IPL 2023: అతడే అత్యుత్తమ ఫినిషర్‌.. మరెవరూ సాటిరారు: రియాన్ పరాగ్‌

క్లిష్టసమయాల్లో ఏమాత్రం బెరుకు లేకుండా మ్యాచ్‌ను ముగించేవాడిని ఫినిషర్ అంటాం. మరి ఇలాంటి కీలక పాత్ర పోషించే ఆటగాళ్లలో ఎవరు అత్యుత్తమం? అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఐపీఎల్‌ (IPL 2023) కొత్త సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ కీలక విషయాలను వెల్లడించాడు.

Published : 29 Mar 2023 10:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ (IPL 2023) సందడి మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. జట్లన్నీ ప్రాక్టీస్‌ షురూ చేశాయి. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఆటగాళ్లంతా నెట్స్‌లో శ్రమిస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో ఫినిషర్ పాత్ర  చాలా కీలకం. ప్రతి జట్టులోనూ లోయర్‌ ఆర్డర్‌లో ఇలాంటి ప్లేయర్‌ ఉంటాడు. ఈ కోవకు చెందిన ఆటగాడే రియాన్ పరాగ్‌ (Riyan Parag). గత సీజన్లలో క్లిష్టసమయాల్లో రాజస్థాన్‌ రాయల్స్‌ను గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, అతడి దృష్టిలో మాత్రం అత్యుత్తమ ఫినిషర్‌ మరొకరు ఉన్నారట. ఇంతకీ ఆ ‘ఫినిషర్’ మరెవరో కాదు.. కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్ ధోనీ. ఇదే విషయంపై రియాన్ పరాగ్‌ స్పందించాడు. అలాగే, ఫినిషర్‌ పాత్ర పోషించడంపై ఆనందం వ్యక్తం చేసిన రియాన్‌.. అవకాశం వస్తే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టాడు.

‘‘రాజస్థాన్‌ రాయల్స్‌ మేనేజ్‌మెంట్‌ నన్ను ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయమన్నా ఆడేందుకు సిద్ధంగా ఉంటా. అయితే, ఎంపిక చేసుకోమని అడిగితే మాత్రం రెండో డౌన్‌లో ఆడేందుకు ఆసక్తి చూపుతా. జట్టు అవసరాలకు తగ్గట్లుగా నేను ఎక్కడ ఫిట్‌ అవుతాననేది వారికి బాగా తెలుసు. కేవలం ఒకరిద్దరు ఆడితే మ్యాచ్‌ గెలవలేం. టీమ్ అంతా కలిసి కట్టుగా రాణించాలి. గత మూడేళ్లుగా ఫినిషర్ పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. అయితే, అత్యుత్తమ ఫినిషర్‌ అని అంటే మాత్రం నాకు మొదట గుర్తుకొచ్చే పేరు ఎంఎస్ ధోనీ.  అతడి స్థానంలో మరొక ఆటగాడిని అస్సలు ఊహించలేను. ధోనీ మ్యాచ్‌ను ఎలా అంత అద్భుతంగా ముగిస్తాడనేదానిని నిరంతరం గమనిస్తూనే ఉంటా’’ అని పరాగ్‌ తెలిపాడు. 

గత సీజన్‌లో గొప్పగా రాణించలేకపోయిన పరాగ్‌.. ఈసారి మాత్రం మంచి ప్రదర్శన ఇస్తానని భరోసా ఇచ్చాడు.  దేశవాళీ క్రికెట్‌లో రాణించడం వల్లే నమ్మకంగా చెబుతున్నట్లు పేర్కొన్నాడు. ‘‘ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శనే చేశా. అందుకే, ఐపీఎల్‌లో రాణించగలనని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. ఇప్పటికే జైపుర్‌లో మా కోసం కొన్ని క్యాంప్‌లు కూడా జరిగాయి. ప్రతి ఒక్కరూ బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి టచ్‌లోనే ఉన్నారు. నాలో ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. బౌలింగ్‌లోనూ తీవ్రంగా శ్రమించా. దేశవాళీ క్రికెట్‌ సీజన్‌లో ఈసారి దాదాపు 350 ఓవర్లపాటు బౌలింగ్‌ చేశా. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్‌లోనూ నా సత్తా చాటుతా’’ అని పరాగ్‌ చెప్పాడు. మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 2వ తేదీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని