Surya kumar yadav: సూర్య.. ది ఫినిషర్‌.. ప్రపంచకప్‌ ముందు మిస్టర్‌ 360 మెరుపులు

మొన్నటివరకు వన్డేల్లో భారీ స్కోర్లు చేయలేక తడబడిన సూర్యకుమార్ యాదవ్‌ (Surya kumar yadav) వన్డే ప్రపంచకప్‌ ముంగిట తనదైన శైలిలో చెలరేగుతున్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అర్ధ శతకాలు బాది సత్తాచాటాడు. 

Updated : 26 Sep 2023 17:40 IST

టీ20ల్లో మొనగాడు.. కానీ వన్డేలకొచ్చేసరికి నామమాత్ర ఆటగాడు! పొట్టి ఫార్మాట్లో 360 డిగ్రీల ఆటతీరుతో పరుగుల సునామీ సృష్టిస్తాడు.. కానీ 50 ఓవర్ల క్రికెట్లో మాత్రం క్రీజులో నిలబడలేక వికెట్‌ పారేసుకుంటాడు! అలాంటి ఆటగాడు ప్రపంచకప్‌ జట్టు (World Cup 2023)లో ఎందుకు? అతనికి బదులు ప్రతిభావంతులైన ఇతరులకు ఛాన్స్‌ ఇవ్వొచ్చు కదా? అనే ప్రశ్నలు. కానీ ఆ ఆటగాడు ఒక్కసారిగా జూలు విదిల్చాడు. వన్డేల్లోనూ పరుగులు చేయగల సామర్థ్యం ఉందని తన ఆటపై నెలకొన్న సందేహాలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ప్రపంచకప్‌ ముందు వన్డేల్లోనూ జోరందుకుని జట్టు నమ్మకాన్ని నిలబెట్టేలా కనిపిస్తున్నాడు. ఆ ఆటగాడే సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya kumar yadav) అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లోనూ అర్ధశతకాలు సాధించి సత్తాచాటాడీ ముంబాయి బ్యాటర్‌. 

 

ఫినిషర్‌గా.. 

‘‘సూర్యను ఫినిషర్‌గా ఆడించాలి. పరిస్థితులను బట్టి అయిదు నుంచి ఏడు స్థానాల్లో అతణ్ని పంపించాలి. చివరి 15 నుంచి 20 ఓవర్లు ఆడించాలి’’ అని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) అన్నాడు. ఈ మాటల్లో అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఫినిషర్‌ పాత్రకు సూర్య సరిగ్గా సరిపోతాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో అతను అర్ధశతకాలను సాధించిన విధానమే అందుకు రుజువు. తొలి రెండు వన్డేల్లో విభిన్నమైన ఇన్నింగ్స్‌లాడాడతను. తొలి వన్డేలో 277 పరుగుల లక్ష్య ఛేదనలో 185/4తో నిలిచిన జట్టును కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)తో కలిసి విజయం దిశగా సూర్య నడిపించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా 49 బంతుల్లో 50 పరుగులతో సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. జట్టుకు విజయం ఖాయం చేసి నిష్క్రమించాడు. ఇక రెండో మ్యాచ్‌లో తనలోని మరో కోణం చూపించాడు. కేవలం 37 బంతుల్లోనే అజేయంగా 72 పరుగులు చేసి జట్టుకు ఊహించని భారీ స్కోరు అందించాడు. ఓ ఫినిషర్‌ ఇంతకంటే ఇంకేం చేయగలడు? అందుకే ఈ పాత్రను సూర్య సమర్థంగా పోషిస్తాడని చెబుతున్నారు. మొదట బ్యాటింగ్‌ చేసినప్పుడు జట్టుకు భారీ స్కోరు అందించేలా, ఛేదనలో ఒత్తిడిలోనూ నిలబడి జట్టును గెలిపించేలా సూర్య ఆడగలడు. 

ఏం మారింది? 

ఒకప్పుడు వరుసగా డకౌట్లయిన స్థితి నుంచి ఇప్పుడు నిలకడగా రాణించే స్థాయికి సూర్య ఎదిగాడు. వన్డేలకు తగ్గట్లుగా తన ఆటతీరును మార్చుకున్నాడు. టీ20 స్పెషలిస్ట్‌ నుంచి ఇప్పుడు వన్డే బ్యాటర్‌గానూ మారాడు. వన్డేల్లోనూ తొలి బంతి నుంచే బాదాలనే ఆలోచనతో సూర్య ఉండేవాడు. అందుకే వికెట్‌ పారేసుకునేవాడు. కానీ ఇప్పుడు కుదురుకుంటే వన్డేల్లో ఆడేందుకు చాలా బంతులుంటాయని అర్థం చేసుకున్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా గేరు మారుస్తున్నాడు. వన్డేల్లో చాలా ఓవర్లుంటాయి. పిచ్, ప్రత్యర్థి బౌలింగ్‌పై ముందుగా ఓ అంచనాకు రావాలి. సూర్య ఇప్పుడదే చేస్తున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ క్రీజులో పట్టుదలగా నిలబడి, వికెట్‌ ఇవ్వకూడదనే లక్ష్యంతో ఆడుతున్నాడు. కాస్త కుదురుకున్నాక తనదైన శైలిలో ఊచకోత కోస్తున్నాడు. పిచ్‌తో సంబంధం లేకుండా.. ఏ బంతి వేసినా బౌండరీ కొట్టే సామర్థ్యం సూర్య సొంతం. రెండో వన్డేలో కామెరూన్‌ గ్రీన్‌ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదడమే అందుకు నిదర్శనం. ఒక్కో సిక్సర్‌ ఒక్కో రకంగా.. బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్, ఫైన్‌ లెగ్, ఎక్స్‌ట్రా కవర్, ఫార్వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ వైపు పంపించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా సూర్యకుమార్‌కు అవకాశాలిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ప్రపంచకప్‌ తుదిజట్టులో ఎవరిని ఆడించాలన్నది భారత్‌కు తీయనైన తలనొప్పిగా మారింది. కానీ ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే సూర్యలాంటి ఆటగాడు ఇలాంటి ఫామ్‌లో ఉండగా పక్కనపెట్టడం అంటే కష్టమే.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు