IPL 2023: ఇద్దరు ‘పీసీ’లు.. ఒకరేమో ప్రియాంక చోప్రా.. మరొకరు ఎవరంటే: రవిశాస్త్రి

ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్‌ (MI) విజయంతో పాయింట్ల ఖాతాను తెరిచింది. మరోవైపు డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని దిల్లీ క్యాపిటల్స్ (DC) వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది.

Updated : 12 Apr 2023 11:06 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో బోణీ కొట్టింది. చివరి బంతికి దిల్లీపై (DC vs MI) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీని 172 పరుగులకు ఆలౌట్‌ చేయడంలో.. సీనియర్‌ ఆటగాడు, ముంబయి ఇండియన్స్‌ బౌలర్ పీయూశ్‌ చావ్లా (Piyush Chawla) కీలక పాత్ర పోషించాడు. కీలకమైన మనీశ్‌ పాండే, రోవ్‌మన్ పావెల్, లలిత్‌ యాదవ్‌ వికెట్లను పడగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులకే మూడు వికెట్లను తీశాడు. ఈ క్రమంలో పీయూశ్‌ బౌలింగ్‌పై టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. ఓ క్రీడా ఛానల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి.. కామెంట్రీ సందర్భంగా చావ్లాను ఆకాశానికెత్తేశాడు.

‘‘ఇప్పుడు మనకు ఇద్దరు పీసీలు ఉన్నారు. వారిలో ఒకరు ప్రియాంక చోప్రా కాగా.. మరొకరు పీయూశ్‌ చావ్లా’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గత సీజన్‌ వేలంలో అన్‌సోల్డ్‌గా మారి కొన్ని మ్యాచ్‌లకు కామెంట్రీ చేసిన పీయూశ్‌.. తనకొచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. దిల్లీతో మ్యాచ్‌ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబయి విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. రోహిత్ శర్మ (65) చాలా రోజుల తర్వాత కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. స్టార్‌ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ డకౌట్‌గా వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు కంటిపై భాగంలో అతడికి గాయమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 16న కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేడో తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని