ODI World Cup 2023: భారత క్రికెట్ అభిమానులకు నా విజ్ఞప్తి అదొక్కటే: అశ్విన్‌

స్వదేశంలో వన్డే వరల్డ్‌ కప్‌ (ODi World Cup 2023) జరగనుడటంతో భారత్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎలాగైనా ఛాంపియన్‌గా నిలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించేలా ఆడాలని అభిమానులు కోరుతున్నారు.

Published : 03 Aug 2023 11:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దాదాపు పదేళ్ల నుంచి కళ్లు కాయలు కాచేలా ఐసీసీ ట్రోఫీ కోసం టీమ్‌ఇండియా (Team India) ఎదురు చూస్తోంది. ఇప్పుడు స్వదేశంలోనే వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) మెగా టోర్నీ జరగనుంది. ఈసారైనా ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించాలని అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో భారత సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) అభిమానులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు. సానుకూల దృక్పథంతో క్రికెట్ జట్టుకు మద్దతుగా నిలవాలని కోరాడు.

‘‘గెలిచి వస్తే అభినందనలు చెబుదాం. ఒకవేళ కప్‌తో రాకపోయినా మద్దతుగా నిలుద్దాం. సానుకూల దృక్పథంతో జట్టుకు అండగా నిలవాలని అభిమానులను కోరుతున్నా. వన్డే ప్రపంచకప్‌ను గెలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఏదో ఒక ఆటగాడిని తీసుకుంటేనో.. లేకపోతే మరో ఆటగాడిని పక్కన పెడితేనో విజయం సాధించం. అందరూ సమష్టిగా ఆడితేనే గెలుస్తాం. ఒకవేళ మ్యాచ్‌ ఓడిపోతే అక్కడితో ఆగిపోం. ముందుకు సాగిపోవాలి. అంతేకానీ, అతడిని జట్టులోకి తీసుకొంటే గెలిచి ఉండేవాళ్లమనే వ్యాఖ్యలు సరికావు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇలా చేస్తే బాగుండేది.. అలా జరిగితే జట్టుకు ప్రయోజనం అనే మాటలు ఇక్కడ పనికిరావు. వచ్చే ప్రపంచకప్‌లోనూ భారత్‌ విజయం సాధించాలని మాత్రమే కోరుకుందాం. ఎందుకంటే గత మెగా టోర్నీల్లో సెమీస్‌ వరకు చేరిన రికార్డు భారత్‌ సొంతం’’ అని అశ్విన్‌ తెలిపాడు. 

బుమ్రా ఆడకపోతే.. గతేడాది ఫలితమే పునరావృతం: కైఫ్‌

భారత్ 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచిన తర్వాత జరిగిన మెగా టోర్నీల్లో విజేతగా నిలవలేదు. అయితే, ఎక్కువ టోర్నీల్లో సెమీస్‌ వరకు చేరింది. 2014 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కూ చేరినా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ఇక 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ల్లో సెమీస్‌, ఆ తర్వాత 2016, 2022 టీ20 ప్రపంచకప్‌ల్లోనూ సెమీస్‌కు చేరింది. అలాగే 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని