‘మాట సాయం’ ఇబ్బంది పెట్టకుండా

ఇప్పుడు మాటలతోనే ఆన్‌లైన్‌లో విహరిస్తున్నాం. వాయిస్‌ అసిస్టెంట్లతో కూర్చున్న చోటు నుంచి లేవకుండానే పనులు కానిచ్చేస్తున్నాం.

Published : 04 Jan 2023 00:21 IST

ఇప్పుడు మాటలతోనే ఆన్‌లైన్‌లో విహరిస్తున్నాం. వాయిస్‌ అసిస్టెంట్లతో కూర్చున్న చోటు నుంచి లేవకుండానే పనులు కానిచ్చేస్తున్నాం. సిరితో మీటింగ్‌ ఏర్పాటు చేసుకోవటం దగ్గర్నుంచి ఫోన్‌ను సైలెన్స్‌లోనూ పెట్టేసుకోవచ్చు. అమెజాన్‌ ఎకో మన ఫోన్‌ ఎక్కడుందో వెతికి పెడుతుంది. తలుపు గడియ వేసేస్తుంది. ఇష్టమైనవారితో ఛాట్‌ చేయటానికి తోడ్పడుతుంది. అయితే వాయిస్‌ అసిసెంట్లు అన్ని వేళలా మన మాటలను వింటుండటమే ఆందోళన కలిగించే విషయం. ఇది గోప్యతకు భంగం కలిగించొచ్చు. మరి దీన్ని ఆపటమెలా?


ఫేస్‌బుక్‌కు బురిడీ                   

ఫేస్‌బుక్‌ కొన్నిసార్లు వీడియో ఛాటింగ్‌ కోసమో, టెక్స్ట్‌ను మాటలుగా మలచటం కోసమో మైక్రోఫోన్‌ యాక్సెస్‌ చేయమని అడగొచ్చు. మైక్రోఫోన్‌ మీద దానికి ఆధిపత్యం ఇవ్వటం మనకు ఇష్టం లేకపోవచ్చు. ఇలాంటప్పుడు మైక్‌ యాక్సెస్‌ను ఆఫ్‌ చేసుకోవటం మంచిది.

* ఐఫోన్‌ వాడేవారైతే- సెటింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌బుక్‌ మీద ట్యాప్‌ చేయాలి. మైక్రోఫోన్‌ పక్కనుండే గ్రీన్‌ స్విచ్‌ను ఆఫ్‌ చేసి పెట్టుకోవాలి. దీనికి మరో మార్గం కూడా ఉంది. సెటింగ్స్‌ ద్వారా ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీలోకి వెళ్లి.. మైక్రోఫోన్‌ మీద ట్యాప్‌ చేయాలి. యాప్స్‌ జాబితాలో ఫేస్‌బుక్‌ కనిపించినట్టయితే ఆఫ్‌ చేసుకోవాలి.

* ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడేవారైతే- సెటింగ్స్‌ను ఓపెన్‌ చేసి యాప్స్‌లోకి వెళ్లాలి. మార్పులు చేయాలని అనుకుంటున్న యాప్‌ (ఉదా: ఫేస్‌బుక్‌) మీద నొక్కాలి. పర్మిషన్స్‌ను ఎంచుకోవాలి. దీని ద్వారా పరిషన్స్‌ను మార్చుకోవచ్చు. ‘అలో ఓన్లీ యూజింగ్‌ ద యాప్‌, ఆస్క్‌ ఎవ్రీ టైమ్‌, డోంట్‌ అలో’ వంటి ఆప్షన్లలో అవసరమైనది ఎంచుకోవాలి.


వాయిస్‌ అసిస్టెంట్లను ఆపటం

వర్చువల్‌ అసిస్టెంట్లు మనం యథాలాపంగా మాట్లాడుకునే మాటల్లోని పదాలనూ పసిగడతాయి. అలెక్సా, సిరి, కోర్టానా, గూగుల్‌ వంటివి వెయ్యికి పైగా ఇలాంటి పదబంధాలను గుర్తిస్తున్నట్టు ఒక అధ్యయనం పేర్కొంటోంది. దీన్ని తప్పించుకోవటానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

* అమెజాన్‌ ఎకో వాడేవారు- పరికరం మీద మైక్రోఫోన్‌ లేదా వృత్తం ఆకారంలోని బటన్‌ను పుష్‌ చేయాలి. దీంతో మైక్‌ లోపలి భాగాల నుంచి వోల్టేజీ ప్రసారం కావటం ఆగిపోతుంది. ఎప్పుడైనా అలెక్సాతో పనిపడితే బటన్‌ను తిరిగి నొక్కితే చాలు. ఎకోను వాడుకోనప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మైక్‌ను ఆఫ్‌ చేసి పెట్టుకోవాలి.

* సిరి వాడేవారైతే- ఐఫోన్‌లో సెటింగ్స్‌ను ఓపెన్‌ చేసి, సిరి అండ్‌ సెర్చ్‌ మీద ట్యాప్‌ చేయాలి. ‘లిజన్‌ ఫర్‌ హే సిరి’ పక్కనుండే ఆకుపచ్చ స్విచ్‌ను ఆఫ్‌ చేసుకోవాలి. ‘అలో సిరి వెన్‌ లాక్డ్‌’ ఆప్షన్‌ను ఆఫ్‌ చేసుకోవచ్చు కూడా. దీంతో ఫోన్‌ జేబులో ఉన్నప్పుడు బటన్‌ నొక్కినా సిరి ఆన్‌ కాదు.

* గూగుల్‌ అసిస్టెంట్‌లో- ఆండ్రాయిడ్‌ పరికరాల్లో సెటింగ్స్‌ ద్వారా యాప్స్‌లోకి వెళ్లాలి. జనరల్‌ విభాగం కింద అసిస్టెంట్‌ మీద నొక్కితే అన్ని అసిస్టెంట్‌ సెటింగ్స్‌ కనిపిస్తాయి. ఇందులో హే గూగుల్‌ ఆప్షన్‌ను ఆఫ్‌ చేసుకోవాలి. ఐఫోన్లలోనైతే సెటింగ్స్‌ ద్వారా ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీలోకి వెళ్లి మైక్రోఫోన్‌ మీద ట్యాప్‌ చేయాలి. యాప్స్‌ జాబితాలో గూగుల్‌ అసిస్టెంట్‌ను వెతికి.. ఆకుపచ్చ బటన్‌ను ఆఫ్‌ చేసి పెట్టుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు