ట్విటర్‌ ఫొటోలు వెతికేదెలా?

సామాజిక మాధ్యమాల్లో ట్విటర్‌ శక్తి మనకు తెలిసిందే. తక్షణం సమాచారాన్ని చేరవేయటానికిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక్క ట్వీట్లు మాత్రమే కాదు.. ట్విటర్‌లో ఇమేజ్‌లకూ కొదవలేదు.

Updated : 17 May 2023 07:03 IST

సామాజిక మాధ్యమాల్లో ట్విటర్‌ శక్తి మనకు తెలిసిందే. తక్షణం సమాచారాన్ని చేరవేయటానికిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక్క ట్వీట్లు మాత్రమే కాదు.. ట్విటర్‌లో ఇమేజ్‌లకూ కొదవలేదు. ప్రతిక్షణం లెక్కలేనన్ని ఫొటోలు ఇందులో వచ్చి చేరుతుంటాయి. వీటిల్లో అవసరమైనవాటిని వెతుక్కో వటమెలా? ఇందుకు కొన్ని వెబ్‌సైట్లు సాయం చేస్తాయి.


ట్విటర్‌ సెర్చ్‌

ట్విటర్‌ ఫొటోలను వెతకటానికి ఉత్తమమైన మార్గం ట్విటర్‌ సెర్చ్‌ సదుపాయమే. ఇది రోజురోజుకీ మెరుగవుతూ వస్తోంది. శక్తిమంతంగా మారుతోంది. ఇది విశ్వసనీయ శోధన సాధనంగానూ ఉపయోగపడగలదని కొందరు నమ్ముతున్నారు కూడా. ట్విటర్‌ వెబ్‌ యాప్‌తో తేలికగా ఇమేజ్‌లను పట్టుకోవచ్చు. పైన కుడిమూలన కనిపించే సెర్చ్‌ బాక్స్‌లో వెతకాలనుకునే అంశాన్ని టైప్‌ చేయాలి. అప్పుడు టాప్‌, లేటెస్ట్‌, పీపుల్‌, ఫొటోస్‌, వీడియోస్‌ విభాగాల వారీగా వివరాలు కనిపిస్తాయి. ఇందులో ఫొటోస్‌ను ఎంచుకుంటే అంశానికి సంబంధించిన ఫొటోలు ప్రత్యక్షమవుతాయి. అంశం సెర్చ్‌ బాక్సు పక్కన అడ్డం మూడు చుక్కలను నొక్కి, అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ ద్వారా మరింత కచ్చితంగానూ వెతుక్కోవచ్చు.


గూగుల్‌

ట్విటర్‌ మీది ఇమేజ్‌లను శోధించటానికీ గూగుల్‌ ఉపయోగపడుతుంది. ఇందుకోసం site:twitter.com అని టైప్‌ చేయాలి. దీని తర్వాత ఇమేజ్‌లకు సంబంధించిన పదాన్ని టైప్‌ చేయాలి. ఉదాహరణకు- ట్విటర్‌లో ఇండియా ఫొటోలను వెతకాలనుకుంటే గూగుల్‌ ఇమేజెస్‌లో  site:twitter.com india అని టైప్‌ చేయాలి. అప్పుడు దానికి సంబంధించిన ఫొటోలే కనిపిస్తాయి.


ట్వీట్‌డెక్‌

ఒకప్పుడిది థర్డ్‌ పార్టీ యాప్‌గా ఉండేది. దీన్ని ట్విటర్‌ కొనేసింది. దీని ద్వారా నచ్చిన అంశాల్లో ట్విటర్‌ కంటెంట్‌ ఫీడ్స్‌ను సృష్టించుకోవచ్చు. అనంతరం కేవలం ఫొటోలతో కూడిన ట్వీట్లు మాత్రమే కనిపించేలా సెట్‌ చేసుకోవచ్చు కూడా. ఇందుకోసం ముందుగా ట్వీట్‌డెక్‌ యాప్‌ను ట్విటర్‌ ఖాతాతో అనుసంధానం చేయాలి. తర్వాత అప్పటికే ఉన్న హోం ఫీడ్‌ను వాడుకోవచ్చు. లేదా పూర్తిగా కొత్త ఫీడ్‌నూ సృష్టించుకోవచ్చు. ఎడమ వైపున ఉండే యాడ్‌ కాలమ్‌ బటన్‌ను నొక్కి ప్రత్యేక జాబితా, యూజర్‌, కలెక్షన్‌, ట్రెండింగ్‌ జాబితా, ఫీడ్‌ ఆఫ్‌ లైక్స్‌ వంటివి జత చేసుకోవచ్చు. మెయిన్‌ విండోలో ఫీడ్‌ ప్రత్యక్షమయ్యాక ఫిల్టర్‌ గుర్తు మీద నొక్కి, ట్వీట్స్‌ విత్‌ ఇమేజ్‌స్‌ ఎంచుకోవాలి.


బింగ్‌ విజువల్‌ సెర్చ్‌

మన ఫీడ్‌ మీద ఏదైనా ఫొటో అనుమానాస్పదంగా కనిపించినా, అలాంటి ఫొటోలను చూడాలనుకున్నా ట్విటర్‌లో రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ను ప్రయత్నించొచ్చు. ఆ ఫొటోను డౌన్‌లోడ్‌ చేసో, స్క్రీన్‌షాట్‌ తీసో బింగ్‌ విజువల్‌ సెర్చ్‌ వంటి వాటిల్లో వెతకొచ్చు. రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ ద్వారా మనం అప్‌లోడ్‌ చేసిన మీడియాకు కచ్చితంగా సరిపోయే అంశాలను చూసుకోవచ్చు. బింగ్‌ విషయానికి వస్తే ఇది కేవలం ట్విటర్‌లో ఉన్నవాటినే కాదు, మొత్తం వెబ్‌నంతా గాలించి మన ముందుంచుతుంది. ఆల్‌ విభాగంలో అన్ని వివరాలు కనిపిస్తాయి. పేజెస్‌ విత్‌ దిస్‌ ఇమేజ్‌ను ఎంచుకుంటే అలాంటి ఫొటోలతో కూడిన వెబ్‌సైట్ల జాబితా ప్రత్యక్షమవుతుంది. రిలేటెడ్‌ కంటెంట్‌ ఫీచర్‌తోనైతే కొన్ని వివరాలతో అసలు ఫొటోలను చూసుకోవచ్చు.


గూగుల్‌ సోషల్‌ సెర్చ్‌

సోషల్‌ మీడియా అంశాల కోసం గూగుల్‌ ప్రత్యేక వర్షన్‌ కూడా ఉంది. అదే గూగుల్‌ సోషల్‌ సెర్చ్‌. https://www.social-searcher.com/google-social-search/ ద్వారా కేవలం ఆయా సామాజిక మాధ్యమాల అంశాలనే శోధించొచ్చు. ఇందులో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, లింక్డ్‌ఇన్‌ వంటి విభాగాలు కనిపిస్తాయి. ట్విటర్‌ బటన్‌ మీద క్లిక్‌ చేసి, వెతకాలని అనుకుంటున్న అంశాన్ని టైప్‌ చేయాలి. అనంతరం ఇమేజ్‌ విభాగాన్ని ఎంచుకుంటే దానికి సంబంధించిన ఫొటోలే ప్రత్యక్షమవుతాయి. సోషల్‌ సెర్చర్‌ వెబ్‌సైట్‌ https://www.social-searcher.com/ కూడా ఇలాంటి పనే చేసి పెడుతుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని