Shami: అప్పుడు తిండి కూడా సహించలేదు.. మోదీ వచ్చాకే మేం మాట్లాడుకున్నాం : షమీ

వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ (ODI World Cup 2023)లో ఓటమి తర్వాత భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఆటగాడితో సంభాషించారు. ఓటమి బాధను వీడి ముందుకు సాగాలని ధైర్యం చెప్పారు. 

Updated : 14 Dec 2023 12:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో (ODI World Cup 2023) ఓటమితో యావత్ భారతావని నిరుత్సాహానికి గురైన సంగతి తెలిసిందే. ఇక ఆటగాళ్ల పరిస్థితి మాటల్లో చెప్పలేం. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి వారిని పరామర్శించి.. ధైర్యం చెప్పడం మాత్రం ప్రతి భారతీయుడిలోనూ స్ఫూర్తి నింపింది. క్రికెటర్లు కూడా ప్రధాని మాటలు తమకు ఎంతో ప్రేరణగా నిలిచాయని వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్ మహమ్మద్ షమీ (Shami) అప్పటి సంగతులను మరోసారి గుర్తు చేసుకున్నాడు. షమీని అప్యాయంగా కౌగిలించుకుని ప్రధాని ధైర్యం చెప్పిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మోదీ (PM Modi) రాక తమను ఆశ్చర్యానికి గురి చేసిందని షమీ తాజాగా వ్యాఖ్యానించాడు. 

‘‘ఓటమి బాధతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో అలానే కూర్చుండిపోయాం. దాదాపు రెండు నెలలపాటు పడిన శ్రమ ఒక్క మ్యాచ్‌ ఫలితంతో నిరుపయోగంగా మారింది. ఆ రోజు మాకు కలిసిరాలేదు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి రావడంతో మేమంతా ఆశ్చర్యపోయాం. ఒక్కసారిగా తలెత్తి ఆయనను చూశాం. అసలు మోదీ అక్కడికి వస్తారన్న సమాచారం కూడా మాకు లేదు. అసలు ఆ సమయంలో మేం ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేము. అలాగే తిండి కూడా తినాలనిపించలేదు. కానీ, ప్రధాని మోదీని డ్రెస్సింగ్‌ రూమ్‌లో చూసి ఆశ్చర్యంతోపాటు ఆనందం కలిగింది. ఆయన మా దగ్గరకు వచ్చి ఒక్కొక్కరితో మాట్లాడారు. బాగా ఆడారని ధైర్యం చెప్పారు. ఆ తర్వాత నుంచే ఆటగాళ్లు ఒకరితో మరొకరం మాట్లాడుకున్నాం. మనం ఈ ఓటమి బాధను తట్టుకుని ముందుకు సాగాలని భావించాం. ప్రధాని మోదీ పరామర్శ మాకు ఉపయోగపడింది’’ అని షమీ తెలిపాడు.

ఇండియన్‌ అని గర్వంగా చెబుతా

వరల్డ్‌ కప్‌లో ఐదు వికెట్లు సాధించిన ప్రతిసారీ మైదానంలో మోకాళ్లపై కూర్చుని షమీ సంబరాలు చేసుకున్నాడు. దానిని కూడా పాక్‌కు చెందిన కొంతమంది అభిమానులు వక్రీకరిస్తూ ట్వీట్లు చేశారు. షమీ ప్రార్థన చేయాలని అనుకున్నాడని.. కాకపోతే భారత్‌లో అలా చేసేందుకు భయపడ్డాడని పోస్టులు పెట్టారు. దీనినే తాజా ఇంటర్వ్యూలో షమీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అతడు సూటిగా స్పందించాడు.

‘‘ఎవరైనా ప్రార్థన చేయాలనుకుంటే ఎవరు ఆపుతారు? నేను ఎవరినీ ఆపను. అలాగే నన్ను కూడా ఎవరూ ఆపరు. నేను చేయాలనుకుంటే ప్రార్థన చేస్తా. ఇందులో సమస్య ఎక్కడుంది? నేను ఇప్పటికీ సగర్వంగా చెబుతా. నేను భారతీయుడిని. నేను ముస్లిం అని. నాకు ఇలాంటి సమస్యే ఎదురైతే..? భారత్‌లో ఇన్నేళ్లు ఉండలేను కదా. నేను ఎవరి అనుమతినైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఉండటం ఎందుకు? సోషల్ మీడియాల్లో చాలా కామెంట్లు చూశా. గతంలోనూ నేను ఐదు వికెట్లు సాధించిన సందర్భాలున్నాయి. కానీ, ఎక్కడైనా ప్రార్థన చేశానా? కొందరు కావాలనే వివాదాలు సృష్టించడానికే ఇలాంటి కామెంట్లు చేస్తారు. వీళ్లెవరూ మీతో కానీ, నాతో కానీ ఉండరు. ఎవరినీ ప్రేమించరు. వారికి కావాల్సింది ఇలాంటి కంటెంట్‌ మాత్రమే. బౌలింగ్‌లో నా శ్రమకు ఫలితం వచ్చినప్పుడు అలా మోకాళ్లపై కూర్చుంటా. బౌలింగ్‌ కోసం చాలా కష్టపడటం వల్ల అలసిపోతా. అంతేకానీ, కొందరు అనుకున్నట్లుగా అక్కడేమీ ఉండదు’’ అని షమీ స్పష్టం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని