విద్యాసంస్థల మూసివేత ప్రచారం నమ్మవద్దు: మంత్రి సబిత

ఒమిక్రాన్‌ తీవ్రత వల్ల రాష్ట్రంలో విద్యాసంస్థలు బంద్‌ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిసెంబరు 2

Published : 01 Dec 2021 04:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒమిక్రాన్‌ తీవ్రత వల్ల రాష్ట్రంలో విద్యాసంస్థలు బంద్‌ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిసెంబరు 2 నుంచి మూసివేతకు నిర్ణయం తీసుకున్నట్లు, పాఠశాలలకు సెలవులు అంటూ కొన్ని వెబ్‌ ఛానెళ్లు, సామాజిక మాధ్యమాల్లో మంగళవారం ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఐసెట్‌లో మిగిలిన సీట్లు 5,087

ఐసెట్‌ ప్రత్యేక విడత సీట్లను మంగళవారం కేటాయించారు. ఎంబీఏలో 5,051, ఎంసీఏలో 36 సీట్లు మిగిలిపోయాయి. సీట్లు పొందినవారు డిసెంబరు 1లోపు ఆయా కళాశాలల్లో చేరాలని ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.

ఎస్‌ఎస్‌ఏ  సమన్వయకర్తల నియామకం

రాష్ట్రంలోని వివిధ జిల్లాల విద్యాశాఖ కార్యాలయాల్లో సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) కార్యకలాపాల పర్యవేక్షణకు 12 మంది గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లను సమన్వయకర్తలుగా నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆదేశాలు జారీచేశారు.

3 నుంచి ఒకేషనల్‌ ప్రయోగ పరీక్షలు

రాష్ట్రంలో ఇంటర్‌ ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరం (ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న) విద్యార్థులకు డిసెంబరు 3 నుంచి 7 వరకు ప్రయోగ పరీక్షలు(ప్రాక్టికల్స్‌) జరపాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది.


నేడు, రేపు ధ్రువపత్రాల పరిశీలన

బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం కోర్సులు పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు 6 నెలలు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తామని, ఆసక్తి ఉన్నవారు డిసెంబరు 1, 2 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని తెలంగాణ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఫర్‌ నర్సింగ్‌ సమన్వయకర్త సునీత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని