INDW vs AUSW: ధోనీలా మ్యాచ్‌ను ముగించాలనుకుంటా: రిచా ఘోష్‌

చిన్ననాటి నుంచి ధోనీ ఆటకు తాను అభిమానినని.. అయితే, ఇప్పటివరకు అతడిని కలవలేకపోయానని టీమ్‌ఇండియా క్రికెటర్‌ రిచా ఘోష్‌(Richa Ghosh) తెలిపింది.

Published : 14 Dec 2022 14:08 IST

ముంబయి: టీమ్‌ఇండియా మహిళల జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా రిచా ఘోష్‌(Richa Ghosh) రాణిస్తోంది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన టీ20(INDW vs AUSW) సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లో తన మ్యాజిక్‌ను చూపిన విషయం తెలిసిందే. 17వ ఓవర్లో స్మృతి మంధాన 49 బంతుల్లో 79 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరడంతో మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లాయి.  ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన రిచా తన బ్యాట్‌తో విరుచుకుపడింది. మూడు సిక్సర్లు కొట్టి ఆసీస్‌పై గెలుపులో కీలక పాత్ర పోషించింది.  ఈ విషయంలో తాను మహేంద్రసింగ్‌ ధోనీ(dhoni)ని స్ఫూర్తిగా తీసుకుంటానని తెలిపింది. 

‘‘గేమ్‌ ఫినిష్‌ చేసుకొని రావాలని స్మృతి అక్క నాతో చెప్పింది. ఆమె చెప్పినట్టుగానే నేను చేశాను. పవర్‌ హిట్టింగ్‌పై నేను ఎక్కువ దృష్టి పెడతాను. అదే సమయంలో మానసికంగా దృఢంగా ఉండేలా చూసుకుంటాను. ఇందుకోసం ఓ ప్రణాళిక ముందుగానే ఉంటుంది. చివరి వరకు గేమ్‌లో ఉండి జట్టును గెలిపించాలని నేను కోరుకుంటాను. కీలక సమయాల్లో ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు మిడిల్‌ ఓవర్స్‌లో పరుగులు తగ్గకుండా చూసుకుంటాం’’ అని రిచా వివరించింది. తన ఆట విషయంలో తన తండ్రి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని తెలిపింది. చిన్ననాటి నుంచి తాను ధోని ఆటను చూస్తూ పెరిగానని.. ఇప్పటికీ తనలా ఆడేందుకు ప్రయత్నిస్తానని పేర్కొంది.

‘‘ధోనీ గేమ్‌ను ఫినిష్‌ చేసే విధానం నన్ను ఆకర్షించేది. అయితే, ఇప్పటివరకు అతడిని కలిసే అవకాశం నాకు దొరకలేదు. నేను మ్యాచ్‌ వేదికకు వెళ్లే సమయానికే అతడు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగేది. కచ్చితంగా ఏదో ఒకరోజు కలిసే తీరుతా’’ అని రిచా తెలిపింది. అయితే, అతడిని కలిసినప్పుడు ఏం మాట్లాడాలో మాత్రం తానింకా నిర్ణయించుకోలేదని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు