SA vs IND: వర్షం వల్ల బంతి జారిపోయింది.. ఈ ఓటమి మాకు మంచి పాఠమే: సూర్యకుమార్‌ యాదవ్‌

దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 0-1 తేడాతో (IND vs SA) వెనుకబడింది. తొలి మ్యాచ్‌ రద్దు కాగా.. రెండో టీ20లో టీమ్‌ఇండియాకు ఓటమి ఎదురైంది. 

Published : 13 Dec 2023 10:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్‌ఇండియా (IND vs SA) ఓటమితో ప్రారంభించింది. వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన తొలి టీ20 రద్దైన సంగతి తెలిసిందే. అయితే,  గబేహా వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్‌ను ఐదు వికెట్ల తేడాతో సఫారీ జట్టు (డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో) ఓడించింది. ఈ మ్యాచ్‌కూ వరుణుడు కాసేపు ఆటంకం కలిగించాడు. భారత్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు బంతి విపరీతంగా జారిపోయిందని.. ఇదే తమ ఓటమికి కారణమని కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ వ్యాఖ్యానించాడు. 

‘‘ మా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత మేం సాధించిన (180) స్కోరు సరిపోతుందని భావించా. కానీ, దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. తొలి ఐదారు ఓవర్లలోనే మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఇలాంటి బ్రాండ్‌ క్రికెట్‌ను మేం కూడా ఆడతాం. మైదానంలోకి దిగితే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాలి. అయితే, మేం బౌలింగ్‌ చేస్తున్నప్పుడు బంతి చేతుల్లో నుంచి జారిపోయింది. బంతి తడిసిపోవడంతో పట్టు దొరకలేదు. అయితే, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే, ఇలాంటి గేమ్‌ మాకు మంచి పాఠమవుతుందని భావిస్తున్నా. మూడో టీ20లో తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేస్తాం’’ అని సూర్యకుమార్‌ తెలిపాడు.

ఆరంభంలో నెమ్మదించిన పిచ్‌.. 

‘‘డర్బన్‌ వేదికగా జరగాల్సిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడం నిరాశపరిచింది. అయితే, ఈ మ్యాచ్‌ కోసం భారీగా అభిమానులు వచ్చారు. వారి ముందు అద్భుత ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉంది. తొలుత పిచ్‌ కాస్త నెమ్మదిగా ఉందని అనిపించింది. కానీ, వర్షం పడిన తర్వాత మార్పు వచ్చింది. టీ20 క్రికెట్‌లో ఏక్షణం ఏం జరుగుతుందనేది చెప్పలేం. యువ బ్యాటర్ రీజా హెండ్రిక్స్‌ బాగా ఆడాడు. బ్యాటింగ్‌లో నాయకత్వ పాత్రను తీసుకున్నాడు. వచ్చే వరల్డ్‌ కప్‌ జట్టులో ఎంపిక కావడం కోసం ప్రతి ఆటగాడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. జట్టులో ఆరోగ్యకరమైన పోటీ ఉంది’’ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్‌ వ్యాఖ్యానించాడు.

మళ్లీ ఆ సెలబ్రేషన్స్‌ వెనుక కారణమిదే..

‘వికెట్‌ తీసినప్పుడల్లా షూతో ఫోన్‌ చేస్తున్నట్లు సంబరాలు చేసుకోవడానికి దూరంగా ఉండాలని అనుకున్నా. కానీ, మా పిల్లలు మాత్రం అలా చేయాలని అడిగారు. వారిని నిరుత్సాహపరచకూడదని మరోసారి అలా చేశా. భారత్‌ జట్టుపై తీవ్ర ఒత్తిడిలో బౌలింగ్‌ చేయడం సవాల్‌తో కూడుకున్నదే. మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ను అడ్డుకోవడం కూడా కష్టమే. అయితే, బౌలింగ్‌లో మార్పులు చేస్తూ మార్‌క్రమ్‌ అద్భుత కెప్టెన్సీ చేశాడు. కోచ్‌ రాబ్‌ జట్టులో మంచి వాతావరణం తీసుకొచ్చాడు. మైదానంలో కఠినంగా శ్రమించడంతోపాటు మా కుటుంబ సభ్యులతో కలిసి ఉండేలా అనుమతి లభించడం మరింత ఆనందంగా ఉంది. దాని వల్ల కలిగే ప్రయోజనాలను మైదానంలో చూపిస్తున్నాం’’ అని తంబ్రిజ్ షంసి తెలిపాడు. ఈ  మ్యాచ్‌లో షంసి తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులే ఇచ్చాడు. కీలకమైన సూర్యకుమార్‌ను ఔట్‌ చేశాడు. దీంతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని