Sanju Samson: నన్నంతా దురదృష్టకర క్రికెటర్ అంటుంటారు.. కానీ, రోహిత్ మద్దతు అద్భుతం: సంజూ

ఈ టీమ్ఇండియా (Team India) ఆటగాడు జట్టులో కంటే పక్కన కూర్చోవడమే ఎక్కువగా జరుగుతుంటుంది. ఐపీఎల్‌లో మాత్రం అదరగొట్టేస్తూ భారీగా పరుగులు చేస్తుంటాడు.

Published : 25 Nov 2023 14:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం రాలేదు. అంతకుముందు ఆసియా కప్‌లోనూ స్టాండ్‌బై ఆటగాడిగానే ఎంపికయ్యాడు. తాజాగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌లోనైనా చోటు దక్కించుకున్నాడా? అంటే అదీ లేదు. దీంతో క్రికెట్‌ అభిమానులు ఆ ఆటగాడిని దురదృష్టకర క్రికెట్‌గా పిలుస్తుంటారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. అతడే సంజూ శాంసన్‌ (Sanju Samson). టాలెంట్‌ ఉన్నా నిలకడలేనితనమే అతడికి జట్టులో స్థానం దక్కకుండా చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజూ శాంసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఐయామ్ విత్ ధన్య వర్మ’ యూట్యూబ్‌ ఛానెల్‌లో సంజూ మాట్లాడాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తనకు ఇచ్చిన మద్దతుపైనా స్పందించాడు. 

‘‘ఐపీఎల్‌లో (IPL) అద్భుత ప్రదర్శన ఇచ్చిన తర్వాత రోహిత్ శర్మ నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. ‘నువ్వు ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడావు. మరీ ముఖ్యంగా ముంబయి ఇండియన్స్‌పై భారీ సిక్స్‌లు కొట్టావు. నిజంగా నీ బ్యాటింగ్‌ సూపర్బ్‌’ అని చెప్పాడు. ఆ మాటలు నాకెంతో ఉపశమనంగా అనిపించాయి. గొప్ప మద్దతు లభించినట్లు భావించా. ఇక చాలా మంది క్రికెట్ అభిమానులు నన్ను దురదృష్టకర క్రికెటర్‌గా అభివర్ణిస్తుంటారు. కానీ, నేను ఇప్పుడు ఏ స్థాయికి చేరానంటే.. అనుకున్న దానికంటే ఎక్కువే సాధించానని నమ్మకంగా చెప్పగలను’’ అని సంజూ శాంసన్‌ తెలిపాడు. 

కేరళకు చెందిన సంజూ శాంసన్‌ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. 24 టీ20ల్లో 374 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 12 ఇన్నింగ్స్‌ల్లోనే 390 పరుగులు సాధించాడు. కానీ, ఇదంతా కెరీర్‌ ప్రారంభంలోనే సాధించాడు. ఆ తర్వాత అడపాదడపా అవకాశాలు వచ్చినా నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు ఐపీఎల్‌లో 152 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్‌ 3,888 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జాతీయ జట్టులో ఎక్కువగా అవకాశాలు కల్పించకుండానే సంజూను పక్కనపెట్టేయడంపై నెట్టింట కామెంట్లు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని