బూట్లు తీయించి.. సాక్స్‌ విప్పించి

జర్మనీలో బుండెస్‌లిగా చెస్‌ లీగ్‌ ఆడేందుకు వెళ్లిన భారత గ్రాండ్‌మాస్టర్‌ ఎస్‌ఎల్‌ నారాయణన్‌కు చేదు అనుభవం ఎదురైంది.

Published : 29 Nov 2022 02:25 IST

భారత గ్రాండ్‌మాస్టర్‌కు చేదు అనుభవం

చెన్నై: జర్మనీలో బుండెస్‌లిగా చెస్‌ లీగ్‌ ఆడేందుకు వెళ్లిన భారత గ్రాండ్‌మాస్టర్‌ ఎస్‌ఎల్‌ నారాయణన్‌కు చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్‌ గదిలోకి వచ్చిన అతడ్ని తనిఖీల పేరుతో భద్రతాధికారులు బూట్లు, సాక్సులు విప్పించారు. కాసేపు అలాగే పక్కన నిల్చోబెట్టారు. ‘‘చాలా అవమానంగా అనిపించింది. ఇప్పుడు మౌనంగా ఉంటే లాభం లేదని మాట్లాడుతున్నా. మ్యాచ్‌ ఆడేందుకు గదిలోకి వచ్చినప్పుడు మెటల్‌ డిటెక్టర్‌ బీప్‌ శబ్దం చేసింది. దీంతో బూట్లు విడవాలని భద్రతా సిబ్బంది అడిగారు. బూట్లు తీసిన తర్వాత మరోసారి శబ్దం వచ్చింది. దీంతో సాక్సులు కూడా తీయాలన్నారు. ఆ తర్వాత కూడా మళ్లీ డిటెక్టర్‌ మోగింది. దీంతో నన్ను పక్కన పెట్టి వేరే వాళ్లను ముందుకు రమ్మన్నారు. వాళ్లకి కూడా అదే ఫలితం వచ్చింది. దీంతో నేల మీదున్న కార్పెట్‌ నుంచే ఈ శబ్దం వస్తున్నట్లు ఆర్బిటర్‌ గుర్తించారు. నాకు క్షమాపణలు చెప్పారు. కానీ ఆ కొద్దిసేపు చాలా అవమానంగా అనిపించింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందే ఆర్బిటర్లు ఇవన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఇలాంటి పరిస్థితిలో నిలవడం చెస్‌ క్రీడాకారులకు ఇదే తొలిసారి కాదు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఫిడే చర్యలు తీసుకోవాలి’’ అని నారాయణన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. జేబులో ఇయర్‌ బడ్స్‌ ఉన్నాయన్న కారణంతో ఇటీవల ప్రపంచ జూనియర్‌ చెస్‌ టోర్నమెంట్లో తెలుగమ్మాయి నూతక్కి ప్రియాంకను టోర్నీ నుంచి తప్పించడం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని