WhatsApp: వాట్సాప్‌లో కాల్ లింక్‌.. ఎలా చేయాలి, ఎన్ని రోజులు ఉంటుంది?

ఇతర వీడియో యాప్‌ల తరహాలో వాట్సాప్‌ గ్రూపు కాలింగ్‌ ఫీచర్‌ను యూజర్లకు అధిక సంఖ్యలో యూజర్లకు పరిచయం చేయాలని వాట్సాప్‌ భావిస్తోంది. ఇందుకోసం కొత్తగా ఫీచర్‌ను పరిచయం చేసింది. మరి, ఆ ఫీచరేంటి? దాని ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం.

Published : 23 Oct 2022 20:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జూమ్‌, గూగుల్‌ మీట్‌ తరహాలో ఎక్కువ మంది ఒకే సారి గ్రూపు కాల్‌లో పాల్గొనేందుకు వీలుగా వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. వాట్సాప్‌ క్రియేట్‌ కాల్‌ లింక్‌ (Create Call Link) అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే పలువురు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇతర యాప్‌లకు దీటుగా గ్రూప్‌ కాలింగ్ ఫీచర్‌ను యూజర్లకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు వాట్సాప్ చెబుతోంది. ఇంతకీ, ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలంటే...

  • వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేసి చాట్‌ పేజీలో కాల్స్‌ ఐకాన్‌పై క్లిక్ చేస్తే క్రియేట్ కాల్‌ లింక్‌ ఫీచర్‌ కనిపిస్తుంది. 
  • దానిపై క్లిక్ చేస్తే కాల్‌ టైప్‌ - ఆడియో/వీడియో (Call Type- Audio/Video), సెండ్‌ లింక్‌ వయా వాట్సాప్‌ (Send Link Via WhatsApp), కాపీ లింక్‌ (Copy Link), షేర్ లింక్‌ (Share Link) ఆప్షన్లు కనిపిస్తాయి. 
  • వీటన్నింటికి పైన యూజర్‌ ఎంచుకున్న కాల్‌ టైప్‌ ఆధారంగా లింక్‌ క్రియేట్ అవుతుంది. ఆ లింక్‌ను యూజర్‌ వాట్సాప్‌ ద్వారా ఇతరులకు పంపడంతోపాటు , కాపీ లేదా షేర్‌ చేయొచ్చు. 
  • ఇతర యూజర్లు సదరు లింక్‌పై క్లిక్ చేస్తే జాయిన్‌, లీవ్‌ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో జాయిన్‌పై క్లిక్‌ చేస్తే గ్రూపు కాల్‌లో పాల్గొనవచ్చు. యూజర్‌ ఒకసారి క్రియేట్ చేసిన లింక్‌ 90 రోజులపాటు ఉపయోగించుకోవచ్చని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై వాట్సాప్‌ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 
  • ఈ లింక్‌ ద్వారా ఒకేసారి ఎంతమంది గ్రూప్‌ కాల్‌లో పాల్గొనవచ్చు అనే దానిపై కూడా స్పష్టత లేదు. ప్రస్తుతం ఉన్న అప్‌డేట్‌ ప్రకారం వాట్సాప్‌లో ఒకేసారి 32 మంది పాల్గొనవచ్చు. త్వరలో ఈ సంఖ్యను పెంచనున్నట్లు సమాచారం. 
  • ఇటీవలే వాట్సాప్‌ గ్రూపు సభ్యుల సంఖ్యను 512 నుంచి 1024కి పెంచే దిశగా పరీక్షలు ప్రారంభించింది. ఈ ఫీచర్‌ను గ్రూపు కాలింగ్‌కు కూడా పరిచయం చేస్తారని తెలుస్తోంది. 

దీంతోపాటు వాట్సాప్ అవతార్‌ క్రియేట్ ఫీచర్‌ను పలువురు ఆండ్రాయిడ్ యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్‌ తనకు నచ్చిన అవతార్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. దాని ఆధారంగా వాట్సాప్‌ కొత్త స్టిక్కర్‌ ప్యాక్‌ను యూజర్‌కు ఇస్తుంది. అందులోని అవతార్‌లను యూజర్‌ ఇతరులతో షేర్‌ చేయడంతోపాటు ప్రొఫైల్‌ ఫొటో/డీపీగా పెట్టుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని