T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌.. భారత జట్టు ఇదే

జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది.

Updated : 30 Apr 2024 16:37 IST

ఇంటర్నెట్ డెస్క్: జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. ఈ సారి టీ20 ప్రపంచకప్‌నకు యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 5న ఐర్లాండ్‌తో  ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా ఢీ కొట్టనుంది. ‘గ్రూప్‌ ఏ’లో ఉన్న భారత్‌-పాక్‌ జట్లు న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న తలపడనున్నాయి. ఈ పొట్టికప్పు సిరీస్‌లో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి. అమెరికాలో 3, వెస్టిండీస్‌లో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 29న జరగనుంది.

పంత్, చాహల్ రీ ఎంట్రీ 

రిషభ్‌ పంత్, యుజ్వేంద్ర చాహల్ ప్రపంచకప్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. పంత్‌ 2022 డిసెంబరు చివర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడి 14 నెలలపాటు ఆటకు దూరమయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్‌తో పునరాగమనం చేసిన అతడు ఇప్పుడు టీమ్‌ఇండియా తరఫున కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్‌లో పంత్‌ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా పంత్ అదరగొడుతున్నాడు. దీంతో అతడిని సెలెక్టర్లు ప్రపంచకప్‌నకు ఎంపిక చేశారు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 158.57 స్ట్రెక్‌రేట్‌తో 398 పరుగులు చేశాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉంటూ 11 క్యాచ్‌లు, 3 స్టంపింగ్‌లు చేశాడు. లెగ్ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్ చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు. ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్‌నకు సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఐపీఎల్ 2024లో చాహల్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.

వీరికి నిరాశ

ఈ ఐపీఎల్ సీజన్‌లో రాణిస్తున్నా జట్టు కూర్పులో భాగంగా కేఎల్ రాహుల్‌కు నిరాశే ఎదురైంది. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా పంత్, శాంసన్‌, కేఎల్ రాహుల్ పోటీపడ్డారు. ఈ ముగ్గురూ మంచిఫామ్‌లో ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై తర్జనభర్జన జరిగింది. చివరకు సెలెక్టర్లు పంత్, శాంసన్‌ల వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే భారత జట్టు తరఫున ఆడిన తిలక్ వర్మ, ముకేశ్‌ కుమార్‌లకు కూడా నిరాశే మిగిలింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో నిలకడగా 150 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్న మయాంక్ యాదవ్‌ను ఎంపిక చేస్తారని కథనాలు వచ్చినా సెలెక్షన్ కమిటీ ప్రయోగాలు చేయకుండా కాస్త అనుభవం ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని