ఎండకు ఫోన్‌ జాగ్రత్త!

ఫోన్‌ బ్యాటరీ పేలిపోయే ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఫోన్‌ బ్యాటరీ అతిగా ఛార్జింగ్‌ కావటం ఇలాంటి ఘటనలకు దారితీస్తుంటుంది.

Published : 03 May 2023 00:02 IST

ఫోన్‌ బ్యాటరీ పేలిపోయే ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఫోన్‌ బ్యాటరీ అతిగా ఛార్జింగ్‌ కావటం ఇలాంటి ఘటనలకు దారితీస్తుంటుంది. మొబైల్‌ ఫోన్‌ను చూస్తుండగా ముఖం మీదే  పేలిపోవటంతో ఇటీవల కేరళలో ఎనిమిదేళ్ల అమ్మాయి మరణించటం ఆందోళన రేకెత్తించింది. ఫోన్‌ను మరీ ఎక్కువగా వాడటం వల్ల అది వేడెక్కి పేలిపోయినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆ ఫోన్‌ బ్యాటరీని మార్చారని, ఇది ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. బ్యాటరీలోని కణాలు ఛార్జింగ్‌ అయ్యే క్రమంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం వస్తున్న ఫోన్లు, బ్యాటరీలు పలు దశల్లో రక్షణ వ్యవస్థలను కలిగి ఉంటున్నప్పటికీ అతిగా వేడెక్కితే పేలిపోయే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ఎండాకాలంలో వీటి విషయంలో మరింత జాగ్రత్త అవసరం.

* ఫోన్‌కు నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. వేడిని పుట్టించే వాటికి దూరంగా ఉంచాలి.

* ఫోన్‌ను కారులో గానీ డ్యాష్‌బోర్డు మీద గానీ విడిచి వెళ్లొద్దు. ఎండ బాగా కాసే రోజుల్లో ఇది మరింత ముఖ్యం.

* ఛార్జింగ్‌ అవుతున్నప్పుడు ఫోన్‌తో మాట్లాడొద్దు. వేడి వాతావరణంలో దీన్ని అసలే విస్మరించొద్దు. ఛార్జింగ్‌ చేసినప్పుడు చల్లబడిన తర్వాతే ఫోన్‌తో మాట్లాడాలి.

* అధీకృత కంపెనీలు తయారుచేసిన ఛార్జర్లు, కేబుళ్లు మాత్రమే వాడాలి. చవక, నకిలీ ఛార్జర్లతో ఫోన్‌ బాగా వేడెక్కే ప్రమాదముంది. ఇతరత్రా సమస్యలకూ కారణం కావొచ్చు. ఇవి ఫోన్‌ పేలిపోవటానికి దారితీయొచ్చు.

* ఇప్పుడు చాలా ఫోన్లు ఫూర్తిగా ఛార్జ్‌ అయ్యాక వాటంతటవే ఛార్జ్‌ చేసుకోవటం ఆపేస్తున్నాయి. అయినా కూడా ఫోన్‌ను మరీ ఎక్కువగా ఛార్జ్‌ చేయకపోవటమే మంచిది. ఛార్జ్‌ అయ్యాక ఛార్జర్‌ను ప్లగ్‌లోంచి బయటకు తీయటం ఉత్తమం.

* ఫోన్‌ మరీ వేడెక్కుతున్నట్టు గమనిస్తే టర్న్‌ ఆఫ్‌ చేయాలి. పూర్తిగా చల్లబడ్డాకే తిరిగి వాడుకోవాలి.

* ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. దీంతో బగ్స్‌ ఫిక్స్‌ అవుతాయి. సెక్యూరిటీ పెరుగుతుంది. దీంతో అతిగా వేడెక్కటం వంటి సమస్యలను తప్పించుకోవచ్చు.

* ఛార్జింగ్‌ అవుతున్నప్పుడు ఫోన్‌ను దిండు వంటి మెత్తటి వస్తువుల కింద పెడితే అతిగా వేడెక్కి, మంట అంటుకునే ప్రమాదముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు