Twitter: కీలక సెక్యూరిటీ ఫీచర్‌ పనిచేయడంలేదు.. చూసుకోండి.. ట్విటర్‌ సూచన!

కొద్దిరోజుల క్రితం ట్విటర్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చిన యూజర్లకు కీలక సూచన చేసింది. అకౌంట్ లాగిన్ పాస్‌వర్డ్‌ రీసెట్‌కు సంబంధించి బగ్‌ ఉన్నట్లు ప్రకటించింది.

Published : 25 Sep 2022 21:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సైబర్‌ నేరగాళ్ల నుంచి భద్రత కోసం మనం ఉపయోగించే ఆన్‌లైన్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లు తరచుగా మారుస్తుంటాం. కొద్దిరోజుల క్రితం ట్విటర్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చిన యూజర్లకు కీలక సూచన చేసింది. అకౌంట్ లాగిన్ పాస్‌వర్డ్‌ రీసెట్‌కు సంబంధించి బగ్‌ ఉన్నట్లు ప్రకటించింది. దీనివల్ల ట్విటర్‌లో ముఖ్యమైన సెక్యూరిటీ ఫీచర్‌ పనిచేయడంలేదని, యూజర్లు ఒకసారి తమ ఖాతాలను చెక్‌ చేసుకోవాలని సూచించింది. యూజర్లు తమ ట్విటర్‌ ఖాతాలను వేర్వేరు డివైజ్‌లలో లాగిన్ వివరాలను సేవ్ చేస్తుంటారు. కొత్తగా పాస్‌వర్డ్‌ మార్చినప్పుడు గతంలో లాగిన్‌ వివరాలను సేవ్‌ చేసిన డివైజ్‌లలో ఖాతా లాగౌట్‌ కావడంలేదు. దీని వల్ల యూజర్‌ ట్విటర్‌ ఖాతాలను ఇతరులు యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. మొబైల్ యాప్‌ యూజర్లకు ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రకటనలో పేర్కొంది. 

ట్విటర్‌ సిస్టమ్స్‌కు సంబంధించి ఇటీవలే కొన్ని మార్పులు చేసింది. వీటి తర్వాతే ఈ సమస్య తలెత్తినట్లు వెల్లడించింది. ఇటీవలి కాలంలో పాస్‌వర్డ్‌లు మార్చిన యూజర్లు తమ ఖాతాలను అన్ని డివైజ్‌ల నుంచి లాగౌట్‌ చేసి, కొత్త పాస్‌వర్డ్‌ సాయంతో లాగిన్ చేసుకోవాలని సూచించింది. దానితోపాటు ట్విటర్‌ సెట్టింగ్స్‌లో యాక్టివ్‌ ఓపెన్ సెషన్స్‌లోకి వెళ్లి ఖాతా యాక్టివిటీని చెక్ చేసుకోవాలని కోరింది. ఇటీవలే ట్విటర్‌ మాజీ సెక్యూరిటీ హెడ్‌ కంపెనీ సెక్యూరిటీ నిబంధనలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికన్‌ ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా ట్విటర్‌ సెక్యూరిటీ నిబంధనల విషయంలో అలసత్వం వహిస్తోందని, ఆటోమేటిక్‌ వ్యవస్థల పనితీరును అంచనా వేయడంలో కంపెనీ విఫలమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పాస్‌వర్డ్ లాగిన్‌ బగ్‌పై ట్విటర్‌ ప్రకటన చేయడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని