జెఫ్‌ బెజోస్‌ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్‌ఫ్లిక్స్‌ ఛైర్మన్‌

నెట్‌ఫ్లిక్స్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్‌ రిస్క్‌ తీసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. జెఫ్‌ బెజోస్‌ నుంచి నేర్చుకున్న విలువైన పాఠం గురించి తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు.

Published : 01 May 2024 00:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వ్యాపార రంగంలో దూసుకెళ్లడమంటే అంత సులువైన విషయం కాదు. ఎప్పటికప్పుడు సవాళ్లను స్వీకరిస్తూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లాలి. పోటీని తట్టుకొని, సమస్యల్ని పరిష్కరించుకుంటూ సామ్రాజ్యాన్ని నడిపించాలి. ఇలా కష్టాల్ని ఎదుర్కొని సంస్థలను విజయవంతమైన మార్గంలో తీసుకెళ్లిన వారిలో నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హేస్టింగ్స్‌ (Reed Hastings) కూడా ఒకరు. ఈ విషయంలో అమెజాన్‌ (Amazon) వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) నుంచి విలువైన పాఠం నేర్చుకున్నారట.

తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న హేస్టింగ్స్‌.. జెఫ్‌ బెజోస్‌ నుంచి గొప్ప బిజినెస్‌ ఫిలాసఫీని నేర్చుకున్నట్లు తెలిపారు. ఏదైనా విషయంలో రిస్క్ తీసుకోవడానికి వెనకాడకూడదు అనే విషయం బెజోస్‌ నుంచే గ్రహించినట్లు పేర్కొన్నారు. ‘‘ఏదైనా తప్పు జరుగుతుందేమో అని ఎల్లప్పుడూ చింతిస్తూ కూర్చుంటే చివరకు ఆందోళనలోనే ఉండిపోతాం. దాని కారణంగా అవసరమైన సమయంలోనూ రిస్క్‌ చేయడానికి ముందుకురాలేం. ఈ ఆందోళన సృజనాత్మకతకు అడ్డంకిగా నిలుస్తుంది’’ అని హేస్టింగ్స్‌ అన్నారు.

ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!

బెజోస్‌ రిస్క్‌లను ‘వన్-వే డోర్స్’, ‘టూ-వే డోర్స్’గా ఎలా పరిగణిస్తారో హేస్టింగ్స్‌ పేర్కొన్నారు. ఏదైనా పని చేసినప్పుడు దానిలో సానుకూల ఫలితం రాకపోతే.. మరో మార్గంలో దాన్ని తిరిగి ప్రయత్నించే విధానమే టూ-వే డోర్స్‌. ఒక సారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్లడానికి కుదరనిదే వన్‌- వే డోర్స్‌ రిస్క్‌. వీటిలో టూ- వే డోర్‌ రిస్క్‌ తీసుకోవడం చాలా సులభం అంటూ గతంలో బెజోస్‌ చెప్పిన విషయాన్ని హేస్టింగ్స్‌ ప్రస్తావించారు. తాను కూడా వ్యాపారంలో  ఈ టూ-వే డోర్స్‌ రిస్క్‌నే పాటిస్తానన్నారు. 1997లో నెట్‌ఫ్లిక్స్‌ను ప్రారంభించిన హేస్టింగ్స్‌.. ప్రస్తుతం ఆ సంస్థకు ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని