రెండో టైటిల్‌పై భారత్‌ గురి

ప్రతిష్టాత్మక థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌కు రంగం సిద్ధమైంది. స్టార్‌ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్‌ కప్‌ టైటిల్‌ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా..

Published : 27 Apr 2024 02:23 IST

నేటి నుంచే థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌

చెంగ్‌డు (చైనా): ప్రతిష్టాత్మక థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌కు రంగం సిద్ధమైంది. స్టార్‌ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్‌ కప్‌ టైటిల్‌ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. ఉబెర్‌ కప్‌పై తమదైన ముద్ర వేయాలన్న పట్టుదలతో యువ మహిళల జట్టు బరిలో దిగుతుంది. శనివారం ప్రారంభం కానున్న ఈ టోర్నీలో థామస్‌ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. టీమ్‌ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌గా భావించే కప్‌లో రెండేళ్ల క్రితం భారత పురుషుల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. థామస్‌ కప్‌ చరిత్రలో మొట్టమొదటి సారిగా విజేతగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన భారత్‌.. అగ్రశ్రేణి జట్లను మట్టికరిపించి ఛాంపియన్‌గా అవతరించింది. అయితే ఈసారి భారత్‌కు గట్టి పోటీ తప్పకపోవచ్చు. అత్యంత కఠినమైన గ్రూపు-సిలో భారత్‌కు చోటు దక్కింది. గతంలో చాలా సార్లు టైటిల్‌ సాధించిన ఇండొనేసియా, థాయ్‌లాండ్‌, ఇంగ్లాండ్‌ ఇదే గ్రూపులో ఉన్నాయి. తొలి పోరులో థాయ్‌లాండ్‌తో భారత్‌ తలపడనుంది. సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌, లక్ష్య సేన్‌, కిదాంబి శ్రీకాంత్‌, ప్రియాన్షు రజావత్‌.. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి, ధ్రువ్‌- అర్జున్‌ జోడీలపై భారత్‌ ఆశలు పెట్టుకుంది. ఉబెర్‌ కప్‌ గ్రూపు-ఎలో భారత్‌, చైనా, కెనడా, సింగపూర్‌ జట్లకు చోటు దక్కింది. పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నాహాల్లో భాగంగా స్టార్‌ క్రీడాకారిణి పి.వి.సింధు ఉబెర్‌ కప్‌కు దూరమవగా.. అష్మిత చాలిహా ఆధ్వర్యంలో భారత మహిళల జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఉబెర్‌ కప్‌లో 1957, 2014, 2016లలో భారత్‌ సెమీస్‌ చేరుకుంది. పటిష్టమైన చైనా, సింగపూర్‌ గ్రూపులో ఉండటంతో భారత్‌ ఈసారి నాకౌట్‌కు అర్హత సాధించడం కష్టమే. ప్రతి గ్రూపులో తొలి  రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని