WI vs IND: చాహల్ ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: శార్దూల్

మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ను విండీస్‌తో వన్డే సిరీస్‌లో (WI vs IND) ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

Published : 03 Aug 2023 17:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో మూడు వన్డేల (WI vs IND) సిరీస్‌ను టీమ్‌ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుని యువకులకు అవకాశం ఇచ్చారు. అయితే యుజ్వేంద్ర చాహల్‌కు ఒక్క అవకాశం కూడా రాలేదు. అతడి స్థానంలో కుల్‌దీప్‌ యాదవ్‌ను స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఆడించింది. మొత్తం 16 మందిలో 15 మందికి ఆడే అవకాశం దక్కింది. కొత్తగా వచ్చిన ముకేశ్‌ కుమార్‌తోపాటు సీనియర్‌ పేసర్ జయ్‌దేవ్‌నూ బరిలోకి దింపింది. కానీ, చాహల్‌ను మాత్రం పక్కన పెట్టేయడంతో అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్పందించాడు. మణికట్టు మాంత్రికుడు చాహల్‌ ప్రత్యేకంగా నిరూపించుకోవడానికి ఏం లేదని, ఇలాంటి వాటి గురించి ఆలోచించడని శార్దూల్ వ్యాఖ్యానించాడు. 

భారత క్రికెట్ అభిమానులకు నా విజ్ఞప్తి అదొక్కటే: అశ్విన్‌

‘‘చాహల్‌ అద్భుతమైన ప్లేయర్. కొన్నేళ్లుగా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడు. కాబట్టి కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అయితే, అతడు ఆడాలా..? వద్దా...? అనేది మేనేజ్‌మెంట్ ఇష్టం. ఎప్పుడు అవకాశం వచ్చినా నాణ్యమైన ప్రదర్శన ఇవ్వడానికి చాహల్‌ సిద్ధంగా ఉంటాడు. ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు తీయగల సత్తాగల బౌలర్. కాబట్టి, ఏదో ఒక సిరీస్‌ ఆడనంత మాత్రాన నిరుత్సాహానికి గురవుతాడని నేను అనుకోవడం లేదు’’ అని శార్దూల్ తెలిపాడు. 

శార్దూల్‌ నిలకడైన బౌలర్‌: చోప్రా

‘‘వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో శార్దూల్‌ ఠాకూర్ బౌలింగ్‌ను అభినందించకుండా ఉండలేం. భారత్‌ తరఫున 2019 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు (50) తీసిన బౌలర్‌ కూడా శార్దూల్‌ కావడం విశేషం. బుమ్రా, షమీ, సిరాజ్‌ తర్వాత నాలుగో ఫాస్ట్‌ బౌలర్‌ ఎవరనేది ఇక్కడ ప్రశ్న. తప్పకుండా శార్దూల్‌ ఠాకూర్‌ అవుతాడు. ఉమ్రాన్ మాలిక్‌ గొప్పగా రాణించలేకపోతున్నాడు. అందుకే శార్దూల్‌ తర్వాతనే ఉమ్రాన్‌ ఉంటాడు. వన్డే ప్రపంచ కప్‌లో శార్దూల్‌ ఆడటం వల్ల రెండు విధాలుగా భారత్‌కు లాభిస్తుంది. బ్యాటింగ్‌ కూడా చేయగల సత్తా ఉన్న శార్దూల్‌కు చోటు ఇవ్వడం అవసరం’’ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని