు. గుజరాత్‌ తరపున పార్థీక్‌ (10) కూడా మెరిశాడు. మరో మ్యాచ్‌లో చివర్లో అదరగొట్టిన బెంగళూరు బుల్స్‌ 52-49తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ దబంగ్‌ దిల్లీకి షాకిచ్చింది. బుల్స్‌ తరపున భరత్‌ (23), వికాష్‌ (10).. దిల్లీ జట్టులో విజయ్‌ (14), నవీన్‌ (11) సత్తాచాటారు.  


చెలరేగిన ఈస్ట్‌బెంగాల్‌

జంషెడ్‌పూర్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ తొమ్మిదో సీజన్‌లో పేలవ ప్రదర్శనతో సాగుతున్న ఈస్ట్‌బెంగాల్‌ ఎఫ్‌సీ ఓ స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుంది. ఆదివారం 3-1 తేడాతో జెంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీని చిత్తుచేసింది. మ్యాచ్‌ మొదలైన రెండో నిమిషంలోనే సుహైర్‌ గోల్‌తో ఈస్ట్‌బెంగాల్‌ ఖాతా తెరిచింది. క్లెయిటన్‌ (26వ, 58వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో జట్టును విజయపథంలో నడిపించాడు. జంషెడ్‌పూర్‌ తరపున నమోదైన ఏకైక గోల్‌ను పెనాల్టీ ద్వారా థామస్‌ (40వ) సాధించాడు.


రవీనా పసిడి పంచ్‌

దిల్లీ: స్పెయిన్‌లో జరుగుతున్న ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మరో పసిడి చేరింది. ఆదివారం, పోటీల చివరి రోజు రవీనా (63 కేజీ) స్వర్ణంతో మెరిసింది. తుది పోరులో ఆమె 4-3తో మెగాన్‌ డిక్లెర్‌ (నెదర్లాండ్స్‌)పై గెలిచింది. ఈ పోరు ఆరంభంలో వెనుకబడిన రవీనా.. ఆ తర్వాత పుంజుకుని పైచేయి సాధించింది. మరో భారత బాక్సర్‌ కీర్తి (81 కేజీల పైన) రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆమె 0-5తో సిలోనా ఆర్సీ (ఐర్లాండ్‌) చేతిలో ఓడింది. దీంతో ఈ టోర్నీని భారత్‌ 11 పతకాలతో (4 స్వర్ణ, 3 రజత, 4 కాంస్యాలు) అగ్రస్థానంతో ముగించింది. రవీనా కాకుండా వంశజ్‌ (63.5 కేజీ), విశ్వనాథ్‌ (48 కేజీ), దేవిక (52 కేజీ) స్వర్ణాలు నెగ్గారు.


డేవిస్‌ కప్‌ ఫైనల్లో కెనడా

మలగ (స్పెయిన్‌): డేవిస్‌ కప్‌లో కెనడా సత్తాచాటింది. కప్‌ చరిత్రలో రెండో సారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో కెనడా 2-1తో ఇటలీపై విజయం సాధించింది. 1998 తర్వాత మరోసారి ఫైనల్‌ చేరుకోవాలనుకున్న ఇటలీ ఆశలపై నీళ్లు చల్లింది. 2019 తర్వాత మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిన కెనడా స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి సింగిల్స్‌లో లొరెంజో సొనెగో 7-6 (4), 6-7 (5), 6-4తో డెనిస్‌ షపోవలోవ్‌పై నెగ్గి 1-0తో ఇటలీకి ఆధిక్యాన్ని అందించాడు. అయితే 22 ఏళ్ల ఫెలిక్స్‌ ఆగర్‌ అలియాసిమ్‌ 6-3, 6-4తో లొరెంజో ముసెటీని చిత్తుచేసి 1-1తో స్కోరును సమం చేశాడు. డబుల్స్‌లో ఆగర్‌- వాసెక్‌ పోస్పిసిల్‌ జోడీ 7-6 (2), 7-5తో మతియో బెరెటిని- ఫాబియో ఫోగ్నిని జంటపై గెలిచి కెనడాకు 2-1తో విజయాన్ని అందించింది. 2019 ఫైనల్లో స్పెయిన్‌ చేతిలో ఓడిన కెనడా జట్టులో ఆగర్‌, షపోవలోవ్‌, పోస్పిసిల్‌ ఉన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రష్యాపై సస్పెన్షన్‌ కారణంగా కెనడాకు ఈసారి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ దక్కింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో కెనడా తలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని