Virat Kohli: మ్యాచ్‌ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్‌రేట్‌పై కామెంట్లకు విరాట్ కౌంటర్

భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు.

Updated : 29 Apr 2024 11:24 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసే వారికి ఇచ్చే ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ అతడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌ ఆడిన బ్యాటర్. అయినా, అతడి ఆటతీరుపై విమర్శలు రేగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. ఆ స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీనేనని. ప్రస్తుత ఎడిషన్‌లో తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నాడనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. తనపై వచ్చిన కామెంట్లపై గుజరాత్‌తో మ్యాచ్‌ అనంతరం కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అతడు 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

‘‘నేను స్పిన్‌ను సరిగ్గా ఆడలేనని.. స్ట్రైక్‌రేట్‌ తక్కువగా ఉందని కామెంట్లు చేసేవారికి ఆటపై పెద్దగా అవగాహన ఉండి ఉండదు. ప్రతి మ్యాచ్‌లో విజయం కోసమే మేం ఆడతాం. అలా ఉండబట్టే 15 ఏళ్లుగా కొనసాగుతున్నా. ప్రతి రోజూ జట్టు కోసం ఆలోచిస్తాం. బయట కూర్చొని కామెంట్లు చేసే చాలా మందికి మ్యాచ్‌ పరిస్థితి తెలియదు. అభిమానులు మాత్రం మా నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన ఆశిస్తారు. అందులో తప్పేం లేదు. కానీ, మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉందనేది కూడా మాకు చాలా కీలకం. ఉన్నతస్థాయిలో క్రికెట్‌ ఆడిన వారెవరూ అలాంటి వ్యాఖ్యలు చేయరు. తెలిసీతెలియని వారే విమర్శలు చేస్తుంటారు. ఆత్మగౌరవంతో మ్యాచ్‌లను ఆడతాం. అంతేకానీ, బయట నుంచి వచ్చే కామెంట్లను నేను పెద్దగా పట్టించుకోను. అటువైపు దృష్టిసారిస్తే ఏకాగ్రతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 

గుజరాత్‌తో మ్యాచ్‌ను చాలా ముందుగా పూర్తి చేయడం ఆనందంగా ఉంది. విల్ జాక్స్‌ బ్యాటింగ్‌కు వచ్చిన ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. సరిగ్గా బ్యాట్‌ను తాకడం లేదని ఆందోళన చెందాడు. దీంతో నేను స్ట్రైకింగ్‌ను తీసుకొనేందుకు ముందుకు వచ్చా. మిడిల్ ఓవర్లలో మరింత దూకుడుగా ఆడాలని మాత్రమే అనుకున్నాం. మోహిత్ ఓవర్‌లో భారీ షాట్లు కొట్టిన తర్వాత జాక్స్‌ మరింత ప్రమాదకరంగా మారాడు. దీంతో నా పాత్ర పూర్తిగా మారిపోయింది. మేం 19వ ఓవర్‌లోపే గెలుస్తామని భావించాం. కానీ, 16 ఓవర్లలోనే 200 టార్గెట్‌ను ఛేజ్‌ చేయడం అద్భుతం. టీ20ల్లో నేను చూసిన అత్యుత్తమ శతకాల్లో విల్‌జాక్స్‌ సెంచరీ కూడా ఉంటుంది. పిచ్‌ చాలా బాగుంది. మ్యాచ్‌ జరిగే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావించాం. టాస్ నెగ్గిన జట్టు తప్పకుండా తొలుత బౌలింగ్‌కు మొగ్గు చూపుతుందని తెలుసు. భారీ విజయం సాధించడంలో మా బౌలర్లదీ కీలక పాత్రే. సరైన సమయంలో వికెట్లు తీసి గుజరాత్‌ను కట్టడి చేయగలిగాం’’ అని కోహ్లీ తెలిపాడు. విల్‌జాక్స్‌తో కలిసి రెండో వికెట్‌కు 166 పరుగులను జోడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని