జీమెయిల్‌ జిందగీ

స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. వ్యక్తిగత పనులకే కాదు.. ఉద్యోగ, వృత్తి అవసరాలకూ తప్పనిసరయ్యాయి.

Published : 08 May 2024 00:19 IST

స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. వ్యక్తిగత పనులకే కాదు.. ఉద్యోగ, వృత్తి అవసరాలకూ తప్పనిసరయ్యాయి. వీటిల్లో భాగంగా జీమెయిల్‌తో రోజూ ఎన్నో ఈమెయిళ్లను అందుకోవటం, పంపటం చేస్తూనే ఉంటాం. అయితే మొబైల్‌ పరికరాల్లో జీమెయిల్‌ను సమర్థంగా వాడుకోవాలంటే కొన్ని సెటింగ్స్‌ అంశాల మీద దృష్టి సారించాల్సిందే.

నోటిఫికేషన్ల కస్టమైజ్‌

 జీమెయిల్‌ డిఫాల్ట్‌గా అన్ని ఈమెయిళ్ల నోటిఫికేషన్లను చూపిస్తుంది. ఇది కొన్నిసార్లు చికాకు కలిగించొచ్చు. ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు, అవసరమైన మెయిల్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నప్పుడు స్పామ్‌, మార్కెటింగ్‌ మెయిళ్ల నోటిఫికేషన్లు కనిపిస్తే ఆగ్రహమూ కలుగుతుంది. ఇలాంటి పరిస్థితిని తప్పించుకోవటానికి మార్గం లేకపోలేదు. అత్యధిక ప్రాధాన్యం గల మెయిల్‌ నోటిఫికేషన్లు వచ్చేలా సెట్‌ చేసుకోవచ్చు. అసలే వద్దనుకుంటే నోటిఫికేషన్లను మొత్తానికే ఆఫ్‌ చేసుకోవచ్చు. వారాంతాల్లో, సెలవుల్లో బయటికి వెళ్లినప్పుడిది బాగా ఉపయోపడుతుంది.

ఫోన్‌లో జీమెయిల్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, పైన ఎడమవైపున కనిపించే అడ్డం మూడు గీతల మీద తాకాలి. డ్రాప్‌డౌన్‌ మెనూలో సెటింగ్స్‌ మీద క్లిక్‌ చేయాలి. జీమెయిల్‌ ఖాతా ఐడీ మీద క్లిక్‌ చేస్తే నోటిఫికేషన్స్‌ విభాగం కనిపిస్తుంది. నోటిఫికేషన్స్‌ మీద తాకితే ఆల్‌, హై ప్రయారిటీ, నన్‌ ఆప్షన్లు ఉంటాయి. అవసరమైనదాన్ని ఎంచుకుంటే సరి.

అంశాలుగా విభజన

జీమెయిల్‌లో అంశాల వారీగా మెయిళ్లను వర్గీకరించుకోవచ్చు. ఇది వేర్వేరు రకాల మెయిళ్ల తేడాలను గుర్తించటానికిది ఉపయోగపడుతుంది. ప్రైమరీలో వ్యక్తిగత మెయిళ్లు, ప్రమోషన్స్‌లో ఆయా కంపెనీలకు సంబంధించినవి, సోషల్‌లో సామాజిక మాధ్యమాల నోటిఫికేషన్లు.. ఇలా రకరకాలుగా వర్గీకరించుకోవచ్చు. రశీదులు, బిల్లులు, స్టేట్‌మెంట్లు, ఆన్‌లైన్‌ గ్రూపుల నుంచి వచ్చే మెసేజ్‌ల వంటి వాటికోసం అప్‌డేట్స్‌, ఫోరమ్స్‌ వంటి అదనపు విభాగాలు కూడా ఉంటాయి.
జీమెయిల్‌ యాప్‌లో సెటింగ్స్‌ ఓపెన్‌ చేసి, ఖాతా పేరు మీద క్లిక్‌ చేయాలి. తర్వాత ఇన్‌బాక్స్‌ విభాగంలో ఇన్‌బాక్స్‌ టైప్‌ను ట్యాప్‌ చేసి డిఫాల్ట్‌ ఇన్‌బాక్స్‌ను ఎంచుకోవాలి (చాలావరకిది డిఫాల్ట్‌గానే ఉంటుంది). అనంతరం ఇన్‌బాక్స్‌ కేటగిరీస్‌ మీద క్లిక్‌ చేస్తే ప్రైమరీ, ప్రమోషన్స్‌, సోషల్‌, అప్‌డేట్స్‌, ఫోరమ్స్‌ కనిపిస్తాయి. వీటిల్లో అవసరమైన బాక్సుల్లో టిక్‌ పెట్టుకోవాలి. వద్దనుకున్న వాటి బాక్సులోంచి టిక్‌ తీసేయాలి.

మొబైల్‌ సంతకం

మెయిల్‌ పంపిన ప్రతీసారీ సంతకం చేయాల్సిన పనిలేకుండా మొబైల్‌ సిగ్నేచర్‌ ఫీచర్‌ ఉపయోగ పడుతుంది. ఒకసారి దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే పంపిన ప్రతి మెయిల్‌కు డిఫాల్ట్‌గా సంతకం జతవుతుంది. కావాలంటే కాంటాక్ట్‌ వివరాలు, హోదా వంటివీ చేర్చుకోవచ్చు. సెటింగ్స్‌ మెనూ ద్వారా జీమెయిల్‌కు ఇష్టమైనట్టుగా సంతకాన్ని జోడించుకోవచ్చు.
జీమెయిల్‌ యాప్‌లో సెటింగ్స్‌ ద్వారా వెళ్లి ఖాతా మీద క్లిక్‌ చేయాలి. కిందికి స్క్రోల్‌ చేస్తూ వెళ్తే మొబైల్‌ సిగ్నేచర్‌ ఫీచర్‌ కనిపిస్తుంది. దీని మీద ట్యాప్‌ చేసి సంతకాన్ని టైప్‌ చేసి, ఓకే మీద నొక్కితే సరి.

స్మార్ట్‌ కంపోజ్‌, స్మార్ట్‌ రిప్లై

మెయిల్‌ను రాస్తున్నప్పుడు కొన్నిసార్లు తర్వాత ఏ పదం రాయాలో తట్టకపోవచ్చు. ఇలాంటి సమయంలో స్మార్ట్‌ కంపోజ్‌ చేదోడుగా నిలుస్తుంది. ఇది మనం రాస్తున్న తీరును గమనించి తర్వాతి పదాన్ని ఊహించి, సూచిస్తుంది. ఇక స్మార్ట్‌ రిప్లై ఆప్షనేమో కొన్ని ఈమెయిళ్లకు రిప్లైలను ఇవ్వాలని చెబుతుంది. ఒకసారి వీటిని ఎనేబుల్‌ చేసుకుంటే మెయిళ్లు రాయటం తేలికవుతుంది. మన అవసరాలను బట్టి సూచించిన పదాలను ఎంచుకోవచ్చు.
జీమెయిల్‌ యాప్‌లో సెటింగ్స్‌ మీద క్లిక్‌ చేసి, ఖాతా మీద తాకాలి. కింది జాబితాలో స్మార్ట్‌ కంపోజ్‌, స్మార్ట్‌ రిప్లై బాక్సులను టిక్‌ చేసుకోవాలి.

ఆఫీస్‌ ఆటో రిప్లైకి దూరంగా

సెలవులో ఉన్నప్పుడు ప్రతి అధికారిక ఈమెయిల్‌కు జవాబు ఇవ్వకూడదని అనుకుంటున్నారా? అయితే అవుట్‌ ఆఫ్‌ ఆఫీస్‌ ఆటో రిప్లై ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోండి. ఇది వెంటనే జవాబు ఇవ్వలేరనే విషయాన్ని అవతలివారికి తెలియజేస్తుంది.
సెటింగ్స్‌ ద్వారా వెళ్లి ఖాతా పేరు మీద క్లిక్‌ చేసి.. కిందికి వెళ్తే అవుట్‌ ఆఫ్‌ ఆఫీస్‌ ఆటోరిప్లై ఫీచర్‌ కనిపిస్తుంది. దీన్ని తాకి ఫస్ట్‌ డే, లాస్ట్‌ డే ఎంచుకొని.. సబ్జెక్టు, మెసేజ్‌లను టైప్‌ చేసి సేవ్‌ చేసుకోవాలి. కావాలంటే దీన్ని కేవలం మీ కాంటాక్టు నంబర్లకే వర్తించేలా కూడా చూసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని