Sports News: టాప్‌లోనే అశ్విన్‌.. ప్రపంచ రికార్డు సృష్టించిన బాలీవుడ్ డైరెక్టర్‌ కుమారుడు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. బాలీవుడ్ దర్శకుడు వినోద్ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో ప్రపంచ రికార్డు సృష్టించాడు.  ఇలాంటి క్రీడా విశేషాలు మీ కోసం.. 

Published : 31 Jan 2024 21:19 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin)టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ ఉప్పల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో చెరో ఆరు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఆల్‌రౌండ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్న జడేజా.. బౌలింగ్‌ విభాగంలో ఆరో స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్‌ విభాగం ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్‌-10లో నిలిచాడు. కోహ్లీ ఒక స్థానం మెరుగై 767 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు. భారత్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసిన ఓలీపోప్‌ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు.


ప్రపంచ రికార్డు సృష్టించిన బాలీవుడ్ డైరెక్టర్‌ కుమారుడు  

బాలీవుడ్‌ దర్శకుడు విధూ వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) కుమారుడు అగ్ని చోప్రా (Agni Chopra) రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. మిజోరం తరఫున ఆడుతున్న ఈ 25 ఏళ్ల కుర్రాడు అరంగేట్ర సీజన్‌లోనే ఇప్పటివరకు ఐదు సెంచరీలు బాదాడు. ఈ క్రమంలోనే ఫస్టక్లాస్‌ క్రికెట్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా ప్రపంచ రికార్డు  సృష్టించాడు. దీంతో అగ్ని చోప్రా తల్లి అనుపమ్‌ చోప్రా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుమారుడి రికార్డుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ ‘‘తల్లిగా గర్విస్తున్నా’’ అని క్యాప్షన్‌ పెట్టింది. అగ్నిచోప్రా సిక్కింపై (166, 92), నాగాలాండ్‌పై (166, 15), అరుణాచల్‌ప్రదేశ్‌పై (114, 10), మేఘాలయపై (105, 101) స్కోర్లు నమోదు చేశాడు. 


భారత డేవిస్‌ కప్ కెప్టెన్‌గా జీషన్‌ అలీ 

భారత డేవిస్‌ కప్‌ కెప్టెన్‌గా జీషన్‌ అలీని నియమించారు. ఈవిషయాన్ని ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్ (ఏఐటీఏ) సెక్రటరీ జనరల్ అనిల్ ధూపర్ తెలిపారు. ‘‘కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మా నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ జట్టుతో కలిసి ప్రయాణించలేకపోయాడు. చాలా సీనియర్ ఆటగాడు అయిన జీషన్ అలీని జట్టుకు కెప్టెన్‌గా నియమించాం’’ అని అనిల్ ధూపర్ వెల్లడించారు. 60 ఏళ్ల తర్వాత భారత టెన్నిస్‌ జట్టు తొలిసారిగా పాకిస్థాన్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో భారత డేవిస్‌ కప్‌ జట్టుకు పాకిస్థాన్‌ పటిష్ట భద్రత కల్పించింది. అయిదంచెల భద్రతను భారత జట్టుకు కేటాయించారు. జీషన్‌ అలీ తండ్రి అక్తర్‌ 1964లో పాక్‌లో పర్యటించిన భారత జట్టులో కీలక ఆటగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని