IND vs ENG: టీమ్ఇండియా 255 ఆలౌట్.. ఇంగ్లాండ్ టార్గెట్ 399

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Updated : 04 Feb 2024 16:12 IST

విశాఖపట్నం: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ సేన 143 పరుగుల ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్ (104; 147 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్ (45; 84 బంతుల్లో 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్‌ హార్ట్‌లీ 4, రెహాన్‌ అహ్మద్‌ 3, జేమ్స్‌ అండర్సన్‌ 2, షోయబ్‌ బషీర్‌ ఒక వికెట్ పడగొట్టారు. 

ఆదుకున్న గిల్‌..

28/0 స్కోరుతో మూడో ఆటను కొనసాగించిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌ తగిలింది. అండర్సన్‌ తన వరుస ఓవర్లలో రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్‌ (17)ను ఔట్‌ చేశాడు. రోహిత్‌ క్లీన్‌ బౌల్డ్‌ అవ్వగా.. యశస్వి స్లిప్‌లో జో రూట్‌కు చిక్కాడు. 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియాను గిల్ ఆదుకున్నాడు. రెండుసార్లు ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు నిలకడగా ఆడాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (29)తో కలిసి మూడో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. హార్ట్‌లీ బౌలింగ్‌లో శ్రేయస్‌ భారీ షాట్‌ కొట్టగా స్టోక్స్‌ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కాసేపటికే రజత్‌ పటీదార్‌ (9)ను రెహాన్‌ వెనక్కి పంపాడు. భోజన విరామ సమయానికి భారత్ 130/4 స్కోరుతో నిలిచింది. 

రెండో సెషన్‌లో గిల్, అక్షర్‌ పటేల్ ధాటిగా ఆడారు. క్రీజులో పాతుకుపోయిన శుభ్‌మన్‌ 132 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం బషీర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. హార్ట్‌లీ బౌలింగ్‌లో అక్షర్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. చివరి సెషన్‌లో భారత్‌ 28 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. అశ్విన్‌ (29) ఒక్కడే పోరాడాడు. శ్రీకర్‌ భరత్ (6) విఫలమయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని