Published : 04/12/2021 05:34 IST

తెలంగాణకు జర్మనీ పారిశ్రామికవేత్తల బృందం

రాయబారి వాల్టర్‌. జె.లిండ్నెర్‌ నేతృత్వంలో రెండు రోజుల పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్‌.జె.లిండ్నెర్‌ నేతృత్వంలో ఆ దేశ పారిశ్రామికవేత్తల బృందం ఈ నెల 5, 6 తేదీల్లో తెలంగాణలో పర్యటించనుంది. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ బృందం రాష్ట్రానికి రానుంది. బృందం సభ్యులు స్థానికంగా ఉన్న జర్మనీ పరిశ్రమలను సందర్శించడంతో పాటు హైదరాబాద్‌లో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంటారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అనంతరం వాల్టర్‌, పారిశ్రామికవేత్తలతో ముఖాముఖిలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, వనరులు, మౌలిక వసతులు, పెట్టుబడుల అనుకూలతలపై చర్చిస్తారు. ఇప్పటికే జర్మనీకి చెందిన వివిధ సంస్థలు రాష్ట్రంలో ఔషధ, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, వాహనాల తయారీ తదితర రంగాల్లో పరిశ్రమలు నిర్వహిస్తున్నాయి.  

ఇతర దేశాలకు ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడుల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ దేశాలను రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే గత అక్టోబరు రెండో వారంలో ఫ్రాన్స్‌కు చెందిన పారిశ్రామికవేత్తల బృందం రాష్ట్రంలో పర్యటించింది. అదే తరహాలో జర్మనీ బృందం రాష్ట్రానికి వస్తోంది. వచ్చే నెలలో మరో రెండు దేశాల పారిశ్రామిక బృందాలు రాష్ట్రానికి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


తెలంగాణలో ష్నైడర్‌ భారీ పరిశ్రమ
మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధుల వెల్లడి

ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థ ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ తెలంగాణలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సంస్థ అంతర్జాతీయ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు లూక్‌ రెమోంట్‌, భారత విభాగాధిపతి అనిల్‌చౌదరి, ఇతర ప్రతినిధులు శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రపంచంలోనే ఫార్చ్యూన్‌--500 కంపెనీగా గుర్తింపు పొందిన ష్నైడర్‌.. విద్యుత్‌ పరికరాలు, ఆటోమేషన్‌, పారిశ్రామిక భద్రత పరికరాల పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌, డేటా కేంద్రాలను నిర్వహిస్తోంది. పారిస్‌ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ ఆస్తులు రూ. 3.6 లక్షల కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 1.28 లక్షల మంది ఉద్యోగులున్నారు. తమ సంస్థ విస్తరణలో భాగంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాలను పరిశీలించిన అనంతరం తెలంగాణను ఎంపిక చేసుకున్నట్లు లూక్‌ రెమోంట్‌ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వారిని సత్కరించారు. కొత్త పరిశ్రమ ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి తెలిపారు. వారి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఉన్నారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని