Rohit: ఆ రోజులు మళ్లీ గుర్తుకొచ్చాయి..: రోహిత్ శర్మ

టీమ్‌ఇండియాలో (Team India) యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడానికి సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లీ తమ స్థానాలను త్యాగం చేశారు. దానికి కారణం ఏంటో కూడా రోహిత్ చెప్పాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

Updated : 28 Jul 2023 10:56 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌పై మూడు వన్డేల (WI vs IND) సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో భారత్‌ గెలిచింది. అయితే.. స్వల్ప స్కోరుకే ప్రత్యర్థిని తొలుత కట్టడి చేయడంతో.. టీమ్‌ఇండియా ప్రయోగాలు చేసింది. ఈ క్రమంలో ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మ రాలేదు. అలాగే విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్‌కు దిగలేదు. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇదే విషయంపై రోహిత్ శర్మ స్పందించాడు.

జడేజా-కుల్‌దీప్ తొలి జోడీగా రికార్డు!

‘‘బార్బడోస్‌ పిచ్‌ ఇలా స్పందిస్తుందని అనుకోలేదు. జట్టులోని బౌలర్లను పరీక్షించేందుకు టాస్‌ నెగ్గగానే బౌలింగ్‌ ఎంచుకోవడం జరిగింది. సీమర్లు, స్పిన్నర్లకు సమానంగా పిచ్‌ నుంచి సహకారం లభించింది. మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి విండీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఇక మా ప్లేయర్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలనేదే మా లక్ష్యం. ఎప్పుడు వీలైతే అప్పుడు ఛాన్స్‌ ఇచ్చి ప్రోత్సహిస్తాం. వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో జట్టును సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఎక్కువగా అవకాశాలు వస్తాయని చెప్పలేను కానీ.. వీలుచిక్కినప్పుడల్లా ఆడిస్తాం. ఇక నేను ఏడో స్థానంలో రావడంపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. నాకు ఇదేమీ కొత్త స్థానం కాదు. నేను అరంగేట్రం చేసినప్పుడు ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడిని. ఇప్పుడు ఆ రోజులు మళ్లీ గుర్తుకు వచ్చాయి. ముకేశ్‌ కుమార్‌ రెండు వైపులా అద్భుతంగా స్వింగ్‌ చేయగలిగాడు.  మా ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ సూపర్‌గా ఆడాడు’’ అని రోహిత్ తెలిపాడు. 

ఏం చెప్పాలో అర్థం కావడం లేదు: షై హోప్

ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ ప్రదర్శననే మళ్లీ పునరావృతం చేస్తూ భారత్‌ చేతిలో ఓడిపోవడంపై విండీస్ కెప్టెన్ షై హోప్‌ నిరుత్సాహానికి గురయ్యాడు. ‘‘ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మాటలు రావడం లేదు. విజయం దిశగా మేం ఆడలేదనేది వాస్తవం. ఇలాంటి పిచ్‌లపై పరుగులు చేయాలంటే కాస్త  ఓపికగా ఉండాలి. కానీ, తొలి వన్డేలో అదే లోపించింది. సీల్స్ అత్యుత్తమ పేసర్. తప్పకుండా భవిష్యత్తులో విండీస్‌ క్రికెట్‌కు ఆయుధంగా మారతాడు. ఇక భారత బౌలర్లు అద్భుతంగా బంతులను సంధించారు’’ అని వ్యాఖ్యానించాడు. 

మ్యాచ్‌ మరికొన్ని విశేషాలు..

  • తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్‌ మరో ఘనత సాధించింది. విండీస్‌పై భారత్‌ వరుసగా తొమ్మిది విజయాలను నమోదు చేసింది. 
  • వన్డేల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను కోల్పోయినప్పటికీ.. అత్యధిక బంతుల తేడాతో విజయం సాధించిన రెండో జట్టుగా భారత్‌ నిలిచింది. ఈ మ్యాచ్‌లో మరో 163 బంతులు ఉండగానే టీమ్‌ఇండియా గెలిచింది. అయితే, 2013లో ఆసీస్‌పై శ్రీలంక 180 బంతులు ఉండగానే విజయం సాధించింది. 
  • విండీస్‌కు తన స్వదేశంలో అత్యల్ప స్కోరింగ్‌ చేసిన మూడో మ్యాచ్‌ ఇదే. గతంలో పాక్‌పై 98 పరుగులే (2013లో) చేయగా.. బంగ్లాదేశ్‌పై 108 పరుగులకే (2022లో) ఆలౌటైంది.
  • అతి తక్కువ ఓవర్లలోనే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయడం భారత్‌కు ఇది నాలుగో సారి. 2014లో బంగ్లాను 17.4 ఓవర్లలో, 2023లో శ్రీలంకను 22 ఓవర్లలో, మళ్లీ శ్రీలంకనే 2003లో 23 ఓవర్లలో, తాజాగా విండీస్‌ను 23 ఓవర్లలోనే భారత్‌ ఆలౌట్‌ చేసింది.
  • ఒకే మ్యాచ్‌లో ఇద్దరు లెఫ్ట్ఆర్మ్‌ బౌలర్లు 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనతను జడేజా-కుల్‌దీప్ సాధించారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి 43 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టారు. ఇందులో కుల్‌దీప్ 4/6 కాగా.. జడేజా 3/37.
  • భారత్ - విండీస్‌ జట్ల మధ్య అత్యల్ప స్కోరింగ్‌ నమోదైన రెండో మ్యాచ్‌ కూడా ఇదే. తిరువనంతపురం వేదికగా 2018లో విండీస్‌ 104 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని