Jaddu-Kuldeep: వన్డేల్లో అరుదైన ఘనత.. జడేజా-కుల్‌దీప్ తొలి జోడీగా రికార్డు!

వెస్టిండీస్‌పై మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. టీమ్‌ఇండియా బౌలర్లు విజృంభించడంతో విండీస్‌ 114 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి టార్గెట్‌ను ఛేదించింది.

Updated : 28 Jul 2023 13:03 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో (WI vs IND) భారత స్పిన్‌ ద్వయం కుల్‌దీప్‌ యాదవ్ (Kuldeep Yadav), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అదరగొట్టారు. వీరిద్దరూ కలిసి ఏడు  వికెట్లు తీశారు. జడేజా ఆరు ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. కుల్‌దీప్‌ మూడు ఓవర్లలో ఆరే పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో జడేజా-కుల్‌దీప్‌ ద్వయం అరుదైన ఘనత సాధించింది. ఇద్దరు లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు ఒకే మ్యాచ్‌లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లుగా జడేజా-కుల్‌దీప్ అవతరించారు. ఈ మేరకు బీసీసీఐ కూడా ట్వీట్ చేసింది. వీరిద్దరితోపాటు భారత పేసర్లూ రాణించడంతో విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 118 పరుగులు చేసి విజయం సాధించింది.

స్పిన్నర్ల మాయ.. ఇషాన్‌ దూకుడు.. తొలి వన్డేలో ఆసక్తికర వీడియోలు మీ కోసం!

ఈ ఘనతపై కుల్‌దీప్ మాట్లాడుతూ.. ‘‘విండీస్‌ పిచ్‌లు సీమర్లకు అనుకూలంగా ఉంటాయి. అలాంటి మైదానంలో మేమిద్దరం ఏడు వికెట్లు పడగొట్టడం ఆనందంగా ఉంది. బౌన్స్‌తోపాటు బంతి తిరగడం మాకు కలిసొచ్చింది. నేను నా రిథమ్‌ మీద దృష్టిపెట్టి సాధన చేశా. సరైన ప్రాంతంలో సంధించడం వల్ల వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్‌లో చాహల్‌ బరిలోకి దిగకపోయినా అతడు ఇచ్చిన సలహాలు ఉపయోగపడ్డాయి. పేసర్లు ముకేశ్‌ కుమార్‌, శార్దూల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఆ తర్వాత జడేజాతో కలిసి నేను విండీస్‌ పతనంలో కీలక పాత్ర పోషించడం బాగుంది. పరిస్థితికి తగ్గట్టుగా గూగ్లీలను సంధించి వికెట్లను రాబట్టా. ఎడమచేతి వాటం బ్యాటర్‌ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు అతడికి దూరంగా బంతులను వేయడానికి ప్రయత్నించి సఫలమయ్యా’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని