టీమ్‌ఇండియా.. క్రిప్టో కంటే వేగంగా!

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ఓటమి పాలైన భారత జట్టుపై మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించారు. టీమ్‌ఇండియా ఆటతీరును మార్చుకోవాలని మదన్‌లాల్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌ విమర్శించారు.

Updated : 09 Dec 2022 05:08 IST

దిల్లీ: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ఓటమి పాలైన భారత జట్టుపై మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించారు. టీమ్‌ఇండియా ఆటతీరును మార్చుకోవాలని మదన్‌లాల్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌ విమర్శించారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్‌ఇండియా ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ ప్రసాద్‌ సూచించగా.. రోహిత్‌ బృందం మేల్కోవాలని సెహ్వాగ్‌ హెచ్చరించాడు. ‘‘క్రిప్టో కంటే వేగంగా మన ప్రదర్శన పడిపోతుంది మిత్రమా. కదలిక రావాలి.. మేల్కోవాలి’’ అని ట్విటర్‌ వేదికగా సెహ్వాగ్‌ అన్నాడు. ‘‘ప్రపంచవ్యాప్తంగా భిన్న రంగాల్లో భారత్‌ ఆవిష్కరణలు చేస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వచ్చేసరికి మన దృక్పథం దశాబ్దకాలం వెనుకబడి ఉంది. 2015 ప్రపంచకప్‌లో తొలి రౌండ్‌ నిష్క్రమణ తర్వాత ఇంగ్లాండ్‌ కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు తిరుగులేని జట్టుగా ఎదిగింది. టీమ్‌ఇండియా కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవాలి. గత అయిదేళ్లలో కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు మినహాయిస్తే వన్డేల్లో ప్రదర్శన పేలవంగా ఉంది. సుదీర్ఘ కాలంగా పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవట్లేదు’’ అని ప్రసాద్‌ ట్వీట్‌ చేశాడు. ‘‘కచ్చితంగా టీమ్‌ఇండియా సరైన దిశలో వెళ్లట్లేదు. జట్టులో తీవ్రత కనిపించట్లేదు. గత కొన్నేళ్లుగా జట్టులో ఉత్సాహం కొరవడింది. ప్రస్తుత జట్టు టీమ్‌ఇండియా మాదిరి లేనేలేదు. ఆటగాళ్లలో దేశానికి ఆడుతున్నామన్న కసి లోపించింది. ఇది ఆందోళన కలిగించే విషయం’’ అని మదన్‌లాల్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని