సింగిల్స్‌.. సింగిల్స్‌.. సింగిల్స్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్‌లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది.

Published : 27 Apr 2024 02:25 IST

బెంగళూరు: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్‌లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి అర్ధశతకం సాధించినా.. అతడి స్ట్రైక్‌రేట్‌ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అతడు కేవలం 118.60 సగటుతో పరుగులు సాధించాడు. ముఖ్యంగా పవర్‌ప్లే తర్వాత అతడి వేగం బాగా తగ్గింది. ఎదుర్కొన్న మొదటి 18 బంతుల్లో 32 పరుగులు చేసిన అతడు.. తర్వాతి 25 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు. వ్యాఖ్యానం చేస్తున్న గావస్కర్‌ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లి సింగిల్స్‌ మాత్రమే తీస్తున్నాడని అన్నాడు. ‘‘సింగిల్స్‌.. సింగిల్స్‌.. సింగిల్స్‌! కోహ్లి నుంచి సింగిల్స్‌ మాత్రమే వస్తున్నాయి. కార్తీక్‌ బ్యాటింగ్‌కు రావాల్సివుంది. లొమ్రార్‌ కూడా రావాలి. ఇప్పుడు కోహ్లి సాహసించి కొన్ని షాట్లు ఆడాలి. పటీదార్‌ను చూడండి. అతడు ఇప్పటికే ఆ ఓవర్లో మూడు సిక్స్‌లు కొట్టాడు. రజత్‌ కోరుకుంటే సింగిల్‌ తీసుకునేవాడు లేదా వైడయ్యే అవకాశమున్న బంతిని వదిలేసే వాడు. కానీ అలా చేయలేదు. అవకాశముంది కాబట్టి భారీ షాట్‌ ఆడాడు. ఆర్సీబీకి కావాల్సింది అలాంటి ఆటే. కోహ్లి ఆడి, గురి తప్పిన మాట నిజమే. కానీ ఎక్కువసేపు సింగిల్స్‌ తీస్తూ గడిపి.. ఒక్కసారిగా బ్యాట్‌ ఝళిపించాలంటే తేలిక కాదు. ధాటిగా ఆడేందుకు కోహ్లి ప్రయత్నించాలి. నంబర్లు కచ్చితంగా చెప్పలేను కానీ.. వ్యక్తిగత స్కోరు 31-32 నుంచి ఔటయ్యే వరకు కోహ్లి ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. ఇన్నింగ్స్‌ తొలి బంతిని ఎదుర్కొన్న బ్యాటర్‌ 14వ లేదా 15వ ఓవర్లో ఔటయ్యే సమయానికి కేవలం 118 స్ట్రైక్‌రేట్‌ కలిగి ఉండడాన్ని  జట్టు కోరుకోదు. జట్టు అతడి నుంచి ఆశించింది అది కాదు’’ అని గావస్కర్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని