పీడీఎఫ్‌ సైజు తగ్గిస్తారా?

కొన్ని పీడీఎఫ్‌ ఫైళ్ల సైజు ఎక్కువగా ఉండొచ్చు. మెయిల్‌ ద్వారానో సామాజిక మాధ్యమాల్లోనో షేర్‌ చేసుకోవటం కష్టం కావొచ్చు

Published : 22 Feb 2023 00:15 IST

కొన్ని పీడీఎఫ్‌ ఫైళ్ల సైజు ఎక్కువగా ఉండొచ్చు. మెయిల్‌ ద్వారానో సామాజిక మాధ్యమాల్లోనో షేర్‌ చేసుకోవటం కష్టం కావొచ్చు. ఇలాంటి సమయంలో సైజు తగ్గించాల్సి రావొచ్చు. అయితే దీంతో కొన్నిసార్లు క్వాలిటీ దెబ్బతినొచ్చు. మరెలా? సైజును తగ్గిస్తూనే, క్వాలిటీ తగ్గకుండా చూడటానికి తోడ్పడే కొన్ని వెబ్‌సైట్లు, టూల్స్‌ వివరాలు ఇవీ..
 


అడోబ్‌ అక్రోబాట్‌
పీసీలో ఇది ఇన్‌స్టాల్‌ అయ్యింటే మరో యాప్‌ అవసరమే లేదు. ఇందులోనే పీడీఎఫ్‌ ఆప్టిమైజర్‌ టూల్‌ ఇమిడి ఉంటుంది. ఇది ఫైలు సైజు తగ్గటానికి తోడ్పడుతుంది.
* అడోబ్‌ అక్రోబాట్‌ను ఓపెన్‌ చేసి సైజు తగ్గించాలనుకునే పీడీఎఫ్‌ ఫైల్‌ను ఓపెన్‌ చేయాలి. టూల్స్‌ విభాగంలోకి వెళ్లి పీడీఎఫ్‌ ఆప్టిమైజర్‌ను ఎంచుకోవాలి. దీని పైభాగాన ‘రిడ్యూస్‌ ఫైల్‌ సైజ్‌’ను ఎంచుకుంటే చాలు. డిఫాల్ట్‌ సెటింగ్స్‌ ప్రకారం సైజును తగ్గిస్తుంది. ‘అడ్వాన్స్‌డ్‌ ఆప్టిమైజేషన్‌’ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఫొటోలు, ఫాంట్స్‌, ట్రాన్స్‌పరెన్సీ వంటివన్నీ మెరుగవుతాయి.
* కంప్యూటర్‌లో అడోబ్‌ అక్రోబాట్‌ ప్రోగ్రామ్‌ లేదనుకోండి. అయినా చింతించాల్సిన పనిలేదు.https://www.adobe.com/in/acrobat/online/compress-pdf.html  ద్వారానూ ఉచితంగా సైజు తగ్గించుకోవచ్చు. సైట్‌ ఓపెన్‌ అయ్యాక కనిపించే బాక్సులో సెలెక్ట్‌ ఎ ఫైల్‌ మీద నొక్కి పీడీఎఫ్‌ ఫైలును ఎంచుకోవాలి. ఎంతమేరకు తగ్గించాలనేది ఎంచుకొని, కంప్రెస్‌ బటన్‌ మీద నొక్కితే సరి. సైజు తగ్గుతుంది. డౌన్‌లోడ్‌ చేసుకొని చూసుకోవచ్చు.


డాక్యూపబ్‌
ఇది మనం ఎంచుకున్న మేరకు పీడీఎఫ్‌ ఫైల్‌ సైజును తగ్గిస్తుంది. అయితే ఇది 50 ఎంబీ సైజు ఫైళ్లనే అనుమతిస్తుంది.https://docupub.com/pdfconvert/ లోకి వెళ్లాలి. మీడియం, హై, మ్యాగ్జిమమ్‌.. ఇలా అవసరమైన సైజును ఎంచుకోవాలి. కంప్రెస్‌ చేయాలనుకునే ఫైలును బ్రౌజ్‌ చేసి.. అప్‌లోడ్‌ అండ్‌ కంప్రెస్‌ బటన్‌ మీద నొక్కాలి. తర్వాత తెరపై కనిపించే లింక్‌తో ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.


4డాట్స్‌ఫ్రీ పీడీఎఫ్‌ కంప్రెసర్‌
పీడీఎఫ్‌ ఫైళ్లను కంప్రెస్‌ చేయటానికి థర్డ్‌ పార్టీ అప్లికేషన్లు చాలానే ఉన్నాయి. వీటిల్లో ఒకటి 4డాట్స్‌ఫ్రీ పీడీఎఫ్‌ కంప్రెసర్‌. ఇది ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. వాడుకోవటమూ తేలికే.https://www.4dots-software.com/free-pdf-compress/  ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అనంతరం యాప్‌ను ఓపెన్‌ చేసి ‘యాడ్‌ ఫైల్‌’ ఆప్షన్‌తో పీడీఎఫ్‌ ఫైలును అప్‌లోడ్‌ చేయాలి. ఫొటోల క్వాలిటీని అడ్జస్ట్‌ చేసుకోవటానికీ ఇది వీలు కల్పిస్తుంది. అనంతరం ‘కంప్రెస్‌’ ఆప్షన్‌ మీద నొక్కితే చాలు. సైజు తగ్గిన ఫైలు పీసీలో సేవ్‌ అవుతుంది. దీని ద్వారా ఒకేసారి ఎక్కువ ఫైళ్లనూ సైజు తగ్గించుకోవచ్చు.


స్మాల్‌పీడీఎఫ్‌
ఇది బ్రౌజర్‌ రూపంలోనే కాదు, స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ రూపంలోనూ అందుబాటులో ఉంది. దీని వెబ్‌సైట్‌ను ఉచితంగానే వాడుకోవచ్చు. అయితే రోజుకు 2 ఫైళ్లు మాత్రమే కంప్రెస్‌ చేసుకోవచ్చు. ఎక్కువ ఫైళ్ల సైజు తగ్గించుకోవాలని అనుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.https://smallpdf.com/ వెబ్‌సైట్‌ లోకి వెళ్లి.. హోం స్క్రీన్‌ మీద కనిపించే ‘కంప్రెస్‌ పీడీఎఫ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. సైజు తగ్గించుకో వాలనుకుంటున్న ఫైలును ఎంచుకోవాలి. కావాలంటే బాక్స్‌లోకి డ్రాగ్‌ కూడా చేయొచ్చు. ఫైల్‌ అప్‌లోడ్‌ అయ్యాక ‘బెస్ట్‌ కంప్రెషన్‌’ ఫైల్‌ లేదా ‘స్ట్రాంగ్‌ కంప్రెషన్‌’ ఫైల్‌ ఆప్షన్‌లో అవసరమైనది ఎంచుకోవాలి. బేసిక్‌ కంప్రెషన్‌ను ఉచితంగానే వాడుకోవచ్చు. స్ట్రాంగ్‌ కంప్రెషన్‌ ఆప్షన్‌ అతి తక్కువ సైజుకు ఫైలును తగ్గిస్తుంది. కాకపోతే క్వాలిటీ తగ్గుతుంది. దీనికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఫైల్‌ అప్‌లోడ్‌ అయ్యాక ‘కంప్రెస్‌’ ఆప్షన్‌ మీద నొక్కితే సైజు తగ్గుతుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.


ప్రివ్యూ
మ్యాక్‌ వాడేవారికైతే బిల్టిన్‌గానే ప్రివ్యూ టూల్‌ అందుబాటులో ఉంటుంది. ముందుగా ప్రివ్యూ ద్వారా పీడీఎఫ్‌ ఫైలును ఓపెన్‌ చేయాలి. ఒకవేళ ఈ ఆప్షన్‌ డిఫాల్ట్‌గా లేనట్టయితే ఫైలు మీద రైట్‌ క్లిక్‌ చేసి.. ఓపెన్‌ విత్‌ ప్రివ్యూను ఎంచుకోవాలి. అనంతరం ఫైల్‌ మీద నొక్కి ఎక్స్‌పోర్ట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత కింద కనిపించే రిడ్యూజ్‌ ఫైల్‌ సైజ్‌ సదుపాయాన్ని క్లిక్‌ చేస్తే సైజు దానంతటదే తగ్గుతుంది. చివరికి సేవ్‌ చేసుకుంటే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని