Cricket News: ఐపీఎల్‌ వేలంలో అతడు హాట్‌కేక్‌... ధోనీ నడిపిన కార్‌ నంబర్‌ 0007.. రింకుపై ఆ ముద్ర వద్దన్న నెహ్రా!

Published : 29 Nov 2023 18:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ వేలంలో ఓ ఆటగాడు మాత్రం భారీ ధరను దక్కించుకుంటాడని అశ్విన్‌ చెబుతున్నాడు. ఆసీస్‌తో వన్డేల్లో అదరగొట్టేస్తున్న రింకు సింగ్‌పై అనవసరమైన ముద్ర వేయొద్దని నెహ్రా సూచించాడు. నెట్టింట వైరల్‌గా మారిన ధోనీ నడిపిన కారు నెంబర్‌.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం.. 

షారుఖ్‌ ఖాన్‌కు రూ. 12 నుంచి 13 కోట్లు: అశ్విన్‌

డిసెంబర్‌ 19న జరగనున్న ఐపీఎల్‌ వేలంలో షారుఖ్‌ ఖాన్‌ హాట్‌కేక్‌గా మారతాడని టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే ఆయా జట్ల రిటెన్షన్‌/రిలీజ్‌ జాబితా విడుదలైన సంగతి తెలిసిందే.జోఫ్రా ఆర్చర్‌, బెన్‌ స్టోక్స్, శార్దూల్ ఠాకూర్‌, షారుఖ్‌ ఖాన్, భానుక రాజపక్స తదితరులు రిలీజ్‌ అయ్యారు. అశ్విన్‌ మాత్రం షారుఖ్‌ ఖాన్‌కు భారీ ధర దక్కే అవకాశం ఉందని పేర్కొన్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడిన షారుఖ్‌ను ఆ జట్టు వదిలేసింది. ‘‘షారుఖ్‌ ఖాన్‌ కోసం సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని భావిస్తున్నా. హార్దిక్‌ పాండ్య వీడటంతో గుజరాత్‌కు మిడిలార్డర్‌లో కీలక బ్యాటర్‌ అవసరం. పవర్‌ హిట్టర్‌ అయిన షారుఖ్‌ కింగ్స్‌ తరఫున రూ. 9 కోట్లు అందుకున్నాడు. ఇప్పుడు తప్పకుండా వేలంలో రూ. 12 కోట్ల నుంచి రూ. 13 కోట్లు వరకు పొందుతాడని అనుకుంటున్నా’’ అని అశ్విన్‌ వెల్లడించాడు.


రింకు సింగ్‌కు ఇప్పుడే ‘ఫినిషర్‌’ ట్యాగ్‌ జోడించొద్దు: నెహ్రా

ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో యువ బ్యాటర్ రింకు సింగ్‌ అద్భుతమైన ఫినిషింగ్‌తో అదరగొట్టేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ధోనీని తలపిస్తున్నాడని ‘ఫినిషర్‌’గా పేర్కొంటూ మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, భారత మాజీ పేసర్ ఆశిశ్ నెహ్రా మాత్రం అప్పుడే రింకు సింగ్‌కు ‘ఫినిషర్‌’ అనే పదం జోడించవద్దని సూచించాడు. ‘‘రింకు సింగ్‌ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు రావడం కొత్తేమీ కాదు. దేశవాళీలో అద్భుతంగా ఆడాడు. మైదానంలోనూ ఎంతో చురుగ్గా ఉంటాడు. తప్పకుండా భారత జట్టుకు విలువైన ఆస్తిగా మారతాడు. ఇప్పుడైతే టీ20ల్లో అతడి ఆటను చూస్తున్నాం. ఏదో ఒక రోజు వన్డేల్లోనూ ఆడతాడు. చాలా మంది ‘ఫినిషర్‌’ అంటూ సంబోధించడం సరైంది కాదు. నాకు ఆ పదమంటే నచ్చదు. ఎందుకంటే ఓపెనర్‌గా వచ్చిన వారూ మ్యాచ్‌ను ఫినిష్‌ చేయొచ్చు. రింకు సింగ్‌ ఒకవేళ వన్డేల్లో టాప్‌ ఆర్డర్‌లో ఆడాల్సి వస్తుంది. అప్పుడు ఏమని పిలవాలి? అతడికి ప్రతి స్థానంలో ఆడగలిగే సత్తా ఉంది. కాబట్టి, అతడు తానొక ‘ఫినిషర్‌’ అనే ట్యాగ్‌ను జోడించుకోడని భావిస్తున్నా’’ అని నెహ్రా తెలిపాడు. 


నెట్టింట ధోనీ వీడియో వైరల్‌.. కార్‌ నంబర్‌ చూశారా?

టీమ్‌ఇండియా ‘కెప్టెన్‌ కూల్‌’ ఎంఎస్ ధోనీకి బైకులు, కార్లంటే చాలా ఇష్టం. అతడి గరాజ్‌లో వాటికి కొదవేం లేదు. వీలుచిక్కినప్పుడల్లా రైడింగ్‌ చేస్తూ ఉంటాడని తెలుసు కదా. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న ధోనీ.. మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌ కోసం సమాయత్తమవుతున్నాడు. అయితే, ధోనీ ‘టెన్నిస్ పార్టనర్‌’ సుమీత్‌ కుమార్‌ బజాజ్‌తో కలిసి మెర్సిడెజ్‌ కార్‌లో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఆ కారు నంబర్‌ చివరిలో 0007 రావడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. సీఎస్‌కే జెర్సీ కూడా 7 నంబర్‌తో ఉంటుందని ఫ్యాన్స్‌ గుర్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు