మెయిల్‌కు ఏఐ జోష్‌!

ఛాట్‌ జీపీటీ రాకతో కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం గురించి ఇటీవల బాగానే చర్చించుకుంటున్నారు. దీంతో రోజువారీ వ్యవహారాలు చాలా మారిపోయాయి.

Updated : 15 Feb 2023 06:11 IST

ఛాట్‌ జీపీటీ రాకతో కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం గురించి ఇటీవల బాగానే చర్చించుకుంటున్నారు. దీంతో రోజువారీ వ్యవహారాలు చాలా మారిపోయాయి. ఈమెయిళ్లను రాయటం, పంపటమూ తేలికైపోయింది. ఏఐ ఆధారిత ఈమెయిళ్లతో ఆటోమేటెడ్‌ ప్రతిస్పందనలు గణనీయంగా పురోగతి సాధించాయి. అందుకే చాలా సంస్థలు మెయిళ్ల మెరుగుకు ఏఐ టూల్స్‌ను వాడుకుంటున్నాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు ఇవీ..

జెనరేటివ్‌ ఏఐ

కృత్రిమ మేధ పరికరాలు చేయగల అతి సులువైన పని ఈమెయిళ్లను రాసి పెట్టటం. దీనికి మంచి ఉదాహరణ క్యానరీ యాప్‌. ఇది మెయిల్‌కు అవసరమైన కీలక పదాలను సూచిస్తుంది. మన తరఫున మెయిల్‌ను రాసి పెడుతుంది. ఇది సమయాన్ని ఆదా చేయటమే కాదు.. అంశానికి తగినట్టుగా మెయిల్‌ ఉండేలా చూస్తుంది. గత మెయిళ్లను దృష్టిలో పెట్టుకొని ఆ శైలిలోనే రాయటానికి సాయం చేస్తుంది.

మెయిల్‌ నిర్వహణ

మెయిళ్లను రాయటమే కాదు.. వాటిని ఒక క్రమపద్దతిలో విభజించుకోవటానికి, నిర్వహించుకోవటానికీ ఏఐ టూల్స్‌ ఉపయోగ పడుతున్నాయి. లెవిటీ.ఏఐ ఇలాంటిదే. మెయిళ్లకు సంబంధించి రోజువారీ పనులకిది తోడ్పడుతుంది. మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో మెయిళ్లను అంశాల వారీగా వర్గీకరిస్తుంది. అంతేకాదు ఇన్‌బాక్స్‌లోకి వచ్చే మెయిల్‌ను గుర్తించి, దాని తీరుతెన్నులను అర్థం చేసుకొని ప్రాధాన్యాన్ని అంచనా వేస్తుంది కూడా.

కాపీలు రాయటానికీ

ప్రేరణాత్మకమైన, మెప్పించి ఒప్పించే మెయిళ్లను సృష్టించటానికీ ప్రస్తుతం చాలా కంపెనీలు ఏఐ టూల్స్‌ను వాడుకుంటున్నాయి. దీనికి ఓ ఉదాహరణే జాస్పర్‌.ఏఐ టూల్‌. ఇది ఆయా వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని, వారికి తగినట్టుగా మెయిళ్లను సృష్టిస్తుంది. వ్యాపార ప్రకటనలను ప్రచారం చేయటానికీ ఉపయోగపడుతుంది. ఇది 26 భాషల్లో కాపీలను రాయగలదు. .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని