Twitter: ట్వీట్లు స్క్రీన్‌షాట్ తీయొద్దంటున్న ట్విటర్‌.. కారణం ఇదేనా!

ట్వీట్లను స్క్రీన్‌షాట్‌ తీయొద్దని ట్విటర్‌ యూజర్లను కోరుతోంది. వాటికి బదులు ట్వీట్ షేర్‌ లేదా ట్వీట్‌ లింక్‌ కాపీ చేయమని సూచిస్తుంది. ట్విటర్‌ ఈ సూచన ఎందుకు చేస్తుందని యూజర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated : 11 Oct 2022 13:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ట్విటర్‌లో  ఏదైనా ట్వీట్‌ నచ్చితే ఇతరులు చూసేందుకు రీట్వీట్ చేస్తాం. ఒకవేళ వ్యక్తిగతంగా స్నేహితులు, బంధువులతో షేర్‌ చేసుకోవాలంటే స్క్రీన్‌షాట్‌ తీసి వారికి పంపుతాం. తాజా సమాచారం ప్రకారం ట్వీట్లు స్క్రీన్‌ షాట్లు తీయొద్దని ట్విటర్‌ యూజర్లను కోరుతుందట. దానికి బదులు ట్వీట్‌ షేర్‌ లేదా ట్వీట్‌ లింక్‌ కాపీ చేసుకోమని సూచిస్తుందని పలువురు టెక్‌ టిప్‌స్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సూచన కొద్దిమంది ట్విటర్‌ యూజర్లకు మాత్రమే కనిపిస్తుంది. ట్విటర్‌ను యూజర్లకు మరింత చేరువచేసేందుకు షేర్‌ ట్వీట్‌ (Share Tweet) , కాపీ లింక్‌ (Copy Link) ఫీచర్లను తీసుకొస్తున్నట్లు సమాచారం. 

‘‘రోజూ ట్విటర్‌ నుంచి ఇతర ఫ్లాట్‌ఫామ్‌లలోకి కొన్ని మిలియన్ల ట్వీట్లు షేర్ అవుతుంటాయి. వాటిని యూజర్లకు సులువుగా చేరువచేసేందుకు షేర్ ట్వీట్‌, కాపీ లింక్‌ ఫీచర్లను తీసుకొస్తున్నాం. యూజర్లు స్క్రీన్‌షాట్‌కు బదులు, ట్వీట్‌ షేర్‌ లేదా లింక్‌ కాపీ చేసి షేర్‌ చేస్తే ట్విటర్‌ ఖాతా లేని వ్యక్తులు సైతం వాటిపై క్లిక్ చేస్తారు. దీంతో వారు కూడా ట్విటర్‌ ఖాతా ఓపెన్‌ చేసేందుకు ఆసక్తి వ్యక్తపరుస్తారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఐఓఎస్‌ బీటా యూజర్ల ద్వారా పరీక్షిస్తున్నాం. త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని ట్విటర్‌ అధికార ప్రతినిధి ఒక టెక్‌ వార్తా సంస్థకు తెలిపారు. 

ఖాతాలేనివారు కూడా ట్విటర్‌ ఉపయోగించుకునేలా కొత్త ఫీచర్‌ను గత నెల రోజులుగా ట్విటర్‌ పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌తో ట్విటర్ ఖాతాలేని వారు కూడా ట్వీట్లు చేయడంతోపాటు 50 మందిని ఫాలో కావచ్చు. కానీ, వారికి రీట్వీట్‌, లైక్‌ ఫీచర్లు పనిచేయవు. ట్వీట్‌ ఎడిట్‌ బటన్‌ను కూడా ట్విటర్‌ తీసుకొస్తుంది. ట్వీట్‌ చేసిన తర్వాత అందులో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే యూజర్‌ ట్వీట్‌ను ఎడిట్ చేయెచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అమెరికాలో ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను అన్ని ప్రాంతాల్లోని యూజర్లకు పరిచయం చేస్తామని ట్విటర్‌ తెలిపింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని