T20 League Eliminator: పటీదార్‌ పంచ్‌.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూ చిత్తు

భారత టీ20 లీగ్‌లో ప్లే ఆఫ్స్‌లో భాగంగా లఖ్‌నవూ, బెంగళూరు జట్ల మధ్య జరగనున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. దీంతో ఇంకా టాస్‌ కూడా వేయలేదు. ప్రస్తుతం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.

Updated : 26 May 2022 06:58 IST

కోల్‌కతా: కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు సత్తా చాటింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శన కనబరిచి లఖ్‌నవూను చిత్తు చేసి క్వాలిఫయర్‌-2కి దూసుకెళ్లింది. బెంగళూరు నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. లఖ్‌నవూ బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (79; 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు),  దీపక్‌ హుడా (45; 26 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) రాణించారు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, మహ్మద్‌ సిరాజ్‌, వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. శుక్రవారం రాజస్థాన్‌, బెంగళూరు మధ్య క్వాలిఫయర్-2 జరగనుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు.. రజత్‌ పదార్‌ (112*; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెంగళూరు మిగతా బ్యాటర్లలో దినేశ్ కార్తీక్ (37*; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. విరాట్ కోహ్లీ (25), మ్యాక్స్‌వెల్ (9), మహిపాల్ లోమ్రార్‌ (14) పరుగులు చేయగా.. డుప్లెసిస్‌ (0) గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. లఖ్‌నవూ బౌలర్లలో మెహ్‌సిన్‌ ఖాన్‌, కృనాల్ పాండ్య, అవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీశారు.


 లఖ్‌నవూకు గట్టి షాక్‌ తగిలింది. ధాటిగా ఆడుతున్న దీపక్‌ హుడా ఔటయ్యాడు. వానిందు హసరంగ వేసిన 15 ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన అతడు నాలుగో బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అంతకుముందు హేజిల్‌వుడ్ వేసిన ఓవర్‌లో రాహుల్, దీపక్‌ చెరో సిక్సర్‌ బాదారు. 15 ఓవర్లకు లఖ్‌నవూ 3 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (57), మార్కస్‌ స్టొయినిస్‌ (6) క్రీజులో ఉన్నాడు. లఖ్‌నవూ విజయానికి 30 బంతుల్లో 65 పరుగులు కావాలి.


నిలకడగా లఖ్‌నవూ బ్యాటింగ్

లఖ్‌నవూ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. వానిందు హసరంగ వేసిన ఏడో ఓవర్‌లో ఐదు పరుగులు రాగా.. షాబాజ్‌ అహ్మద్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. హర్షల్‌ పటేల్ వేసిన పదో ఓవర్‌లో ఐదు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు బెంగళూరు రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. దీపక్ హుడా (19), కేఎల్ రాహుల్ (37) క్రీజులో ఉన్నారు. 


లఖ్‌నవూ మరో వికెట్

లఖ్‌నవూ మరో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడే క్రమంలో మనన్‌ వోహ్రా (19) ఔటయ్యాడు. హేజిల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో షాబాజ్‌ అహ్మద్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన ఆరో ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. 6 ఓవర్లకు లఖ్‌నవూ 62/2 స్కోరుతో ఉంది. కేఎల్ రాహుల్ (26), దీపక్‌ హుడా (4) క్రీజులో ఉన్నారు. 


డికాక్ ఔట్‌

208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూకు తొలిఓవర్‌లోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్‌ వేసిన తొలి ఓవర్‌లో చివరి బంతికి క్వింటన్‌ డికాక్‌(6) ఔటయ్యాడు. అతడు డు ప్లెసిస్‌కు చిక్కాడు. మూడు ఓవర్లకు లఖ్‌నవూ వికెట్‌ నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజులో మనన్‌ వోహ్రా (2), కేఎల్‌ రాహుల్‌  (9) ఉన్నారు.


లఖ్‌నవూ ఎదుట భారీ లక్ష్యం..

టీ20 లీగ్‌లో భాగంగా లఖ్‌నవూతో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. రజత్‌ పటీదార్‌ (112*; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రవి బిష్ణోయ్‌ వేసిన 16 ఓవర్‌లో పటీదార్‌ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది తన విశ్వరూపం చూపించాడు. బెంగళూరు మిగతా బ్యాటర్లలో దినేశ్ కార్తీక్ (37*; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. విరాట్ కోహ్లీ (25), మ్యాక్స్‌వెల్ (9), మహిపాల్ లోమ్రార్‌ (14) పరుగులు చేయగా.. డుప్లెసిస్‌ (0) గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. లఖ్‌నవూ బౌలర్లలో మెహ్‌సిన్‌ ఖాన్‌, కృనాల్ పాండ్య, అవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీశారు.  


మరో రెండు వికెట్లు

బెంగళూరు మరో రెండు వికెట్లు కోల్పోయింది. కృనాల్‌ పాండ్య వేసిన 11వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ (9) లూయిస్‌కి చిక్కగా.. రవి బిష్ణోయ్‌ వేసిన 14వ ఓవర్‌లో మహిపాల్ లోమ్రార్‌ (14) రాహుల్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు చమీర వేసిన 12వ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు బెంగళూరు 123/4 స్కోరుతో ఉంది. దినేశ్ కార్తీక్ (5), రజత్‌ పటీదార్‌ (66) క్రీజులో ఉన్నారు. 


దంచికొడుతున్న రజత్

బెంగళూరు బ్యాటర్‌ రజత్‌ పటీదార్‌ దూకుడును కొనసాగిస్తున్నాడు. దుష్మంత చమీర వేసిన ఏడో ఓవర్‌లో ఓ ఫోర్ కొట్టిన అతడు.. అవేశ్‌ఖాన్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో సిక్సర్‌ బాదాడు. ఇదే ఓవర్‌లో విరాట్ కోహ్లీ (25) ఔటయ్యాడు. అతడు మెహ్‌సిన్‌ ఖాన్‌కు చిక్కాడు. రవి బిష్ణోయ్‌ వేసిన పదో ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ సిక్స్‌ బాదాడు. 10 ఓవర్లకు బెంగళూరు 84/2 స్కోరుతో ఉంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (8) పరుగులతో ఉండగా.. రజత్‌ పటీదార్‌ (49) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు. 


పటీదార్‌ దూకుడు

బెంగళూరు ఆటగాడు రజత్‌ పటీదార్‌ దూకుడుగా ఆడుతున్నాడు.  అవేశ్‌ఖాన్‌ వేసిన ఐదో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన రజత్ పటీదార్‌.. కృనాల్ పాండ్య వేసిన ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ బాదాడు. 6 ఓవర్లకు బెంగళూరు 52/1 స్కోరుతో ఉంది. రజత్‌ పటీదార్‌ (33), విరాట్ కోహ్లీ (18) క్రీజులో ఉన్నారు.  


డుప్లెసిస్‌ గోల్డన్‌ డక్‌

లఖ్‌నవూ, బెంగళూరు మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆరంభంలోనే గట్టి షాక్‌ తగిలింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (0) గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. మెహ్‌సిన్‌ ఖాన్‌ వేసిన తొలి ఓవర్‌లో ఐదో బంతికి డుప్లెసిస్‌ వికెట్‌కీపర్‌కి చిక్కాడు. రజత్‌ పటీదార్‌ (4), విరాట్ కోహ్లీ (8) క్రీజులో ఉన్నారు. 2 ఓవర్లకు బెంగళూరు ఒక వికెట్‌ నష్టానికి 13 పరుగులు చేసింది. 


టాస్‌ గెలిచిన లఖ్‌నవూ

భారత టీ20 లీగ్‌లో ప్లే ఆఫ్స్‌లో భాగంగా మరికాసేపట్లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ పోరులో లఖ్‌నవూ, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. వర్షం కారణంగా టాస్‌ వేయడం గంట ఆలస్యమైంది. టాస్‌ గెలిచిన లఖ్‌నవూ సారథి కేఎల్ రాహుల్ తొలుత బౌలింగ్‌ని ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2లో రజస్థాన్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. కాబట్టి విజయం కోసం రెండు జట్లూ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. చూడాలి మరి విజయం ఏ జట్టుని వరిస్తుందో.   

లఖ్‌నవూ జట్టు:

కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, ఎవిన్‌ లూయిస్‌, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, మానన్ వోహ్రా, మార్కస్‌ స్టొయినిస్‌, దుష్మంత చమీర, మెహ్‌సిన్‌ ఖాన్‌, అవేశ్ ఖాన్‌, రవి బిష్ణోయ్‌.

బెంగళూరు జట్టు: 

డుప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రజత్‌ పటీదార్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, దినేశ్‌ కార్తీక్, మహిపాల్ లోమ్రార్‌, షాబాజ్‌ అహ్మద్‌, వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్, మహ్మద్‌ సిరాజ్‌, జోష్‌ హేజిల్ వుడ్.


వర్షం అంతరాయం.. టాస్‌ ఆలస్యం

భారత టీ20 లీగ్‌లో ప్లే ఆఫ్స్‌లో భాగంగా లఖ్‌నవూ, బెంగళూరు జట్ల మధ్య జరగనున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్‌ వేయడం ఆలస్యమైంది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో మరికాసేపట్లో టాస్ వేయనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని