Published : 20 Jan 2022 04:34 IST

India vs South Africa: పట్టు వదిలారు..

తొలి వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి

అవకాశాలు వృథా చేసిన భారత్‌

వాండర్‌డసెన్‌, బవుమా శతకాలు

బంతితో బాగానే మొదలెట్టింది.. బ్యాటుతోనూ బలంగానే ఆరంభించింది. కానీ అస్థిరమైన ఆటతో గతి తప్పింది. టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమ్‌ఇండియాకు వన్డే పోరులో పేలవ ఆరంభం. పైచేయిలో నిలిచినా.. చక్కని అవకాశాలను చేజార్చుకున్న భారత్‌.. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంపాలైంది. వాండర్‌డసెన్‌, బవుమా సూపర్‌ శతకాలతో సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఘనంగా బోణీ కొట్టింది.

పార్ల్‌

టీమ్‌ఇండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన దక్షిణాఫ్రికా తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. వాండర్‌డసెన్‌ (129 నాటౌట్‌; 96 బంతుల్లో 9×4, 4×6), బవుమా (110; 143 బంతుల్లో 8×4) గొప్ప పోరాటంతో శతకాలు చేయడంతో మొదట దక్షిణాఫ్రికా 4 వికెట్లకు 296 పరుగులు చేసింది. బుమ్రా (2/48) బంతితో రాణించాడు. రాహుల్‌ నాయకత్వంలోని భారత్‌.. ఛేదనలో తడబడింది. శిఖర్‌ ధావన్‌ (79; 84 బంతుల్లో 10×4), కోహ్లి (51; 63 బంతుల్లో 3×4) రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో 8 వికెట్లకు 265 పరుగులే చేయగలిగింది. ఎంగిడి (2/64), షంసి (2/52), ఫెలుక్వాయో (2/26) భారత్‌ను దెబ్బతీశారు. వాండర్‌డసెన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. రెండో వన్డే శుక్రవారం జరుగుతుంది.

138/1 నుంచి.: టీమ్‌ఇండియా బౌలింగ్‌లోలాగే బ్యాటింగ్‌లోనూ బలమైన స్థితిలో నిలిచి దెబ్బతింది. సాఫీగా లక్ష్యం దిశగా సాగుతూ అనూహ్యంగా గతి తప్పింది. లక్ష్యం పెద్దదే అయినా, రాహుల్‌ (12) తక్కువ స్కోరుకే ఔటైనా.. ఛేదనలో భారత్‌కు బలమైన పునాదే పడింది. కారణం ఓపెనర్‌ ధావన్‌, కోహ్లి. జట్టులో స్థానం నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్‌లో రాణించడం ఎంతో కీలకమైన నేపథ్యంలో 36 ఏళ్ల ధావన్‌ చక్కని ఇన్నింగ్స్‌ ఆడాడు. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన అతడు దూకుడు ప్రదర్శించాడు. చకచకా బౌండరీలు బాదాడు. 8 ఓవర్లకు స్కోరు 44 కాగా.. అందులో ధావన్‌ చేసినవే 33. తర్వాతి ఓవర్లోనే రాహుల్‌ నిష్క్రమించినా.. ధావన్‌, కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించారు. మాజీ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన కోహ్లి సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. మార్‌క్రమ్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌లెగ్‌లో అలవోకగా ఫోర్‌ కొట్టడం ద్వారా పరుగుల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత ఎక్కువగా సింగిల్స్‌ తీశాడు. ధావన్‌ మాత్రం దూకుడు కొనసాగించాడు. వీలైనప్పుడల్లా ఫోర్లు కొట్టాడు. భారత్‌ 25 ఓవర్లలో 138/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ 92 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడడంతో మ్యాచ్‌ గమనమే మారిపోయింది. భారత్‌ వేగంగా మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యం టీమ్‌ఇండియా కొంప ముంచింది. జోరుమీదున్న ధావన్‌ను కేశవ్‌ బౌల్డ్‌ చేయడం, కాసేపటి తర్వాత కోహ్లి కూడా ఔట్‌ కావడంతో దక్షిణాఫ్రికా పోటీలోకి వచ్చింది. 60 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. శాంసి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. పంత్‌ (16), శ్రేయస్‌ అయ్యర్‌ (17) కాస్త నిలవడంతో భారత్‌ 181/3తో  కుదురుకుంటున్ననిపించింది.. కానీ 7 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్లు టీమ్‌ఇండియాను కోలుకోలేని దెబ్బతీశారు. ఎంగిడి వరుస ఓవర్లలో శ్రేయస్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ (2)ను ఔట్‌ చేయగా.. మధ్యలో పంత్‌ను ఫెలుక్వాయో వెనక్కి పంపాడు. 36 ఓవర్లలో 188/6కు చేరుకున్న భారత్‌ ఓటమి బాటలో పయనించింది. టెయిలెండర్లేమీ అద్భుతాలు చేయలేదు. శార్దూల్‌ (50 నాటౌట్‌; 43 బంతుల్లో 5×4, 1×6) బ్యాట్‌ ఝుళిపించినా.. అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి ఉపయోగపడిందంతే. బుమ్రా (14 నాటౌట్)తో అభేద్యమైన 9వ వికెట్‌కు అతడు.. 51 పరుగులు జోడించాడు.

ఆ ఇద్దరు అదరహో..: నిజానికి దక్షిణాఫ్రికా అంత పెద్ద స్కోరు చేయాల్సిందే కాదు. ఆరంభంలో త్వరగా మూడు వికెట్లు పడగొట్టి, ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసేలా కనిపించిన భారత్‌.. మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. పట్టు సడలించి ప్రత్యర్థికి పుంజుకునే అవకాశమిచ్చింది. ఓ దశలో 18 ఓవర్లలో 70/3తో ఇబ్బంది పడ్డ దక్షిణాఫ్రికా.. వాండర్‌డసెన్‌, బవుమాలా అద్భుత భాగస్వామ్యంతో టీమ్‌ఇండియాకు గట్టి లక్ష్యాన్ని నిర్దేశించింది. చాలా సాధారణంగా కనిపించిన భారత బౌలింగ్‌లో బుమ్రా ఒక్కడే ఆకట్టుకున్నాడు. మందకొడి పిచ్‌పై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. పరుగుల కోసం ఇబ్బంది పడింది. బుమ్రా, భువి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 8 ఓవర్లలో 31/1తో నిలిచింది. అయిదో ఓవర్లో ఓ ఔట్‌స్వింగర్‌తో జానెమన్‌ మలన్‌ (6)ను ఔట్‌ చేయడం ద్వారా దక్షిణాఫ్రికాను బుమ్రా తొలి దెబ్బ తీశాడు. డికాక్‌, బవుమా వెంటనే మరో వికెట్‌ పడనివ్వలేదు కానీ.. పరుగులు చేయడం వారికి కష్టమైంది. 15 ఓవర్లకు స్కోరు 58/1. అయితే డికాక్‌ (27)ను అశ్విన్‌ బౌల్డ్‌ చేయడం, మార్‌క్రమ్‌ (4) రనౌట్‌ కావడంతో దక్షిణాఫ్రికా చిక్కుల్లో పడింది. ఆ జట్టు కనీసం 200 దాటడం కూడా కష్టమే అనిపించింది. కానీ పోరాటపటిమను ప్రదర్శించిన డసెన్‌, బవుమా అదిరే భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ గమనాన్ని మార్చేశారు. వాండర్‌డసెన్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేయగా.. బవుమా జాగ్రత్తగా ఆడాడు. మధ్య ఓవర్లలో భారత బౌలర్ల బౌలింగ్‌ పేలవం. ముఖ్యంగా వాండర్‌ డసెన్‌ ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు వేగాన్ని పెంచాడు. బవుమా 45వ ఓవర్లో, వాండర్‌డసెన్‌ 48వ ఓవర్లో శతకాలు పూర్తి చేశారు. 49వ ఓవర్లో బవుమాను బుమ్రా వెనక్కి పంపడంతో 204 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ (0/72) ధారాళంగా పరుగులిచ్చాడు.


సచిన్‌ను దాటిన కోహ్లి

స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి విదేశీ గడ్డపై అత్యధిక వన్డే పరుగులు (5108) చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతడు.. సచిన్‌ (5065)ను అధిగమించాడు.


దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) అశ్విన్‌ 27; జానెమన్‌ మలన్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 6; బవుమా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 110; మార్‌క్రమ్‌ రనౌట్‌ 4; వాండర్‌డసెన్‌ నాటౌట్‌ 129; మిల్లర్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 18 మొత్తం: (50 ఓవర్లలో) 296/4
వికెట్ల పతనం: 1-19, 2-58, 3-68, 4-272 బౌలింగ్‌: బుమ్రా 10-0-48-2; భువనేశ్వర్‌ 10-0-64-0; శార్దూల్‌ 10-1-72-0; అశ్విన్‌ 10-0-53-1; చాహల్‌ 10-0-53-0

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) డికాక్‌ (బి) మార్‌క్రమ్‌ 12; ధావన్‌ (బి) కేశవ్‌ 79; కోహ్లి (సి) బవుమా (బి) షంసి 51; పంత్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) ఫెలుక్వాయో 16; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) డికాక్‌ (బి) ఎంగిడి 17; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) డసెన్‌ (బి) ఎంగిడి 2; అశ్విన్‌ (బి) ఫెలుక్వాయో 7; శార్దూల్‌ ఠాకూర్‌ నాటౌట్‌ 50; భువనేశ్వర్‌ (సి) బవుమా (బి) షంసి 9; బుమ్రా నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (50 ఓవర్లలో) 265/8

వికెట్ల పతనం: 1-46, 2-138, 3-152, 4-181, 5-182, 6-188, 7-199, 8-214; బౌలింగ్‌: మార్‌క్రమ్‌ 6-0-30-1; జాన్సన్‌ 9-0-49-0; కేశవ్‌ మహరాజ్‌ 10-0-42-1; ఎంగిడి 10-0-64-2; షంసి 10-1-52-2; ఫెలుక్వాయో 5-0-26-2

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని