- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
గెలిస్తే ఇంగ్లాండ్‌కిదే ఫస్ట్‌టైమ్
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో కరోనా కారణంగా వాయిదాపడిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం వైపు దూసుకెళ్తోంది. 378 పరుగుల లక్ష్య ఛేదనలో ఇప్పటికే 259/3 స్కోరు చేసిన ఇంగ్లాండ్ ఆఖరి రోజు మరో 119 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఒక వేళ ఇంగ్లాండ్ విజయం సాధిస్తే ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమవుతుంది. మన బౌలర్లు విజృంభించి వికెట్లు పడగొడితే భారత్ 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల ఛేదన చేసిన టాప్-4 మ్యాచ్‌లేవి..? ఇంగ్లాండ్ ఛేదించిన భారీ లక్ష్యమెంత..?
విండీస్‌దే రికార్డు
(ఫొటో సోర్స్: విండీస్ క్రికెట్ ట్విటర్)
ఐదు రోజులపాటు సాగే టెస్టు మ్యాచ్ ఎన్నో మలుపులు తిరుగుతుంది. మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోవడానికి ఒకటీ రెండు సెషన్లు చాలు.. అందుకే ప్రతి వికెట్టూ విలువైందే. ఇప్పటి వరకు ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన వెస్టిండీస్ పేరిట ఉంది. 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విండీస్ 418 పరుగులను ఛేదించేసింది. ఆ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ కూడా తన తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులే చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జస్టిన్ లాంగర్ (111), మ్యాథ్యూ హేడెన్ (177) శతకాలు చేయడంతో ఆసీస్ 417 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్ 75 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. అయితే రామ్‌నరేశ్ శర్వాన్ (105), శివనారాయణ్ చంద్రపాల్ (104) సెంచరీలతోపాటు బ్రియాన్ లారా (60) అర్ధశతకం సాధించడంతో ఏడు వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి విజయం సాధించింది.
మళ్లీ ఆసీస్‌కే ఝలక్..
(ఫొటో సోర్స్: దక్షిణాఫ్రికా క్రికెట్ ట్విటర్)
మరోసారి ఆస్ట్రేలియాకే ఝలక్ తగిలింది. ఈసారి దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమీ స్మిత్, ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 2008లో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 375 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికాను 281 పరుగులకే కుప్పకూల్చి 94 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా 319 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో 414 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను గ్రేమీ స్మిత్ (108), ఏబీ డివిలియర్స్ (106*), జేపీ డుమినీ (50*), కల్లిస్ (57) గెలిపించారు. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి దక్షిణాఫ్రికా సంచలనం సృష్టించింది.
తొలుత కంగారూలదే రికార్డు..
(ఫొటో సోర్స్: ఆసీస్ క్రికెట్ ట్విటర్)
దాదాపు 55 ఏళ్లపాటు ఆస్ట్రేలియాదే ఈ ఘనత. క్రికెట్ దిగ్గజం బ్రాడ్‌మన్ హవా కొనసాగుతున్న వేళ 1948లో ఇంగ్లాండ్‌పై ఆసీస్ 404 పరుగులను ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అన్నీ భారీ ఇన్నింగ్స్‌లే కావడం విశేషం. తొలుత సిరిల్ వాష్‌బ్రూక్ (143), బిల్ ఎడ్రిచ్ (111), సర్ లియోనార్డ్ హట్టన్ (81), సర్ అలెక్ బెడ్సర్ (79) రాణించడంతో ఇంగ్లాండ్ 496 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ కూడానూ ధీటుగానే బదులిచ్చింది. నీల్ హార్వే (112) శతకం.. సామ్ లక్స్‌టన్ (93), రే లిండ్‌వాల్ (73) కీల్ మిల్లర్ (58) అర్ధశతకాలు చేయడంతో 458 పరుగులకు ఆలౌటైంది. సర్ డాన్ బ్రాడ్‌మన్ (33) తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక 38 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 365/8 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. 404 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ను ఆర్థూర్ మోరిస్ (182), సర్ డాన్ బ్రాడ్‌మన్ (173*) అద్భుత ఇన్నింగ్స్‌లతో విజయతీరాలకు చేర్చారు. కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి భారీ ఛేదనను పూర్తి చేయడం విశేషం.
భారత్ కూడా ధాటిగానే..
1976లో విండీస్‌పైనే భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. హోల్డింగ్స్, బెర్నాడ్, క్లైవ్ లాయిడ్ వంటి బౌలర్లను ఎదుర్కొని మరీ గెలవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విండీస్ 359 పరుగులు చేయగా.. భారత్ 228 పరుగులకే ఆలౌటైంది. దీంతో 131 పరుగుల ఆధిక్యం సాధించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 271/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 406 పరుగులు చేసి విజయం సాధించింది. సునీల్ గావస్కర్ (102), గుండప్ప విశ్వనాథ్ (112) శతకాలు సాధించడంతో టీమ్‌ఇండియా సులువుగా గెలుపొందింది.
ఇంగ్లాండ్‌కు ఇదే భారీ ఛేదన..
(ఫొటో సోర్స్: ఐసీసీ ట్విటర్)
ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 378 పరుగులను ఛేదిస్తే మాత్రం ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి భారీ లక్ష్య ఛేదన అవుతుంది. ఓవరాల్‌గా ఎనిమిదో ఛేదనగా మారే అవకాశం ఉంది. ఇంతకుముందు ఇంగ్లాండ్ ఆసీస్‌పై 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా 2019లో లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే ఆలౌటైంది. అయితే ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 67 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటై ఇంగ్లాండ్ ఎదుట 359 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ ఆట చూశాక ఇంగ్లాండ్ ఓటమి ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు. అందుకు తగ్గట్టుగానే 15 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. కానీ జో రూట్ (77), జో డెన్లే (50) కుదురుకుని 126 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్‌కు చేరడంతో మళ్లీ ఇంగ్లాండ్ శిబిరంలో ఆందోళన రేగింది. ఒక పక్క బెన్ స్టోక్స్ (135*) క్రీజ్‌లో పాతుకుపోయినప్పటికీ.. ఒక్కొక్క బ్యాటర్ ఔట్ కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అయితే చివరికి జాక్ లీచ్ (1*: 17 బంతుల్లో) సాయంతో బెన్‌స్టోక్స్ అద్భుత శతకం సాధించి ఇంగ్లాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇప్పుడు భారత్‌తో జరుగుతున్న టెస్టులో బెన్‌స్టోక్స్ ఇంకా బ్యాటింగ్‌కు రాలేదు. ఇప్పటికే క్రీజ్‌లో రూట్ (76*), బెయిర్‌స్టో (72*) ఉన్నారు. ఈ క్రమంలో వీరిని దాటుకొని విజయం సాధించడం భారత్‌కు అంత సులువేం కాదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
-
World News
China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
-
General News
Urine test: మూత్ర పరీక్షలతో జబ్బుల గుట్టురట్టు
-
Technology News
Apple Update: యాపిల్ యూజర్లకు అలర్ట్.. వెంటనే అప్డేట్ చేసుకోండి!
-
Movies News
Samantha: డియర్ సామ్ మేడమ్.. ఎక్కడికి వెళ్లిపోయారు..?
-
India News
Manish Sisodia: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఇంట్లో సీబీఐ సోదాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Noise Smartwatch: ఫోన్ కాలింగ్, హెల్త్ సూట్ ఫీచర్లతో నాయిస్ కొత్త స్మార్ట్‌వాచ్