యాపిల్‌ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..

పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్‌ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్‌ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది

Updated : 13 Mar 2024 04:16 IST

పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్‌ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్‌ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని పేరు ట్రాన్స్‌క్రిప్ట్స్‌. పేరుకు తగ్గట్టుగానే ఇది మాటలను అక్షరాల రూపంలోకి మారుస్తుంది. యాపిల్‌ పాడ్‌కాస్ట్‌ యాప్‌లో ఒదిగిపోయే ఇది ప్రసార భాగాలను అక్షరాల్లోకి అనువదిస్తుంది. ఆయా పదాలు, పదబంధాలను సెర్చ్‌ చేసుకోవటానికీ వీలు కల్పిస్తుంది. టెక్స్ట్‌ మీద తాకితే అక్కడి నుంచి పాడ్‌కాస్ట్‌ ప్లే అవుతుంది కూడా. ఎపిసోడ్‌ ప్లే అవుతున్నప్పుడు ప్రతీ పదం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. విషయాన్ని తేలికగా గ్రహించటానికి, యూజర్లను అనుసరించటానికి తోడ్పడుతుంది. ఇది కొత్త భాషలను నేర్చుకోవటానికీ ఉపయోగపడుతుంది. బధిరులు, వినికిడి లోపం గలవారికిది ఎంతగానో మేలు చేస్తుంది. ప్రస్తుతానికి ఇంగ్లిష్‌, ఫ్రెంచి, స్పానిష్‌, జర్మన్‌ భాషల్లో ట్రాన్స్‌క్రిప్ట్స్‌ అందుబాటులో ఉంటుంది. ఐఓఎస్‌ 17.4, ఐప్యాడ్‌ 17.4 వర్షన్లతో కూడిన ఐఫోన్‌, ఐప్యాడ్‌ యూజర్లు దీన్ని వాడుకోవచ్చు. అయితే ఇది భాషలను అనువాదం చేయదని గుర్తుంచుకోవాలి.


ఎక్స్‌లో ఆర్టికల్స్‌

 పాత్రికేయులు, రచయితల కోసం ఎక్స్‌ (ట్విటర్‌) కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. పెద్ద కథనాలను రాసుకోవటానికి తోడ్పడే దీని పేరు ఆర్టికల్స్‌. ప్రస్తుతం ఇది ధ్రువీకృత సంస్థలు, ప్రీమియం చందాదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌లో ఆర్టికల్‌ కంపోజర్‌ సదుపాయమూ ఉంది. దీంతో టెక్స్ట్‌ను బోల్డ్‌, ఇటాలిక్‌, స్ట్రైక్‌త్రో శైలిలోకి మార్చుకోవచ్చు. బుల్లెట్‌ పాయింట్లు, అంకెల జాబితానూ పెట్టుకోవచ్చు. కథనాలను మరింత ఆకట్టుకునేలా చేసుకోవటానికి ఇమేజ్‌లు, వీడియోలు జోడించుకోవచ్చు కూడా. పబ్లిష్‌ అయిన కథనాలను ఇతర ఎక్స్‌ పోస్టుల మాదిరిగానే యూజర్‌ ప్రొఫైల్‌, ఫాలోయర్స్‌ టైమ్‌లైన్స్‌ మీద చూడొచ్చు. కథనం నిడివి 25వేల క్యారెక్టర్లకు పైగా ఉండొచ్చు. ప్రీమియం చందాదారుల పెద్ద పోస్టులకూ ఇప్పుడు ఇదే నియమం వర్తిస్తోంది. ఇతర పోస్టులకు భిన్నమైనవని తేలికగా తెలిసేలా వీటి ఐకన్‌, లేఅవుట్‌ కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. నిజానికి ఇలాన్‌ మస్క్‌ అధీనంలోకి రాక ముందు నుంచే ట్విటర్‌ పెద్ద పోస్టులను ఆరంభించింది. న్యూస్‌లెటర్‌ రైటర్స్‌, క్రియేటర్లను ఆకర్షించటానికి నోట్స్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ట్విటర్‌లో పెద్ద పోస్టుల తొలిరూపం అదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని