Prajwal Revanna: ‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్‌ మాజీ డ్రైవర్‌

ప్రజ్వల్‌పై ఆరోపణలకు సంబంధించిన వీడియోలను ఎవరు లీక్‌ చేశారనే చర్చ నడుస్తోన్న నేపథ్యంలో ప్రజ్వల్‌ మాజీ డ్రైవర్‌ కార్తిక్‌, భాజపా నేత దేవరాజేగౌడలు.. నువ్వంటే నువ్వే లీక్‌ చేశావని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

Published : 30 Apr 2024 19:37 IST

బెంగళూరు: మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించినట్లు చెబుతోన్న అభ్యంతరకర వీడియోలు వైరల్‌గా మారడం కన్నడ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ప్రజ్వల్‌పై జేడీఎస్‌ ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు వేయగా.. అసలు ఎవరు ఈ వీడియోలను లీక్‌ చేశారనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణ మాజీ డ్రైవర్‌ కార్తిక్‌, భాజపా నేత దేవరాజే గౌడల పేర్లు తెరపైకి వచ్చాయి. వాటిని నువ్వంటే నువ్వే లీక్‌ చేశావని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం గమనార్హం.

ప్రజ్వల్‌ రేవణ్ణ వద్ద 15 ఏళ్లపాటు డ్రైవర్‌గా పని చేసినట్లు కార్తిక్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. ఓ ఏడాది నుంచి ప్రజ్వల్‌ దగ్గర ఉండటం లేదన్న ఆయన.. తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా భూమిని లాక్కున్నారు. నా భార్యపై చేయిచేసుకున్నారు. నన్ను మానసికంగా వేధించారు. అందుకే అక్కడినుంచి బయటకు వచ్చి నా భూమి కోసం పోరాటం చేస్తున్నా’’ అని అందులో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని కోరుతూ దేవేగౌడ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దేవరాజే గౌడ వద్దకు వెళ్లానని అన్నాడు.

హాసన సెక్స్‌ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే

‘‘2023 అసెంబ్లీ ఎన్నికల్లో హోళెనరసీపుర స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేసిన దేవరాజే గౌడ.. రేవణ్ణ చేతిలో ఓడిపోయారు. ఇదే సమయంలో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు నేను విడుదల చేయకుండా ప్రజ్వల్‌ స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నారు. అయితే, వాటిని తనకు అప్పగిస్తే న్యాయస్థానానికి ఇచ్చి స్టే ఆర్డర్‌ ఎత్తివేయిస్తానని దేవరాజే గౌడ హామీ ఇచ్చారు. ఆయనపై నమ్మకం ఉంచి వాటిని ఇచ్చేశాను. అయినా నన్ను మోసం చేశాడు’’ అని కార్తిక్‌ ఆరోపించాడు. దేవరాజేకు మినహా కాంగ్రెస్‌ నేతలకు, ఇతరులకు ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ నేతలందరూ ప్రజ్వల్‌కు సన్నిహితులేనని తెలిపారు. భాజపా, జేడీఎస్‌ కూటమి ఏర్పాటుకాకముందే.. ప్రజ్వల్‌ ప్రవర్తన విషయాన్ని దేవరాజే భాజపా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాడని కార్తిక్ చెప్పాడు.

అది వారి పనే : దేవరాజే

కార్తిక్‌ చేసిన ఆరోపణలను దేవరాజే గౌడ తోసిపుచ్చారు. కాంగ్రెస్‌ నేత, హసన లోక్‌సభ అభ్యర్థి శ్రేయస్‌ పాటిల్‌తో కార్తిక్‌ తిరుగుతున్నాడని చెప్పాడు. జేడీఎస్‌, భాజపా నేతలెవరూ ఆ వీడియోలు విడుదల చేయలేదని అన్నారు. వీటివల్ల కేవలం కాంగ్రెస్‌ పార్టీనే లబ్ధి పొందుతుందని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే శ్రేయస్‌ పాటిల్‌ ఈ చర్యలకు పాల్పడిఉంటారని ఆరోపించారు. సిట్‌ నోటీసుల కోసం వేచిచూస్తున్నానని.. వారికి తనదగ్గరున్న ఆధారాలు అప్పగిస్తానని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు